ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డీఎస్ అంటే ఎవరో ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. ఉమ్మడి ఏపీలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ నాయకుడు. రెండుసార్లు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. వైఎస్సార్ – డీఎస్ జోడీ రాష్ట్రంలో కాంగ్రెస్ ను రెండుసార్లు అధికారంలోకి తెచ్చింది.
ప్రత్యేక తెలంగాణా ఏర్పడిన తరువాత కొన్ని కారణాలతో ఆయన టీఆర్ఎస్ లో చేరారు. సరిగా చెప్పాలంటే డీఎస్ ను కేసీఆర్ ప్రలోభపెట్టి గులాబీ పార్టీలోకి వచ్చేలా చేశారు. మొదట సలహాదారు పదవి ఇచ్చారు. తరువాత రాజ్యసభకు పంపించారు. కాలక్రమంలో ఇద్దరి మధ్య విభేదాలొచ్చాయి.
ఇందుకు కారకురాలు కేసీఆర్, కేసీఆర్ కూతురు కవిత అని అంటారు. కారణాలు ఏవైనా డీఎస్-కేసీఆర్ మధ్య సంబంధాలు తెగిపోయాయి. డీఎస్ రాజ్యసభ సభ్యత్వం కూడా ముగిసింది. పదవీకాలం ముగిశాక మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళతారని అనుకున్నారు. కానీ ఇప్పటివరకు అందుకు సంబంధించిన సమాచారమేదీ లేదు.
ఇదిలా ఉండగా, వైఎస్సార్ పై తెలంగాణా ప్రజల్లో అభిమానం చెక్కుచెదరలేదని, ఆయన కుమార్తె, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ముఖ్యమంత్రి కావడం గ్యారంటీ అని డీఎస్ అన్నారని షర్మిల పార్టీ నాయకులు చెబుతున్నారు. షర్మిల డీఎస్ ను ఆయన నివాసంలో కలుసుకొని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుకున్నారు. ఆ సమయంలో వైఎస్ తో డీఎస్ తన అనుభవాలు పంచుకున్నారు.
షర్మిల తప్పనిసరిగా ముఖ్యమంత్రి అవుతుందని అన్నారట. ఈ విషయం షర్మిల చెప్పలేదు. ఆమె పార్టీ నాయకులు చెప్పారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు. షర్మిల సీఎం అవుతుందని మాటవరసకు అన్నారో, అందుకు డీఎస్ వద్ద ఆధారాలు ఉన్నాయా అనేది తెలియదు.
షర్మిల పార్టీపరంగా చూసినా, తెలంగాణలో ఇప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి చూసినా ఆమె పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఈ మధ్యనే షర్మిల కూడా తెలంగాణా రాష్ట్రానికి కాబోయే తొలి మహిళా ముఖ్యమంత్రిని తానేనని చెప్పింది. అసలు ఆమె పార్టీ పెట్టి ఎన్నాళ్ళయింది? రాజకీయంగా ఆమె అనుభవం ఎంత? ఆమె పార్టీ అభివృద్ధి ఎంత?
ఆమెకున్న ప్రజాదరణ ఎంత? గ్రాండ్ ఓల్డ్ పార్టీ, రాష్ట్రాన్ని దశాబ్దాలపాటు పరిపాలించిన అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో ఏనాటి నుంచే ఉండి, అధికారంలోకి రాలేకపోయినా ఎన్నికల్లో సీట్లు గెలుచుకుంటున్న భారతీయ జనతా పార్టీ రాజకీయాల్లో అనేక ఆపసోపాలు పడుతున్నాయి. ఆ రెండు పార్టీలకు నాయకులున్నారు, కార్యకర్తలున్నారు, ఇతరత్రా హంగులున్నాయి.
కానీ ఈ రెండు పార్టీల్లో పదో వంతైనా షర్మిల పార్టీకున్నయా? షర్మిలను మినహాయిస్తే వైఎస్సార్టీపీలో ఇతర నాయకుల పేర్లు ఎవరైనా చెప్పగలరా? కొద్దిమంది వైఎస్సార్ అభిమానులు తప్ప కమిటెడ్ కార్యకర్తలున్నారా? ఇన్ని లోటుపాట్లు ఉన్న పార్టీ అధికారంలోకి వస్తుందని రాజకీయాల్లో తలపండిన డీఎస్ ఎలా అంటారు?