టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరీ అంత పనిలేకున్నారా?….ఇదీ తాజాగా నెటిజన్లు వేస్తున్న ప్రశ్న. చంద్రబాబుతో సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు భేటీ అనంతరం సోషల్ మీడియాలో బాబు విశ్రాంతిపై సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబుతో మోహన్‌బాబు భేటీ అయిన సమయాన్ని ఎల్లో మీడియా నొక్కి చెప్పడాన్ని గమనించొచ్చు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు ఇంటికి కూతురు మంచు లక్ష్మిని వెంటబెట్టుకుని మోహన్‌బాబు వెళ్లారు. వాళ్లిద్దరి మధ్య సహజంగానే రాజకీయ చర్చలు జరిగి వుంటాయి. ఆ వివరాల కంటే… వాళ్లిద్దరూ గంటన్నర సేపు భేటీ కావడమే విశేషం. తిరుపతి శ్రీవిద్యానికేతన్ వద్ద కొత్తగా నిర్మించిన సాయిబాబా గుడి, విగ్రహ ప్రతిష్ఠాపనకు రావాలని చంద్రబాబును ఆహ్వానించినట్టు మోహన్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఓకే గుడ్.
మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు పార్టీపై సీరియస్ దృష్టి పెట్టారు. ఎలాగైనా ఈ దఫా అధికారంలోకి రావాలనే గట్టి పట్టుదలతో ఆయన ఉన్నారు. ఈ నేపథ్యంలో మోహన్‌బాబుతో గంటన్నర సేపు సమావేశమయ్యేంత ఖాళీగా బాబు ఉన్నారా? అనేది నెటిజన్ల ప్రశ్న. మరోవైపు మోహన్‌బాబుపై ప్రశంసలు కురుస్తున్నాయి.
రాజకీయంగా, సినిమాల పరంగా ఒకప్పటితో పోల్చితే పెద్దగా యాక్టీవ్‌గా లేనప్పటికీ ప్రాధాన్యాన్ని క్రియేట్ చేసుకున్నందుకు అభినందనలు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మోహన్‌బాబుతో గంటలు, రోజుల తరబడి మాట్లాడినా ఒరిగేది ఏముంటుందని మరోవైపు చంద్రబాబుకు నెటిజన్లు చీవాట్లు పెట్టడం గమనార్హం. ఈ సమయాన్ని పార్టీ కోసం పని చేస్తున్న వాళ్ల కోసం సద్వినియోగం చేసుకుని వుంటే బాగుండేదని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఇలాంటి భేటీలతో బాబుకు ప్రయోజనం లేకపోగా, నెగెటివ్ సంకేతాలు తీసుకెళుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆ బాబుకు ఎటూ ఏ పని లేదు, ఈ బాబుకు కూడా లేదా? అనే ప్రశ్నలు ఉదయించడం విశేషం. మొత్తానికి చంద్రబాబు కూడా టైం పాస్ కోసం ఎవరొస్తారా అని ఎదురు చూస్తున్నట్టుగా కనిపిస్తోంది.