ద్యేవుడా ద్యేవుడా… జ‌గ‌న్ కోరిక అదే!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు భార‌మ‌య్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుకు అధిక ప్రాధాన్యం ఇస్తూ వ‌చ్చారు. ఎక్క‌డెక్క‌డి డ‌బ్బంతా తీసుకెళ్లి, సంక్షేమ…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు భార‌మ‌య్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుకు అధిక ప్రాధాన్యం ఇస్తూ వ‌చ్చారు. ఎక్క‌డెక్క‌డి డ‌బ్బంతా తీసుకెళ్లి, సంక్షేమ ప‌థ‌కాల‌కే ఖ‌ర్చు పెడుతున్నారు. చివ‌రికి ఉద్యోగుల‌కు జీతాలైనా ఆల‌స్యంగా ఇస్తారే త‌ప్ప‌, పింఛ‌న్ల‌ను మాత్రం ప్ర‌తి నెలా ఒక‌టో తారీఖునే అంద‌జేస్తున్నారు.

మ‌రోవైపు సంక్షేమ ప‌థ‌కాల‌ను ప‌క్కాగా అమ‌లు చేస్తుండ‌డంతో మ‌ళ్లీ జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తార‌నే భ‌యం ప్ర‌తిప‌క్షాల్ని వెంటాడుతోంది. ప్ర‌తి ఏడాది ల‌క్ష‌ల్లో ఉచితంగా ల‌బ్ధి పొందుతున్న వాళ్లు జ‌గ‌న్‌ను ఎందుకు వ్య‌తిరేకిస్తార‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. ఈ ప‌థ‌కాలు ఇట్లే మిగిలిన రెండేళ్లు అమ‌లైతే మాత్రం, జ‌గ‌న్‌ను ఢీకొట్ట‌డం క‌ష్ట‌మ‌నే ఆందోళ‌న‌లో ప్ర‌తిప‌క్ష పార్టీలు ఉన్నాయి. 

ఎలాగైనా సంక్షేమ ప‌థ‌కాల అమలును అడ్డుకోవాల‌నే కుట్ర‌కు ప్ర‌తిప‌క్షాలు తెర‌లేపాయ‌నే ఆరోప‌ణ‌లు వైసీపీ నుంచి వ‌స్తున్నాయి. అయితే సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు ప్ర‌భుత్వానికి ఆర్థికంగా భారం అయ్యింద‌న‌డంలో సందేహం లేదు. భారం త‌గ్గితే బాగుంటుంద‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కూడా కోరుకుంటున్నారు. అయితే సంక్షేమ పులిపై స్వారీ చేస్తున్న జ‌గ‌న్‌, ఒక్క‌సారిగా నిలుపుద‌ల చేస్తే, అది పూర్తిగా రివ‌ర్స్ అవుతుంది. కాబ‌ట్టి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులొచ్చినా జ‌గ‌న్ త‌న‌కు తానుగా సంక్షేమ ప‌థ‌కాల అమ‌లును ఆప‌లేరు.  

కానీ అది తాను చేయ‌కుండా, ప్ర‌త్య‌ర్థుల వేళ్ల‌తో పేద‌ల క‌ళ్లు పొడిస్తే రాజ‌కీయంగా త‌న‌కు లాభిస్తుంద‌ని జ‌గ‌న్ ఉద్దేశం. ప్ర‌తిప‌క్ష పార్టీల కుట్ర‌ల వ‌ల్లే సంక్షేమ పథ‌కాలు ఆగిపోయాయ‌నే ప్ర‌చారాన్ని జ‌గ‌న్ కోరుకుంటున్నారు. సంక్షేమ ప‌థ‌కాల‌ను జ‌గ‌న్ కొన‌సాగిస్తుంటే, కోర్టుకెళ్లి అడ్డుకున్నార‌నే ప్ర‌చారం జ‌ర‌గాల‌ని ఆయ‌న కోరుకుంటున్నారు. దీని వ‌ల్ల ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌ల‌న్న చందంగా… ప్ర‌భుత్వంపై ఆర్థిక భారం పోవ‌డం, అలాగే ప్ర‌తిప‌క్షాల‌పై ల‌బ్ధిదారుల్లో వ్య‌తిరేక‌త పెరిగి, త‌న‌కు లాభిస్తుంద‌ని జ‌గ‌న్ అనుకుంటున్నారు. ఈ చ‌ర్చంతా ఎందుకంటే ఉచిత ప‌థ‌కాల అమ‌లుపై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం వ‌ల్లే.

ఎన్నికల సమయంలో ఉచిత హామీలతో రాజ‌కీయంగా ల‌బ్ధి పొందాల‌ని అనుకుంటున్న పార్టీల‌పై  క్రిమినల్‌ కేసులు పెట్టాలని కోరుతూ బీజేపీ నేత అశ్విన్‌ కుమార్‌ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ హిమాకోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారణ చేప‌ట్టింది.

సీనియ‌ర్ న్యాయ‌వాది క‌పిల్ సిబ‌ల్ అభిప్రాయాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం కీల‌క ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ పార్టీలు ఉచిత తాయిలాలతో ఓటర్లను ప్రలోభపెట్టకుండా ఆర్థిక సంఘం జోక్యం కోరవచ్చా? ఈ విష‌య‌మై ఆలోచించాల‌ని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఓటర్లకు ఉచిత పథకాల రూపంలో లంచం ఇవ్వడమే అని, త‌ద్వారా ప్ర‌లోభాల‌కు గురి చేయ‌డంగా సుప్రీంకోర్టు భావిస్తున్న‌ట్టు ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం.

దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే సంక్షేమ ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్నాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ఉచిత ప‌థ‌కాల‌పై సుప్రీంకోర్టు లేదా కేంద్ర ప్ర‌భుత్వం ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా… మొద‌ట ప్ర‌భావం ప‌డేది ఏపీపైన్నే. ఒక‌వేళ ల‌బ్ధిదారుల‌కు న‌ష్టం క‌లిగించేలా ఆదేశాలు వ‌స్తే మాత్రం … ప్ర‌తిప‌క్షాలే కార‌ణ‌మ‌ని వైసీపీ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తుంద‌న‌డంలో రెండో మాటే లేదు. నిజానికి వైసీపీ కూడా ఇదే కోరుకుంటోంది. 

ఉచిత ప‌థ‌కాల నిరోధానికి కీల‌క ఆదేశాలొస్తే మాత్రం… జ‌గ‌న్ నెత్తిన పాలు పోసిన‌ట్టే. సుప్రీంకోర్టులో విచార‌ణ నేప‌థ్యంలో అలాంటి ఉత్త‌ర్వులు రావాల‌ని ఆ దేవుడిని జ‌గ‌న్‌, వైసీపీ నేత‌లు కోరుకుంటార‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు.