పెదరాయుడు మోహన్ బాబు ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ ఒక్కటే. చటుక్కున బరస్ట్ అయిపోవడం, అనుకున్నది వెంటనే కక్కేయడం. ఆ విషయంలో మరి ముందు వెనుకలు వుండవు. అందుకే ఆయన ఎంత మందికి ఇష్టుడో అన్నది పక్కన పెడితే, చాలా మందికి దూరం అవుతుంటారు. హెరిటేజ్ కంపెనీ స్థాపక భాగస్వాముల్లో మోహన్ బాబు కూడా ఒకరు అని చాలా మందికి తెలియకపోవచ్చు. చంద్రబాబు, బాలకృష్ణ, మోహన్ బాబు కలిసి స్టార్ట్ చేసిన కంపెనీ అది. అలాంటిది ఇప్పుడు ఆ కంపెనీతోనూ మోహన్ బాబుకు అనుబంధం లేదు. చంద్రబాబుతోనూ అనుబంధం లేదు. కారణం, ముక్కుసూటితనం.
గతంలో ఓసారి చంద్రబాబుతో విబేధించారు. మళ్లీ దగ్గరయ్యారు. మొన్నటి ఎన్నికల టైమ్ లో మళ్లీ విబేధించి జగన్ తో చేయి కలిపారు. ఆ తరువాత రాజకీయాల్లో యాక్టివ్ కాలేకపోయారు. వైకాపా నుంచి ఎందరికో పదవులు అందాయి కానీ, మోహన్ బాబుకు, పోసాని కృష్ణ మురళికి అందలేదు. పోసాని సంగతి పక్కన పెడితే, మోహన్ బాబుకు ఇవ్వాలంటే ఏ రాజ్యసభనో ఇవ్వాల్సి వుంటుంది. మరి ఆ దిశగా జగన్ ఆలొచించినట్లు లేదు.,
ఇదిలావుంటే కాలేజీల ఫీజు బకాయిల గురించి మోహన్ బాబు గతంలో చంద్రబాబు మీద ధ్వజమెత్తారు. ఆ సమస్య ఇప్పటికీ అలాగే వుందని, జగన్ వచ్చినా పరిష్కారం కాలేదని టాక్ వినిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఓ ఛానెల్ లో మోహన్ బాబు ఇంటర్వూ రాబోతోంది. దాని ప్రోమో అయితే ప్రస్తుతానికి బయటకు వచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఏం చెప్పారో ఏమో కానీ, ప్రోమో చూస్తుంటే మోహన్ బాబు కాస్త చెణుకులు విసిరినట్లు కనిపిస్తోంది.
పైగా ఈ ఇంటర్వ్యూ ఓ ప్రో టీడీపీ ఛానెల్ లో ప్రసారం కాబోతోంది. దాంతో మరి కొంచెం అనుమానాలు రేకెత్తుతున్నాయి. మొత్తం మీద ఇప్పటికిప్పుడు మోహన్ బాబు డైరక్ట్ గా జగన్ మీద విమర్శలు చేయరు కానీ, నర్మగర్భంగా కొన్ని హింట్స్ ఇస్తారని ఈ ఇంటర్వ్యూ ప్రోమో వల్ల తెలుస్తోంది.