పేద ప్రజల కోసం ప్రభుత్వాలు అమలు చేసే ఉచిత పథకాల గురించి ఇప్పుడు దేశంలో సర్వత్రా చర్చ జరుగుతోంది. ‘ఉచితం’లో ఉన్న ఔచిత్యాన్ని ప్రశ్నించడం మాత్రమే కాదు. వాటిని పూర్తిగా నిషేధించడం కోసం కూడా ఒక పోరాటం జరుగుతోంది. ఉచిత పథకాలతో సమాజానికి ముప్పు వాటిల్లుతుందంటూ.. ప్రధాని నరేంద్రమోడీ ‘మిఠాయి సంస్కృతి’ గురించి వ్యాఖ్యానించి కొన్ని వారాలైనా గడవక ముందే.. మళ్లీ ఉచిత పథకాల గురించి వినిపిస్తోంది. ప్రజలకు ఉచిత హామీలు ఇచ్చే పార్టీల గుర్తింపునే రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడమే దీనికి కారణం.
ఈ నేపథ్యంలో అసలు ఉచిత పథకాల మీద మీ వైఖరి ఏంటంటూ.. సుప్రీం కోర్టు కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేంద్రం వైఖరి ఏమిటో తెలిస్తే దానిని బట్టి.. తీర్పు ఇవ్వగలం అని పేర్కొంది. ఉచిత హామీల విషయంలో పార్టీలను నియంత్రించడం తమ వల్ల కాదని ఎన్నికల సంఘం పేర్కొన్న నేపథ్యంలో.. ఇప్పుడు బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టి.. ఈ వ్యవహారంలో తీర్పు చెప్పాలని సుప్రీం ప్రయత్నించడం విశేషం.
ప్రధాని నరేంద్రమోడీ ఉచిత పథకాలకు వ్యతిరేకం కావొచ్చు గాక. అంతమాత్రాన ఆయన ఆధ్వర్యంలోని కేంద్రం గానీ, వివిధ బిజెపి పాలిత రాష్ట్రాలు గానీ.. ఎలాంటి ఉచిత పథకాలు అమలు చేయకుండా మనగలగడం లేదు.రాజకీయ ప్రసంగాల్లో మోడీ ఉచిత పథకాలను ఈసడించవచ్చు గానీ.. కేంద్రప్రభుత్వ విధాన నిర్ణయంగా అఫిడవిట్ రూపంలో ఆ విషయాన్ని సుప్రీంకు నివేదిస్తారని అనుకోవడం భ్రమ.
అయితే ఉచిత పథకాలను నిషేధించే విషయంలో కోర్టు చర్చ సందర్భంగా మరి కొన్ని కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. సీనియర్ న్యాయనిపుణుడు, కేంద్ర మాజీ మంత్రి, మాజీ కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్ ఈ విషయంలో కొన్ని కీలకమైన సూచనలు చేశారు. ఉచిత పథకాలు ఉండాలా వద్దా అనే విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోవడం కుదరదని, ఒకవేళ నిర్ణయం తీసుకున్నా కూడా.. అది రాజకీయ రంగు పులుముకుంటుందని ఆయన అన్నారు. ఆ పాయింట్ నిజమే.
అయితే కపిల్ సిబల్ చెబుతున్న వాదన ఏంటంటే.. రాష్ట్రాలకు నిధులు ఆర్థిక సంఘమే ఇస్తుంది కాబట్టి.. వారు నియంత్రించడానికి అవకాశం ఉంటుందనేది. ఇది జరుగుతుందో లేదో ఫైనాన్స్ కమిషన్ ను అడిగి తెలుసుకోవాలని సిబల్ సూచించారు.
అయితే.. ఆర్థిక సంఘం రాష్ట్రాలకు నిధులు ఇస్తుందని మనం అనుకుంటాం గానీ.. ఆ ఆర్థిక సంఘం నిధులు ఎక్కడినుంచి తెచ్చి ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలనుంచి వసూలు అయ్యే పన్నుల నుంచి మాత్రమే కదా. అలాంటప్పుడు రాష్ట్రప్రభుత్వాలనే శాసించగల అధికారం ఫైనాన్స్ కమిషన్ కు ఎలా వస్తుంది.. అనే అనేక రకాల సందేహాలు దీని వెనుక ఉన్నాయి.
రాష్ట్రాల మధ్య ప్రజల జీవన స్థితిగతులు, రాష్ట్రాల రాబడి లాంటి అనేక కోణాల్లో అసమానతలు ఉన్నప్పుడు.. ఏయే రాష్ట్రాలు ఎలాంటి పథకాలు అమలు చేయాలో.. మరొకరు ఎలా నిర్ణయించగలరు? అనేది కీలకం.
ఉచిత పథకాల గురించి ప్రధాని సుద్దులు చెప్పడమూ.. ఎవరో పిల్ వేస్తే సుప్రీం కోర్టు చర్చ నడిపించడమూ.. ఇవన్నీ కూడా ఓకే. కానీ.. 150 కోట్ల జనాభా, అందులో అత్యధికం పేదలు, వేల సంఖ్యలో రాజకీయ పార్టీలు ఉన్న ఈ దేశంలో.. వీటిని ఆపడం అంత సులువైన సంగతి కాదు.