ఈ రెండు సినిమాల మధ్య ఎలాంటి సంబంధం లేదు. స్టోరీలైన్ లో కూడా కామన్ పాయింట్స్ లేవు. కానీ జనాలు మాత్రం ఇప్పుడీ రెండు సినిమాల్ని కలిపి మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం నిర్మాత దిల్ రాజు. అవును.. శ్రీనివాస కల్యాణం సినిమాను నిర్మించిన దిల్ రాజే, ఇప్పుడు మహర్షికి కూడా నిర్మాత. అయితే మహర్షి సినిమాను శ్రీనివాస కల్యాణంతో పోల్చడానికి ఓ ప్రత్యేకమైన రీజన్ ఉంది.
శ్రీనివాస కల్యాణం విడుదలకు ముందు దిల్ రాజు చాలా మాట్లాడాడు. ఇంకా చెప్పాలంటే అప్పటివరకు దిల్ రాజు అలా మాట్లాడ్డం ఎవరూ చూడలేదు. తన కెరీర్ లోనే బెస్ట్ మూవీగా శ్రీనివాసకల్యాణం నిలిచిపోతుందన్నాడు దిల్ రాజు. కట్ చేస్తే, ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. దిల్ రాజు అంచనా లెక్కతప్పింది. అంతేకాదు, ఈ సినిమా నుంచే దిల్ రాజు అంచనాలు తప్పడం కూడా స్టార్ట్ అయ్యాయి.
కట్ చేస్తే ఇప్పుడు మరోసారి దిల్ రాజు మైక్ అందుకున్నాడు. శ్రీనివాస కల్యాణం తర్వాత మళ్లీ ఆ స్థాయిలో మహర్షి గురించి మాట్లాడాడు. నిన్న జరిగిన మహర్షి ప్రీరిలీజ్ ఫంక్షన్ లో దిల్ రాజు ప్రసంగం హాట్ టాపిక్ గా మారిపోయింది. “ఎంతయినా ఊహించుకోండి, అంతకుమించి ఈ సినిమా ఉంటుంది. ఎన్ని అంచనాలైనా పెట్టుకోండి, అంతకుమించి హిట్ అవుతుంది ఈ సినిమా.” ఇలా మహర్షి గురించి కాస్త ఓవర్ గానే మాట్లాడాడు రాజు.
నిజానికి శ్రీనివాస కల్యాణం తర్వాత తన సినిమాల గురించి అలా అతిగా మాట్లాడ్డం తగ్గించాడు దిల్ రాజు. చివరికి పూర్తి నమ్మకంతో ఉన్న ఎఫ్2 సినిమాపై కూడా ఇంతలా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మహర్షి గురించి మాట్లాడాడు. అందుకే అందరికీ ఒకప్పటి శ్రీనివాస కల్యాణంలో దిల్ రాజు మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చాయి.
సినిమాపై యూనిట్ కు నమ్మకం ఉండడం సహజం. తమ సినిమాను ఎవరైనా గొప్పగానే ఊహించుకుంటారు. కానీ ప్రచారంలో మరీ గొప్పలు మాత్రం చెప్పుకోరు. ఎందుకంటే రిలీజ్ తర్వాత రిజల్ట్ తేడాకొడితే కష్టం. శ్రీనివాస కల్యాణం విడుదల తర్వాత దిల్ రాజు అలాంటి విమర్శలే ఎదుర్కొన్నాడు. తిరిగి అలాంటి చేదు జ్ఞాపకం మహర్షి సినిమాతో రిపీట్ అవ్వకుండా ఉంటే అదేచాలు.