ఏపీ హోంమంత్రి తానేటి వనిత ప్రాతినిథ్యం వహిస్తున్న తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో మొత్తం 11 స్థానాల్లోనూ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో అధికార పార్టీ పరువు కాస్త పోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో మొత్తం 12 స్థానాలను వైసీపీ దక్కించుకుంది.
అక్కడ భూమన కరుణాకరరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వైసీపీలో అత్యంత కీలక నాయకుడు అయినప్పటికీ, అధికారం వచ్చినా ఎలాంటి పదవికి నోచుకోలేదు. కానీ ఏ ఎన్నిక జరిగినా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ, పార్టీని విజయ పథాన నడిపిస్తున్నారు. అయితే హోంమంత్రి వనిత ప్రాతినిథ్యం వహించే చోట కనీసం వైసీపీ అభ్యర్థులు పోటీ చేయకపోవడం వింతగా ఉంది.
పలు రాజకీయ పరిణామాల నేపథ్యంలో గోదావరి జిల్లాల్లో వైసీపీపై వ్యతిరేకత ఉందనే ప్రచారం నేపథ్యంలో, కొవ్వూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో టీడీపీ అన్ని స్థానాలను ఏకగ్రీవంగా దక్కించుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వైసీపీపై వ్యతిరేకత ఉందనేందుకు ఈ ఏకగ్రీవాల్ని నిదర్శనంగా తీసుకోవాలా? లేక అధికార పార్టీలో అసంతృప్తులు భారీగా ఉన్నాయని అర్థం చేసుకోవాలా? వనితకు పార్టీపై పట్టులేదని వైసీపీ పెద్దలు అర్థం చేసుకోవాలా?
ఏది ఏమైనా కొవ్వూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల పుణ్యమా అని వైసీపీది బలం కాదు వాపు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కొవ్వూరు కోఆపరేటివ్ బ్యాంక్ నూతన పాలక మండలి అధ్యక్షుడిని కూడా ఎన్నుకున్న తర్వాత రాజకీయాలు చేస్తే లాభం ఏంటి? ఎన్నికలకు ముందు జాగ్రత్తలు తీసుకుని వుంటే ప్రయోజనం వుండేది. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా, ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించారని జిల్లా సహకార అధికారికి వైసీపీ నేతలు తాజాగా ఫిర్యాదు చేశారు.
అసలు ఏం జరుగుతున్నదో తెలియనంత నిద్రమత్తులో అధికార పార్టీ నేతలు ఉన్నారా? సొంత నియోజకవర్గంలో కూడా పట్టు నిలుపుకోలేని దుస్థితిలో హోంశాఖ మంత్రి వనిత ఉంటే… రానున్న ఎన్నికల్లో ఆమె ఏం సాధిస్తారు? వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఎన్నికలోనూ ఆ పార్టీదే విజయం. అలాంటిది కొవ్వూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్లో మాత్రం అందుకు భిన్నమైన ఫలితం రావడం… రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీకి షాక్ అని చెప్పొచ్చు. ఈ ఫలితం టీడీపీలో ధైర్యాన్ని నింపుతుందనడంలో సందేహం లేదు.