ఈ సారి క‌థ వేరే అంటున్న లోకేశ్‌!

2024లో ఏపీలో అధికారం త‌మ‌దేన‌ని, అప్పుడు క‌థ వేరేగా ఉంటుంద‌ని అధికార వైసీపీని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రించారు. అధికార పార్టీ ఆగ‌డాల‌కు వ‌డ్డీతో స‌హా రుణాన్ని తానే…

2024లో ఏపీలో అధికారం త‌మ‌దేన‌ని, అప్పుడు క‌థ వేరేగా ఉంటుంద‌ని అధికార వైసీపీని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రించారు. అధికార పార్టీ ఆగ‌డాల‌కు వ‌డ్డీతో స‌హా రుణాన్ని తానే స్వ‌యంగా చెల్లిస్తాన‌ని తేల్చి చెప్పారు. 

కర్నూలు జిల్లా పెసరవాయిలో గురువారం హత్యకు గురైన టీడీపీ నేతలు నాగేశ్వర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి కుటుంబాలను లోకేశ్‌ పరామర్శించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన జ‌గ‌న్ స‌ర్కార్‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.  

వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత 27 మంది టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను పొట్ట‌న పెట్టుకున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. అయినా తాము భ‌య‌ప‌డేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు సింహాల్లాంటి వార‌ని చెప్పుకొచ్చారు. ఈ సారి అధికారంలోకి వ‌స్తే, గ‌తంలో మాదిరిగా మెత‌క‌వైఖ‌రితో ప‌రిపాల‌న సాగించ‌మ‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌తి దానికి వ‌డ్డీతో స‌హా వైసీపీ వాళ్ల‌కు తానే రుణం చెల్లిస్తాన‌ని హెచ్చ‌రించారు.

వైసీపీ అరాచకాలకు తాము భయపడి పారిపోయే వాళ్లం కాదన్నారు. ప్రజల తరఫున పోరాడుతున్న వారిపై దాడులు చేస్తారా? అని ఆయ‌న‌ ప్రశ్నించారు. వైసీపీ చేతిలో హ‌త్య‌కు గురైన నాగేశ్వర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి కుటుంబాల‌కు పార్టీ అండగా ఉంటుంద‌న్నారు. బాధిత కుటుంబాల‌ను అన్ని రకాలుగా ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు.

టీడీపీ కార్యకర్తలను బెదిరించి, నాయకులను చంపితే వెనక్కి తగ్గుతామని అనుకుంటున్నారా? మిమ్మల్ని వదిలిపెట్టమ‌ని అధికార పార్టీ నేత‌ల‌ను హెచ్చ‌రించారు. త‌మ‌ కార్యకర్తలను భయపెడితే పార్టీకి నష్టం తేవచ్చని ప్ర‌త్య‌ర్థులు అనుకుంటున్నార‌ని, అలా అనుకోవడం చాలా పొరపాట‌ని లోకేశ్ అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజారెడ్డి రాజ్యాంగం న‌డుస్తోంద‌ని మండిప‌డ్డారు.

అధికార పార్టీ నేత‌లు మంచి పని చేయాలంటే అభివృద్ధి చేయాల‌ని హిత‌వు చెప్పారు. రాయలసీమకు కొత్త పరిశ్రమలు తీసుకు రావాల‌ని కోరారు. అలాగే సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయాల‌ని డిమాండ్ చేశారు. కానీ ఇవేవీ చేత‌కాకే త‌మ‌ కార్యకర్తలు, నేతలపై ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

త‌మ‌ ఓపికను పరీక్షించొద్ద‌ని హెచ్చ‌రించారు. బీ కేర్‌ఫుల్‌… సమయం వస్తుందని ఘాటు హెచ్చ‌రిక చేశారు. అప్పుడు నేతలు, రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్న అధికారులకు గుణపాఠం చెప్పే బాధ్యతను తాను వ్యక్తిగతంగా తీసుకుంటానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు.