పవన్ కల్యాణ్ వంటి కరిష్మా ఉన్న హీరో ఓ పార్టీ పెట్టి, రాష్ట్రవ్యాప్తంగా పోటీచేశారు అంటే ఎంతోకొంత ఫలితం ఉంటుందని అనుకుంటారంతా. కానీ సార్వత్రిక ఎన్నికల అనంతరం జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే ఒకటీ రెండు అని కూడా చెప్పలేని పరిస్థితి. ఫలితాలు రాకముందే ఒక్కో నాయకుడూ పలాయనం చిత్తగిస్తున్నారంటే జనసేన పార్టీ వ్యవహారాలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
సహజంగా సినిమావాళ్లంతా పొగడ్తలకు ఈజీగా పడిపోతారు. పవన్ అందుకు మినహాయింపేమీ కాదు. ప్రస్తుతం పవన్ చుట్టూ ఉన్నవాళ్లు కూడా అలాంటి వాళ్లే. సీనియర్ నేత అంటూ పార్టీ రాజకీయ కార్యకలాపాలు అప్పగించిన మాదాసు గంగాధరం దగ్గర్నుంచి ప్రతి ఒక్కరూ పవన్ అడుగులకు మడుగులు వత్తేవాళ్లే. వాస్తవాలు చెప్పేవారు ఎవరూలేరు.
తాజాగా జరుగుతున్న జనసేన సమీక్షల్లో కూడా ఈ పవన్ భజన తారాస్థాయికి చేరుకుంటోంది. పవన్ కల్యాణ్ చూపుల్లో ఓ మహత్తు ఉంది. ఆయన సాధారణ మనిషికాదు, కళ్లలో కళ్లుపెట్టి చూస్తే మనం మాట్లాడేది నిజమో అబద్ధమో చెప్పేస్తారు అంటూ ఆయన అక్కడ లేకపోయినా ఆకాశానికెత్తేశారు మాదాసు గంగాధరం. అంతేనా.. జనసేన పార్టీ 5 పార్లమెంట్ స్థానాల్లో గ్యారెంటీగా గెలుస్తుందని చెప్పి మరో బాంబు పేల్చారు.
ఇప్పుడే ఇలా చెబుతున్నారంటే.. ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ ముందు ఎన్ని భ్రమలు కల్పించి ఉంటారో అర్థమౌతోంది. జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో ఫెయిల్ కావడానికి ఇలాంటి భజన బృందమే కారణమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. లోపాయికారీగా టీడీపీతో ఒప్పందం చేసుకున్నారనే విషయం జనానికి తెలిసిపోవడం ఒక కారణమైతే, లేనిపోని గొప్పల్ని ఊహించుకుని నేలవిడిచి సాము చేయడంతో ఒక్కటంటే ఒక్క సీట్లో కూడా జనసేన గెలుస్తుందనే అంచనాలు రావడంలేదు.
పార్టీ పెట్టినప్పుడు నిజాయితీగా పనిచేసిన అభిమానులు కూడా కోటరీ ఓవర్ యాక్షన్ కి బలైపోయారు, మెల్లమెల్లగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికైనా పవన్ వాస్తవాలు అర్థం చేసుకుని, భజన బృందాన్ని పక్కనపెట్టి నిజాయితీగా ఉండేవారితో, నిజం నిక్కచ్చిగా చెప్పేవారితో జనసేన పార్టీని పునర్నిర్మాణం చేసుకుంటే ఆయన చెప్పిన పాతికేళ్ల టార్గెట్ అయినా అందుకోగలరు.