ఈటల రాజేందర్ ని పార్టీ నుంచి, పదవి నుంచి సాగనంపిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా బీసీలకు జై కొడుతున్నారు. బీసీ మంత్రులు, ప్రజా ప్రతినిధులను చేరదీస్తున్నారు. అదే సందర్భంలో ఉద్యమ నాయకులకు కూడా పెద్దపీట వేస్తున్నారు.
టీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత ఆ స్థాయిలో ఉద్యమాన్ని ముందుకు నడిపించిన వ్యక్తి హరీష్ రావుకి కూడా ఈ దశలో ప్రాధాన్యం దక్కుతోంది. ఇటీవల తెలంగాణలో ఆస్పత్రుల అభివృద్ధి కోసం వేసిన సబ్ కమిటీకి హరీష్ రావే నేతృత్వం వహించడం విశేషం.
అంతే కాదు.. ఈటల తొలగింపు తర్వాత ఆరోగ్య శాఖ విషయంలో కూడా హరీష్ మాటే చెల్లుబాటు అవుతోంది. ఈటలను తొలగించిన తర్వాత వైద్య, ఆరోగ్య శాఖను, సీఎం కేసీఆర్ తన వద్దే ఉంచుకున్నా పరోక్షంగా పర్యవేక్షణ బాధ్యతలు హరీష్ రావుకి అప్పగించారు. ఇటీవల మీడియా కూడా హరీష్ చుట్టూ తిరగడం మరో విశేషం.
అప్పుడు అల్లుడు అల్లం.. ఇప్పుడు బెల్లం..
కేసీఆర్ తొలి కేబినెట్ లో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నారు హరీష్ రావు, రెండో దఫా అధికారం చేపట్టాక మేనల్లుడ్ని పక్కనపెట్టారు మామ. అలా హరీష్ రావుకి ప్రాధాన్యం తగ్గిపోయింది. ఆ టైమ్ లో హరీష్ రావు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఖాళీ చేశారు, కీలకమైన నామినేటెడ్ పదవులకు రాజీనామా చేశారు. బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లారనే వార్తలు కూడా బలంగా వినిపించాయి.
అయితే హరీష్ వాటన్నిటికీ చెక్ పెట్టారు, తానెవరితో మాట్లాడలేదని, ప్రాణం ఉన్నంత వరకు టీఆర్ఎస్ లోనే ఉంటానని, కేసీఆరే తమ నాయకుడని వివరణ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో హరీష్ కి ఆర్థిక శాఖను కట్టబెట్టినా, పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలన్నీ కేసీఆర్ తనయుడు కేటీఆర్ చూసుకునేవారు. దీంతో హరీష్-కేసీఆర్ మధ్య గ్యాప్ మరింత పెరిగిందనే ప్రచారం ఊపందుకుంది. కొడుకు భవిష్యత్ కోసమే కేసీఆర్, హరీష్ కి ప్రాధాన్యం తగ్గించారని అనుకున్నారంతా.
ఈటల ఎపిసోడ్ తో మారిన పరిణామాలు..
ఈటలని సాగనంపిన తర్వాత మరోసారి హరీష్ రావు పార్టీలో కీలకంగా మారుతున్నారు. హుజూరాబాద్ సహా.. కరీంనగర్ రాజకీయాలను ప్రభావితం చేయగల ఈటలకు చెక్ పెట్టాలంటే.. బలమైన ఉద్యమ నాయకుడ్ని అక్కడ ప్రచారంలోకి దింపాలని భావించారు కేసీఆర్.
గంగుల కమలాకర్ లాంటివారిని తెరపైకి తెచ్చినా, వారి ఉద్యమ నేపథ్యాన్ని ఈటల తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ దశలో హుజూరాబాద్ ఉప ఎన్నికల గెలుపు భారం హరీష్ పై పెట్టారు కేసీఆర్. ఇప్పటినుంచే ఆయనకు ప్రాధాన్యమిస్తూ పావులు కదుపుతున్నారు.
హరీష్ కి మంచి అవకాశం..
ఒకరకంగా హరీష్ రావుకి కూడా ఇది మంచి అవకాశం. పార్టీలో కేసీఆర్, కేటీఆర్ తప్ప ఇంకేపేర్లూ వినిపించని సమయంలో ఈటల ఎపిసోడ్ హరీష్ కి బాగా కలిసొచ్చింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించగలిగితే.. హరీష్ రావుకి తిరుగులేకుండా పోతుంది.
మరో రెండేళ్లలో తెలంగాణలో ఎన్నికలు వస్తాయి. ఈ దశలో పార్టీలో తన స్థానాన్ని పటిష్టపరుచుకోవడానికి, కేసీఆర్ కు మరింత దగ్గరవ్వడానికి హరీష్ కు ఇంతకుమించిన ఛాన్స్ దొరకదు.