విశాఖ మీద ఒక్కసారిగా అటెన్షన్ పెరిగింది. పాలనాపరంగా కూడా నిర్ణయాలు వేగంగా తీసుకుంటున్నారు. పాలనా రాజధాని త్వరలో విశాఖకు తరలిరానుంది అన్న మాట వైసీపీ నేతలు పదే పదే చెబుతున్న నేపధ్యంలో విశాఖలోనే మంత్రులు విడిది చేస్తున్నారు.
గత రెండు రోజులుగా అరడజన్ మంది మంత్రులు విశాఖలోనే మకాం వేశారు. ఇక ఇంచార్జి మంత్రి కురసాల కన్నబాబుతో పాటు అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖ అభివృద్ధి మీద వరసబెట్టి కీలకమైన సమావేశాలు నిర్వహిస్తున్నారు.
విశాఖలో ఉన్న మొత్తం తొంబై ఎనిమిది వార్డులలోనూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని మంత్రులు చెప్పారు. సిటీలో ఈ ఏడాది డిసెంబర్ నాటికి మూడు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లుగా వారు ప్రకటించారు.
అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఆదేశానుసారం విశాఖ ప్రగతి మీద కచ్చితమైన ప్రణాళికతో ముందుకు వెళ్తామని అంటున్నారు. మొత్తం మీద చూస్తూంటే ఇది గతంలో ఎన్నడూ లేని వేడి వేగం బాగా పెరిగింది.
దీంతో ఏదో జరుగబోతోంది అన్నది మాత్రం తెలుస్తోంది. మరి విశాఖకు పాలనా రాజధాని త్వరలోనే వస్తుందా అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున జనాలలో సాగుతోంది.