మహేష్ బాబు తన మహర్షి సినిమా మీట్ లో చేసిన ప్రసంగం అంతా ఒకఎత్తు. ఇప్పటి డైరక్టర్లు కథ వుంటే అస్సలు వెయిట్ చేయడంలేదు. మరో హీరో దగ్గరకు వెళ్లిపోతున్నారని కామెంట్ చేయడం మరోఎత్తు. ఇది కచ్చితంగా దర్శకుడు సుకుమార్ మీదే అని మీడియా ఫిక్స్ అయిపోయినట్లుంది. అందుకే ఆ దిశగా వార్తలు వండి వార్చారు. వాస్తవానికి మహేష్ చెప్పింది కూడా కరెక్టే.
ఒకప్పుడు హీరోల మధ్య కథలకు తేడాలు వుండేవి. ఎన్టీఆర్ కు నప్పితే ఏఎన్నార్ కు నప్పదు. కృష్ణ చేసే కథలు ఆయనే చేయాలి. ఆ విధంగా. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. అంతా దాదాపు ఒకే ఏజ్ గ్రూప్, యంగ్ హీరోలు. మజిలీ కథ చేతులు మారినదే. జెర్సీ కథ ఒకరిద్దరు హీరోలు విన్నదే. ఇలా చాలా కథలు ఈ హీరో నుంచి ఆ హీరోకి, ఆ హీరో నుంచి ఈ హీరోకి వెళ్తూ వస్తున్నాయి.
ఒకే హీరో కోసం అయితే అల్లుకున్న కథలో మార్పులు చేర్పులు చేస్తూ ఒప్పించే వరకు అక్కడే వుండే పరిస్థితి వుండేది. కానీ ఇప్పడు డైరక్టర్లు తమ స్క్రిప్ట్ లో మార్పులు చేయడానికి అంతగా అంగీకరించడం లేదు. దాంతో స్క్రిప్ట్ లు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి బదిలీ అయిపోతున్నాయి.
సుకుమార్ కూడా తను మహేష్ తో చేయాలనుకున్న కథనే ఎన్టీఆర్ దగ్గరకు, అలాగే బన్నీ దగ్గరకు తీసుకెళ్లినట్లు గుసగుసలు వున్నాయి. బహుశా అందుకే మహేష్ అన్యాపదేశంగా అలా కామెంట్ చేసి వుండొచ్చు. కామెంట్ వరకు ఓకె.
కొన్నాళ్ల క్రితం బన్నీతో సినిమా ప్రకటించాక కూడా సుకుమార్-మైత్రీ మూవీస్ నిర్మాతలు చెన్నయ్ వెళ్లి మహేష్ ను షూటింగ్ స్పాట్ లో కలిసి వచ్చారు. దాంతో ప్యాచప్ అయిందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రసంగం చూస్తుంటే సుకుమార్ తో మరి సినిమా వుంటుందా? అన్న అనుమానాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.