మహర్షి సినిమా జమా ఖర్చుల విషయంలో నిర్మాతలు ముగ్గురు మధ్య ఏర్పడిన మల్లగుల్లాలు ఒక కొలిక్కి వచ్చినట్లే. ముగ్గురు నిర్మాతల్లో ఒకరైన అశ్వనీదత్ కు ప్రొడక్షన్ బాధ్యతలు చూసిన దిల్ రాజుకు మధ్య జరిగిన చర్చలు ఫల ప్రదంగా ముగిసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొంత మొత్తాన్ని లాభంగా అశ్వనీదత్ కు ఇచ్చి, ఇక సినిమాతో ఆయనకు ఏ సంబంధం లేదు అని ఓ ఇన్ సైడ్ అగ్రిమెంట్ చేయించుకునే విధంగా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.
అంటే ఇక సినిమాపై వచ్చే రెవెన్యూలెక్కలు, ఓవర్ ఫ్లోస్, ఇతరత్రా వ్యవహారాలతో అశ్వనీదత్ కు సంబంధం వుండదన్నమాట. అయితే ఇలా అగ్రిమెంట్ చేయడానికి అశ్వనీదత్ కు ఎంత ఇచ్చారన్నది క్లారిటీగా బయటకు రాలేదు. అయిదు కోట్లు కావాలని అశ్వనీదత్ అడిగినట్లు, దానికి కాస్త తక్కువగానే ఓకె అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అశ్వనీదత్ కూడా తన దేవదాస్ బకాయిల విషయంలో ఇప్పటికే ఈస్ట్, నెల్లూరు బయ్యర్లతో డిస్కషన్లు పూర్తిచేసారు. సునీల్ తో సోమవారం డిస్కషన్ వున్నట్లు తెలుస్తోంది.
అంటే సినిమా లాభనష్టాలతో సంబంధం లేకుండా అశ్వనీదత్ కు సెటిల్ అయిపోయినట్లే. మరి మరో నిర్మాత పివిపి పరిస్థితి తెలియాల్సి వుంది. పివిపి తనకు కనీసం పదికోట్లు లాభంగా ఇవ్వాలని కోరుతున్నట్లు బోగట్టా. ఎందుకంటే మహేష్ కు అశ్వనీదత్ ఇచ్చిన అడ్వాన్స్ పై వడ్డీని ఏడుకోట్ల మేరకు పివిపి తగ్గించుకున్నారు. అశ్వనీదత్ మహేష్ కు అడ్వాన్స్ ఇవ్వడానికి పివిపి సంస్థలోనే అప్పు తీసుకున్నారు. ఆ అడ్వాన్స్, వడ్డీ కలిపి 21 కోట్ల వరకు అయితే, దాన్ని 13.5 కోట్లకు తగ్గించారు.
ఆ విధంగా తాను ఏడు కోట్లు నష్టపోయానని, అందువల్ల కనీసం పదికోట్లు అయినా లేకపోతే, సినిమాలో భాగస్వామిగా వుండి ప్రయోజనం ఏమిటని పివిపి ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అదే సమయంలో పివిపి మాత్రం, అశ్వనీదత్ మాదిరిగా అవుట్ రేట్ గా సినిమా ఓవర్ ఫ్లోస్, ఇతరత్రా వ్యవహారాలను నుంచి తప్పుకుంటూ అగ్రిమెంట్ రాసి ఇచ్చే ఆలోచనలో వున్నారా? అన్నది అనుమానం.
ఎందుకంటే పదికోట్లు ఇచ్చినా, పివిపికి మూడుకోట్లే వచ్చినట్లు లెక్క. అందుకే ఆ విధమైన అగ్రిమెంట్ కు పివిపి ఓకె అనకపోవచ్చు. కానీ ఏమైనా ఈ రోజో, రేపో ఈ లెక్కలు కూడా తెలిసే అవకాశం వుంది.