అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి సంక్షేమమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు ముఖ్యమంత్రి జగన్. నవరత్నాల అమలు, రాష్ట్రాభివృద్ధి తప్ప మరే అంశంపై ఆయన దృష్టి పెట్టలేదు. మరీ ముఖ్యంగా కొన్ని రోజులుగా టీడీపీ, చంద్రబాబును పూర్తిగా పక్కనపెట్టేశారు.
బాబుపై విమర్శలు చేయడం కూడా వేస్ట్ అనే అభిప్రాయానికొచ్చేశారు. అలా చాన్నాళ్లుగా గ్యాప్ ఇచ్చిన జగన్, మరోసారి బాబుకు చురకలు అంటించారు.
ఉద్యోగాల కల్పన విషయంలో గతంలో బాబు చేసిన మోసపూరిత ప్రకటనల్ని చదివి వినిపించారు. మభ్యపెట్టిన మాటల్ని గుర్తుచేశారు. మరీ ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో బాబు తీసుకున్న యూటర్న్ వల్ల రాష్ట్రం పడుతున్న ఇబ్బందుల్ని గుర్తుచేశారు.
“రాష్ట్ర విభజన టైమ్ లో లక్షా 40వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు చంద్రబాబు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోని చెత్తబుట్టలో వేశారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా, ప్రత్యేక హోదా ద్వారా ప్రైవేటు రంగంలో రావాల్సిన లక్షల ఉద్యోగాలకు తూట్లు పొడిచారు.
అప్పటివరకు లేని ప్రత్యేక ప్యాకేజీ కోసం, ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడం కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. అవకాశం ఉన్న రోజుల్లో బాబు రాజీపడడం వల్ల, ఇప్పుడు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి హోదా ఇవ్వమంటూ రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితికొచ్చాం.”
ఇలా చంద్రబాబు యూటర్న్ రాజకీయాల్ని, ఉద్యోగ హామీ విషయంపై బాబు తప్పిన విధానాన్ని గుర్తుచేశారు జగన్. అప్పుడు చంద్రబాబు గట్టిగా నిలబడితే స్పెషల్ స్టేటస్ వచ్చి ఉండేదని, ఇప్పుడు కేంద్రంలో సంకీర్ణం లేకపోవడంతో.. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి అడగడం తప్ప ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నామంటూ బాధపడ్డారు జగన్. అయితే ఈ పరిస్థితులు మారతాయని, ఎప్పటికైనా రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
“గతంలో మాటలతో ఎలా మోసం చేశారో అందరం చూశాం. అప్పట్లో ఫలానా వ్యక్తి (బాబు) వస్తే జాబు వస్తుందన్నారు. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామన్నారు. ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. కానీ రెండూ లేవు. ఎన్నికలకు 3 నెలల ముందు మాత్రం ఓ పెద్ద డ్రామా నడిపారు.”
తన హయాంలో అలాంటి మోసపూరిత చర్యలుండవన్నారు జగన్. గతంలో చంద్రబాబు ఇస్తామంటూ హామీ ఇచ్చిన ఉద్యోగాలతో పాటు, ఈ రెండేళ్లలో ఏకంగా 6 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు. ఇకపై కూడా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ ఉంటుందని, క్యాలెండర్ ప్రకారం విద్యార్థులంతా పరీక్షలకు సన్నద్ధం అవ్వాలని ప్రోత్సహించారు.
క్యాలెండర్ ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో 10143 ఉద్యోగాలు భర్తీ చేయబోతోంది జగన్ సర్కారు. ఇకపై ఏటా ఇలానే క్యాలెండర్ రిలీజ్ చేసి మరీ ఉద్యోగాల్ని భర్తీ చేస్తామన్న ముఖ్యమంత్రి.. రాబోయే రోజుల్లో చదవుకున్న ప్రతి వ్యక్తికి ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు.