జనానికి అన్నీ ఇంటి దగ్గరికే సరఫరా చేయాలనే ఆలోచన ఏదో జగన్‌లో బలంగా ఉన్నట్టుంది. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని తీసుకురావాలని ఆయన సంకల్పించారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఈ మంచి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ప్రతి కుటుంబం దగ్గరికి డాక్టర్‌ను పంపాలనే ప్రభుత్వ ఆశయం మంచిదే. కానీ ఆచరణ ఎంత వరకూ సాధ్యమనేది ప్రశ్న.
తమ ఇంటి దగ్గరికే డాక్టర్ రావాలని ప్రజలు కోరుకోవడం లేదు. విద్య, వైద్యం ఖర్చులు సామాన్య జనానికి భారమయ్యాయి. చిన్న రోగమొచ్చి ఆస్పత్రికి వెళితే, జేబులు చిల్లులు పడాల్సిందే. రోగి కుటుంబం అప్పులు పాలవుతున్న దుస్థితి. దివంగత వైఎస్సార్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకం ఎంతోకొంత పేదలకు ఉపశమనం అని చెప్పొచ్చు.
ప్రస్తుత పరిస్థితుల్లో రోగుల దగ్గరికే డాక్టర్‌ను పంపడం కంటే, ప్రతి పల్లెలో ప్రాథమిక వైద్య కేంద్రం, ఇద్దరు డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందిని నియమించి, అవసరమైనప్పుడు సేవలు అందించేలా చర్యలు తీసుకుంటే చాలు. పెద్దపెద్ద ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా రోగులకు తగ్గ వైద్యులు, వైద్య సిబ్బంది లేరు. ముందు అక్కడ దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి వుంది. ప్రభుత్వం ఆ పని చేయడం మానేసి, ఫ్యామిలీ డాక్టర్ పేరుతో ప్రచారం చేసుకోడానికి తప్ప జనానికి ఒరిగేదేమీ లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంటింటికి రేషన్ పేరుతో ప్రభుత్వం భారీ మొత్తంలో వాహనాలు ఏర్పాటు చేసినా సక్సెస్ కాలేదు. సుమారు రూ.600 కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ రేషన్ డోర్ డెలవరీ పథకంపై జనం మండిపడుతున్నారు. వినియోగదారులెవరూ ఇంటి వద్దకే రేషన్ సరఫరా చేయాలని కోరలేదు. పైగా ప్రభుత్వ రేషన్ వాహనం ఎప్పుడొస్తుందో తెలియక పనులు పోగొట్టుకుని ఇంటికే పరిమితమై నష్టపోవాల్సి వస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కావున రోగం వచ్చిన వాళ్లు నేరుగా ఆస్పత్రికి వెళ్తారు. తమ కోసం డాక్టర్ రావాలని ఏ ఒక్కరూ ఎదురు చూడరు. ప్రజల డిమాండ్‌కు తగ్గ పనులు చేస్తే…. వారి ఆదరణ దక్కుతుంది. అంతే తప్ప, ప్రచార ఆర్భాటానికి చేపట్టే ఏ ఒక్క పథకం సక్సెస్ కాదని సీఎం జగన్ గుర్తిస్తే మంచిది.