గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీ పరిణామాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చిన ఆ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ లాయర్ కపిల్ సిబల్ ఆ పార్టీని వీడారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ లో కొనసాగిన ఈ పొలిటీషియన్ ఆ పార్టీతో బంధాన్ని తెంచుకున్నట్టుగా ప్రకటించిన వెంటనే.. రాజ్యసభ సభ్యత్వానికి ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం.
యూపీ కోటా నుంచి రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికల్లో కపిల్ సిబల్ ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు. కపిల్ కు సమాజ్ వాదీ పార్టీ మద్దతు ఇవ్వనుందని తెలుస్తోంది.
ఇటీవలే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ చెప్పుకోదగిన స్థాయిలో సీట్లను నెగ్గింది. ఈ బలంతో ఆ పార్టీ ముగ్గురు రాజ్యసభ సభ్యులను పంపగలదు. ఈ నేపథ్యంలో స్వతంత్ర హోదాలో కపిల్ సిబల్ ను రాజ్యసభకు పంపడానికి ఎస్పీ మొగ్గు చూపింది. ఈ మద్దతుతో ఆ సీనియర్ పొలిటిషియన్ రాజ్యసభలో ఎంట్రీకి నామినేషన్ వేశారు.
గతంలో కపిల్ సిబల్ ఢిల్లీ నుంచి వరసగా లోక్ సభకు ఎన్నికవుతూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చిత్తయినప్పటి నుంచి ఆయన మళ్లీ నెగ్గలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత అంశాలపై కూడా కపిల్ స్పందిస్తూ వచ్చారు. సోనియా, రాహుల్ ల తీరు గురించి బాహాటంగా వ్యతిరేక స్వరం వినిపించారు.
ఇక కపిల్ కు సుప్రీం కోర్టు లాయర్ గా ఎంతో అనుభవం ఉంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నో కేసుల్లో పని చేశారు. ఇక లాయర్ గా భారీ చార్జ్ ను వసూలు చేసే వారిలో ఒకరిగా పేరు. కోట్ల రూపాయల ఆస్తులు కూడా కపిల్ సిబల్ సొంతం.
అంతే కాదు.. యువకుడిగా ఉన్నప్పుడు సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఐఏఎస్ కు ఎంపిక అయినా.. దాన్ని వద్దనుకుని లాయర్ వృత్తిని చేపట్టిన నేపథ్యం ఉంది కపిల్ సిబల్ కు! ఐఏఎస్ ను తృణప్రాయంగా వదులుకుని మనసుకు నచ్చిన లాయర్ వృత్తిని చేపట్టి.. జాతీయ స్థాయిలో రాజకీయ నేతగా ఎదిగారు కపిల్.