ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల నుంచి మనదేశంలో అత్యున్నత పదవిని అలంకరించిన ఘనత ముప్పవరపు వెంకయ్యనాయుడుకే దక్కింది. భారత ఉపరాష్ట్రపతిగా ఆయన తన పదవీకాలాన్ని పూర్తి చేసుకోబోతున్నారు.
అయితే తెలుగు రాష్ట్రాలనుంచి ఈ అత్యున్నత స్థానానికి వెళ్లిన వ్యక్తిగా మాత్రమే కాకుండా, ఇంకా చిరస్థాయిగా వెంకయ్యనాయుడు చరిత్రలో మిగిలిపోగల అవకాశం ఆయన ముంగిట నిలిచి ఉంది. ఆ అవకాశాన్ని ఆయన ఎంత మాత్రం సద్వినియోగం చేసుకుంటారో వేచిచూడాలి.
వెంకయ్యనాయుడు పదవీకాలం మరో రెండు వారాల్లో ముగియబోతోంది. ఇప్పుడు ఆయన ఏపీలో కేంద్ర ప్రాజెక్టులు ఏమేం జరుగుతున్నాయో.. ఏవి ఏయే దశల్లో ఉన్నాయో.. మంత్రుల్ని, అధికారుల్ని తన వద్దకు పిలిపించుకుని సమీక్షించారు. వాటికి సత్వరమే నిధులు విడుదల చేసి.. పనులు త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా ఆయన సూచించారు.
ఇలాంటి సమీక్షలను ఆయన గతంలో కూడా చాలా చాలా నిర్వహించారు. అయితే పనులు మాత్రం.. వాటి సహజమైన వేగంలోనే సాగుతున్నాయి. ఏదేమైనప్పటికీ.. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు తన సొంత రాష్ట్రం మీద ఉన్న శ్రద్ధ మాత్రం అభినందించతగినది.
అయితే.. కేవలం ఈ కేంద్ర ప్రాజెక్టులను ఏపీలో పూర్తి చేయించడం మాత్రమే కాదు.. ఇంకా అనల్పమైన ముద్రను ఆయన రాష్ట్రం మీద విడిచిపెట్టడానికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే వెంకయ్యనాయుడు అంటే.. ఒక మహనీయుడిగా నిలిచిపోగల అవకాశం ఆయన ఎదుట ఉంది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తిగా ఆయన సేవలందించారు. ఉపరాష్ట్రపతి పదవిని నిర్వహించారు. ఈ అనుభవాన్ని ఉపయోగించి ఆయన రాష్ట్రానికి ప్రత్యేకహోదాను సాధిస్తే గనుక.. యావత్ ప్రజలు ఆయన పేరును చిరస్మరణీయంగా భావిస్తారు. దేవుడిగా కూడా కొలుస్తారు.
ప్రత్యేకహోదా అనేది అయిదేళ్లు చాలదు.. పదేళ్లు కావాలని తాను ప్రతిపక్ష ఎంపీగా ఉండగా.. సభలో గళమెత్తి నినదించిన వ్యక్తి వెంకయ్యనాయుడు. చరిత్రలో ఆయనకు ఆ స్థానం ఎప్పటికీ ఉంది. కేంద్రమంత్రిగా ఆయనకు కొన్ని పరిమితులు ఉండవచ్చు. ఉపరాష్ట్రపతిగా చేతులు కట్టేయబడి ఉండొచ్చు. కానీ.. ఇప్పుడు ఆయన స్వేచ్ఛాజీవిగా మారబోతున్నారు.
ఈ అవకాశాన్ని పార్టీకోసం ఉపయోగించుకుంటారా.. ప్రజలకోసం ఉపయోగించుకుంటారా? అనేది ఆయన చేతుల్లో ఉంది. ఆయన తిరిగి పార్టీకి మార్గదర్శనం చేసే బాధ్యతల్లో మిగిలిపోతే ఒక ఎత్తు. కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే యజ్ఞంలో భాగమైతే మరో ఎత్తు.
కేంద్రం ఆనుపానులు తెలిసిన వ్యక్తిగా.. ఏ రకంగా పోరాడితే.. ప్రత్యేకహోదా వస్తుందో ఆయనకు తెలిసినంత మరెవ్వరికీ తెలియకపోవచ్చు. కాబట్టి.. ఆయన దీనిని సాధిస్తే బాగుంటుంది. చరిత్ర ఆయనను ఎప్పటికీ కూడా హీరోగా గుర్తుంచుకుంటుంది.