ఇది ఇప్పటిమాట కాదు. తను కూడా సొంతంగా ఓ బ్యానర్ పెడతానని బన్నీ ప్రకటించినప్పట్నుంచి ఈ పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నప్పుడు కూడా అల్లుఅర్జున్ కు అల్లు అరవింద్ కు అభిప్రాయ బేధాలు వచ్చాయంటూ కథనాలు వచ్చాయి. ఎట్టకేలకు వీటన్నంటిపై స్పందించాడు బన్నీ.
తండ్రితో తనకు విబేధాలు ఉన్నాయనే పుకారును బన్నీ కొట్టిపారేశాడు. ఇప్పటికీ తన కుటుంబం తండ్రితోనే కలిసి ఉంటోందని తెలిపాడు. అంతేకాదు, ప్రతిరోజు తామిద్దరం కలుసుకుంటామని, ఇలాంటి పుకార్లు వచ్చినప్పుడు ఎంచక్కా నవ్వుకుంటామని కూడా అన్నాడు. ఓ అంతర్జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఇలా క్లారిటీ ఇచ్చాడు బన్నీ.
బన్నీ చెప్పడం వరకు బాగానే ఉంది కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అలా కనిపించడం లేదు. ప్రస్తుతం తన తండ్రి నిర్మాణంలోనే ఓ సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. కేవలం మొదటి షెడ్యూల్, మొదటిరోజు షూటింగ్ కు మాత్రమే అల్లు అరవింద్ వచ్చారు. ఇక ఆ తర్వాత నుంచి నిర్మాణ వ్యవహారాలన్నీ బన్నీనే చూసుకుంటున్నాడు. అంతేకాదు, త్వరలోనే తను కూడా సొంతంగా ఓ బ్యానర్ పెట్టబోతున్నాడు.
అటు మల్టీప్లెక్సు బిజినెస్ కు సంబంధించి కూడా తండ్రికొడుకుల మధ్య అభిప్రాయబేధాలు ఉన్నట్టు తెలుస్తోంది. కేవలం సినిమాలపైనే ఫోకస్ పెట్టాలని తండ్రి సూచిస్తే, వ్యాపార రంగంలో కొత్తగా ట్రై చేయాలని చూస్తున్నానని, దయచేసి అడ్డురావొద్దని బన్నీ కాస్త సున్నితంగానే తండ్రికి చెప్పినట్టు తెలుస్తోంది. ఇలా ఓవైపు బన్నీ ఖండిస్తున్నప్పటికీ, మరోవైపు తండ్రికొడుకుల అనుబంధంపై గాసిప్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి.