ఆయన కోసం విశాఖకు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్

విశాఖపట్నానికి ఎందరో ప్రముఖులు వస్తూంటారు. తెల్లారితే విశాఖ మహా మహులతో సందడి చేస్తుంది. అలాంటి విశాఖకు విశిష్ట ప్రముఖుడు అయిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈ నెల 30న…

విశాఖపట్నానికి ఎందరో ప్రముఖులు వస్తూంటారు. తెల్లారితే విశాఖ మహా మహులతో సందడి చేస్తుంది. అలాంటి విశాఖకు విశిష్ట ప్రముఖుడు అయిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈ నెల 30న వస్తున్నారు. ఆయన ఈ కీలకమైన పదవి స్వీకరించిన తరువాత విశాఖకు రావడం ఇదే ప్రధమం.

ఇక చీఫ్ జస్టిస్ రాకకు కారణం ఆయనలో నిండా నిబిడీకృతమైన సాహిత్య మమకారం. ప్రేమ, ఆయన తెలుగు భాషకు ఇచ్చే గౌరవం, మన్నన, మర్యాద అందరికీ తెలిసిందే. తేట తేట తేనెలూరే తెలుగు అంటే చీఫ్ జస్టిస్ ప్రాణం పెడతారు. తెలుగు భాష మీద మక్కువతో ఢిల్లీలో తన అధికార నివాసానికి తెలుగులోనే నేమ్ ప్లేట్ చేయించుకున్న వారు జస్టిస్ ఎన్వీ రమణ.

ఆయనకు అవధానాలు ఇష్టం. తెలుగు కధలు, సాహిత్యం అంటే ఇంకా ఇష్టం. ఈ నేపధ్యంలో ఆయన విశాఖ కీర్తి పతాకగా పేరు గడించిన సాహితీ మేరు నగధీరుడు రాచకొండ విశ్వనాధశాస్త్రి శతజయంతి వేడుకలో పాల్గొనేందుకు విశాఖ వస్తున్నారు. ఈ ఏడాదికి రావిశాస్త్రి పుట్టి నూరేళ్ళు. ఆ పండుగను విశాఖలో సాహితీ ప్రముఖులు గొప్పగా నిర్వహిస్తున్నారు.

వంద వసంతాల రావి అన్న పేరుతో విశాఖలో జరిగే శత జయంతి వేడుకలకు ముఖ్య అతిధిగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ హాజరవుతారు. ఆ రోజున కీలక ఉపన్యాసాన్ని ఆయన చేయనున్నారు. 

వృత్తి పరంగా విశాఖలో ప్రముఖ న్యాయవాది అయిన రావి శాస్త్రికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఘన నివాళి అర్పించడం ఈ సందర్భంగా ఎంతైనా సముచితమని నిర్వాహ‌కులు చెబుతున్నారు. ఇక సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రాక సందర్భంగా విశాఖలో ముమ్మరంగా ఏర్పాట్లను చేస్తున్నారు.