టాలీవుడ్ లో చిత్రమైన పరిస్థితి నడుస్తోంది. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సినిమాల నిర్మాణం ఆపాలి అంటోంది. అధారిటీ బాడీ అయిన ఛాంబర్, కౌన్సిల్ లాంటివి అలాంటిది ఏమీ లేదు. యధావిధిగా షూటింగ్ లు చేసుకోవచ్చు అంటోంది.
సమస్యలు అన్నీ పరిష్కరించుకోవడానికి ఇరవై మందితో చాంబర్ కమిటీ వేసింది. గిల్డ్ అయిదుగురితో కమిటీ వేసింది. రెండు కమిటీల్లోనూ గిల్డ్ సృష్టి కర్త దిల్ రాజు వుండడం విశేషం.
గిల్డ్ లో లేని నిర్మాతలు, ఇతరులు తప్పంతా గిల్డ్ లో వున్న ప్రొడ్యూసర్లదే అంటున్నారు. డైరెక్ట్ ఓటిటి కి ఇచ్చిన వారు… ఎర్లీగా ఓటిటికి ఇచ్చి అదనపు ఆదాయం తెచ్చుకున్నవారు..థియేటర్లు లీజుకు తీసుకుని ఇష్టం వచ్చినట్లు అద్దెలు పెంచేసిన వారు, ఇరు ప్రభుత్వాల దగ్గరకు వెళ్లి టికెట్ రేట్లు పెంచేసిన వారు, ఇలా ఇప్పుడు ఏ సమస్యలు అయితే చెబుతున్నారో, ఆ సమస్యల సృష్టికర్తలంతా గిల్డ్ లోనే వున్నారని, నాన్ గిల్డ్ సభ్యులు ఆరోపిస్తున్నారు.
గిల్డ్ లో కీలకంగా వుండేవారి చేతిలో ఇప్పుడు సిన్మాల నిర్మాణం లేదని, అందుకే ఆపాలని ఆలోచిస్తున్నారని అంటున్నారు. దిల్ రాజు – విజయ్ తమిళ సినిమా అని, బాపినీడు ఒక సినిమా పూజ చేసి వుంచారని, అన్నపూర్ణ స్టూడియోస్ ఏ సినిమా నిర్మించడం లేదని, సురేష్ బాబు దగ్గర సినిమా నిర్మాణం ఏదీ లేదని, స్రవంతి రవికిషోర్ దగ్గర కూడా ఏ సినిమా స్టార్ట్ కాలేదని, సుధాకరరెడ్డి మాచర్ల సినిమా పూర్తయిపోయిందని, ఇలా దాదాపు గిల్డ్ సభ్యులకు ఎవ్వరికీ సినిమాల నిర్మాణం ఆపడం వల్ల ఇబ్బంది లేదని నాన్ గిల్డ్ సభ్యులు వివరిస్తున్నారు.
సంస్థలో పనిచేసే ఉద్యోగులు సమ్మెలు, బంద్ లు చేస్తారు కానీ సంస్థలు కాదని వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం రావు రమేష్, నాజర్, మురళీ శర్మ లాంటి క్యారెక్టర్ యాక్టర్లతోనే సమస్య అయితే లోకల్ యాక్టర్లు, తక్కువకు వచ్చే మంచి నటులతో రీప్లేస్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
మలయాళం, తమిళం నుంచి సపోర్టింగ్ యాక్టర్లను తెచ్చి వారికి సదుపాయాలు అలవాటు చేసారని, ఇప్పుడు కేవలం ఇద్దరు ముగ్గురి గురించి మాట్లాడుతున్నారని అంటున్నారు.
మొత్తం మీద సినిమాల నిర్మాణం ఆపే విషయంలో భిన్నాభిప్రాయాలు లేవు అని పెద్దలు అంటున్నా, తెర వెనుక మాత్రం చాలా మల్ల గుల్లాలు నడుస్తున్నాయి.