పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తన ప్రత్యర్థి సువేందు అధికారిపై మరో పోరాటానికి సిద్ధమయ్యారు. అది న్యాయ పోరాటం. సువేందు అధికారి ఒకప్పుడు మమతా బెనర్జీకి ఎంతో నమ్మకస్తుడైన నేత. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ పథకంలో భాగంగా సువేందు ఆ పార్టీలో చేరాడు.
నందిగ్రామ్‌లో సువేందు, మమతాబెనర్జీ హోరాహోరీ తలపడ్డారు. ఒక దశలో మమతాబెనర్జీ గెలుపొందారనే వార్తలు దేశ వ్యాప్తంగా ప్రచారమయ్యాయి. కానీ చివరికి సువేందు తన సమీప ప్రత్యర్థి మమతాబెనర్జీపై 2 వేల ఓట్ల తేడాతో గెలిచినట్టు ఎన్నికల సంఘం ప్రకటించి షాక్ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో సువేందు గెలుపుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మమతాబెనర్జీ న్యాయపోరాటానికి దిగారు. ఈ మేరకు ఆమె కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది.
లంచం, విద్వేషాన్ని వ్యాప్తి చేయడం, మతం ప్రాతిపదికన ఓట్లను కోరడంతో పాటు బూతులను ఆక్రమించడం వంటి అవినీతి కార్యకలాపాలకు పాల్పడిన నేపథ్యంలో సువేందు ఎన్నికల చెల్లదని ప్రకటించాలని ఆమె కోరారు.
అలాగే లెక్కింపులోనూ, ఫామ్ 17సిలో తేడాలున్నట్టు తన పిటిషన్‌లో ఆమె పేర్కొన్నారు. రీకౌంటింగ్ చేయాలన్న తన అభ్యర్థనను ఎలక్షన్ కమిషన్ తోసిపుచ్చడాన్ని ఆమె ప్రశ్నించారు. సువేందుపై ఎన్నికల్లో గెలిచేందుకు పోరాడిన మమతాబెనర్జీ, ఎన్నికల అనంతరం కూడా మరో పోరాటానికి సిద్ధం కావడం విశేషం.
మొత్తానికి బీజేపీపై అలుపెరగని పోరాట యోధురాలిగా మమతాబెనర్జీ దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు, అభిమానాన్ని చూరగొన్నారు. మమతాబెనర్జీ పిటిషన్‌పై కోల్‌కతా హైకోర్టు ఎలా స్పందిస్తుందో అనే ఉత్కంఠ నెలకుంది.