నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో కళ్యాణ్ రామ్. తన స్టైల్ లో తన సినిమాలు తాను నిర్మించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ప్రస్తుతం బింబిసార అనే సినిమా విడుదలకు రెడీగా వుంది. ఈ నేఫథ్యంలో ’గ్రేట్ ఆంధ్ర’ తో మాట్లాడారు కళ్యాణ్ రామ్. ఆ విశేషాలు.
చిన్నప్పుడు నేను చాలా ఆటిట్యూడ్ తో వుండేవాడిని. అల్లరి చేసేవాడిని. ఎంత అల్లరి అంటే 13 వ ఏట నాకు కారు డ్రైవింగ్ ఇవ్వకపోతే తలుపు తీసుకుని దూకేస్తా అని బెదిరించారు. ఓసారి నా క్లాస్ టీచర్ గట్టి క్లాస్ పీకారు. అదే నన్ను పూర్తిగా మార్చేసింది. ఏం చూసుకుని నీకు ఇంత ఆటిట్యూడ్. పెద్దాయిన (ఎన్టీఆర్) వల్ల నీకు ఈ లెవెల్ వచ్చింది అనుకుంటే ఆయనకు మాట రాకుండా ప్రవర్తించాలని తెలుసుకో..అంటూ క్లాస్ టీచర్ సుదీర్ఘంగా క్లాస్ పీకారు. దాంతో నేను పూర్తిగా మారిపోయా.
నా పిల్లలు అస్సలు అల్లరి చేయరు. ఒక్కోసారి అనుకుంటా..వాళ్లను మరీ ఎక్కువ డిసిప్లిన్ లో పెంచుతున్నానేమో..చిన్నతనం..అల్లరి మిస్ అవుతున్నారేమో అని. బాలయ్య బాబాయ్ కూడా చిన్నప్పుడు బాగా అల్లరేనట.
బింబిసార సినిమా చేయాలనుకున్నపుడు బాగా ఆలోచించాను. రాజు క్యారెక్టర్ కు నేను సూటవుతానా..కానా అని అనుకున్నా. ఎందుకుంటే ప్రేక్షకులకు రాజు అంటే ప్రభాస్ నే గుర్తుకు వస్తాడు. అంతలా మార్క్ వేసేసాడు. గెటప్ అదీ సెట్ చేసుకుని, చూసుకున్నాక ధైర్యం వచ్చింది. తారక్ ఫొటో చూసి బాగున్నావన్నా అన్నాక మరింత ధైర్యంగా ముందుకు వెళ్లాను.
కోవిడ్ టైమ్ మాకు బాగా కలిసి వచ్చింది. బింబిసార సబ్జెక్ట్ మీద బాగా గట్టిగా వర్క్ చేయడానికి వీలు అయింది. అన్నీ పెర్ ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవడం వల్ల బడ్జెట్ కూడా కాస్త తగ్గింది.
ఒకప్పుడు సినిమాల విషయంలో బడ్జెట్ రిస్క్ చేసేవాడిని. కానీ ఇప్పుడు కుటుంబాన్ని గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నా. ప్రొడక్షన్ వ్యవహారాలు మొత్తం పక్కన పెట్టి, హరి (బావమరిది)కి అప్పగించేసా.
కచ్చితంగా చెబుతున్నా, నూటకి నూరు శాతం అస్సలు డిస్సపాయింట్ చేయని సినిమాగా బింబిసార పేరు తెచ్చుకుంటుంది.