మహర్షి ఫ్రీరిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో జరిగింది. అభిమానులు భారీగా తరలి వచ్చారు. ప్రతి ఒక్క టెక్నీషియన్ చాలా హుషారుగా ప్రసంగించారు. ప్రతి ఒక్కరి మాటల్లో సినిమా మీద వున్న నమ్మకం పూర్తిగా తొంగి చూసింది. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి పూర్తిగా అభిమానులకు హమీ ఇచ్చారు. ఓ బ్లాక్ బస్టర్ అందిస్తున్నామని.
మహేష్ బాబు సినిమా గురించి పెద్దగా మాట్లాడలేదు కానీ, టెక్నీషియన్లు అందరికీ పేరు పేరునా థాంక్స్ చెప్పారు. ఇది మహేష్ 25వ సినిమా అందువల్ల ఆయన తన కెరీర్ లో టర్నింగ్ పాయింట్ ల్లాంటి సినిమాలు ఇచ్చిన కొందరు దర్శకులను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
తొలి సినిమా దర్శకుడు రాఘవేంద్రరావు, ఫ్యామిలీలకు దగ్గర చేసిన కృష్ణవంశీ, విదేశం లో మంచి మార్కెట్ ఇచ్చిన త్రివిక్రమ్, మాస్ కు దగ్గర చేసిన శ్రీనువైట్ల, మాంచి నటన నేర్పిన గుణశేఖర్, సరైన టైమ్ లో రెండు సక్సెస్ లు ఇచ్చిన కొరటాల శివ లను గుర్తు చేసుకున్నారు. వంశీ పైడిపల్లి సంగతి సరేసరి.
కానీ మహేష్ కెరీర్ లో మరిచిపోలేని సినిమా పోకిరి. ఆ సినిమా డైరక్టర్ పూరి జగన్నాధ్ ను మాత్రం మహేష్ గుర్తు చేసుకోలేదు. ఇది మరిచిపోవడమా? అనుకోకుండా జరిగిందా? ఏమో? కానీ కొద్దిసేపటికే మహేష్ పూరి జగన్నాధ్ గురించి ట్వీట్ వేసారు. తాను మరిచిపోయానని, పోకిరి సినిమాను మరిచిపోలేనని, తనను ఆ సినిమా సూపర్ స్టార్ ను చేసిందని.
ఇక ఒక్క డైరక్టర్ మిగిలిపోయారు. సుకుమార్. మహేష్ కు ఫ్లాప్ అయినా, మంచి సినిమాగా పేర్కొనే వన్..సినిమా డైరక్టర్ సుకుమార్ ను కూడా మహేష్ పేర్కొనలేదు. ఇటీవలే సుకుమార్ తో చేయాల్సిన సినిమా ఆగిపోయి, వాయిదా పడిన సంగతి తెలిసిందే. మరి అదే కారణమా? ఏమో? పూరి గురించి ట్వీట్ వేసినా, సుకుమార్ ను మాత్రం పూర్తిగా వదిలేసారు.