మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్‌గజపతిరాజుపై ఎంపీ విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. విశాఖలో శుక్రవారం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మాన్సస్ ట్రస్ట్‌లో వందల ఎకరాలు కాజేసిన దొంగ అశోక్ గజపతిరాజు అని ఘాటు విమర్శ చేశారు.
అశోక్ గజపతిరాజుపై గతంలో ఫోర్జరీ కేసు కూడా ఉందన్నారు. అశోక్ గజపతిరాజు జైలుకి వెళ్లడం ఖాయమని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. అశోక్ గజపతిరాజు విజయనగరం జిల్లాకు రాజులా ఫీలవుతున్నారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.
మాన్సస్ ట్రస్ట్, సింహాచలం చైర్మన్‌ల నియామకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు లింగ వివక్ష చూపొద్దని గతంలో తీర్పు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేరళలో అయ్యప్ప స్వామి ఆలయ ప్రవేశంపై లింగ వివక్ష పాటించొద్దని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు.
కానీ అశోక్ గజపతిరాజు లింగ వివక్ష చూపిస్తున్నారని విజయసాయిరెడ్డి వాపోయారు. పురుషులతో పాటు మహిళలను సీఎం జగన్ సమానంగా గౌరవిస్తారన్నారు. మాన్సస్ ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా సంచయిత నియామకాన్ని హైకోర్టు రెండు రోజుల క్రితం రద్దు చేసిన నేపథ్యంలో విజయసాయిరెడ్డి పైన పేర్కొన్న విధంగా మాట్లాడారు.
సంచయిత నియామకాన్ని హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేయడంతో డివిజన్ బెంచ్‌కు వెళ్లాలని ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. మరోవైపు హైకోర్టు తీర్పు తనకు అనుకూలంగా రావడంతో అశోక్‌గజపతిరాజు మాన్సస్ ట్రస్ట్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ వ్యవహారం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి ఇరు వైపులా పేలుతున్న మాటల తూటాలే నిదర్శనం.