ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్ ఎక్కడైతే పుట్టిందో ….ఇప్పుడా నగరం ఆనందంతో కేరింతలు కొడుతోంది. ఆనందంతో జెజ్జనక అంటున్న ఆ నగరమే వూహాన్. చైనాలో 1.10 కోట్ల జనాభా కలిగిన నగరం వూహాన్. మొట్ట మొదట కరోనా వైరస్ అక్కడి నుంచే నలుదిశలా విస్తరించింది. అప్పటి వరకు ఆ నగరం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు.
కరోనా మహమ్మారి వల్ల వూహాన్ గురించి పదేపదే మాట్లాడుకోవాల్సి వస్తోంది. కరోనాను కట్టడి చేయడానికి వూహాన్లో జనవరి 23న లాక్డౌన్ విధించారు. అప్పటి నుంచి 76 రోజుల పాటు లాక్డౌన్ కొనసాగింది. ఎలాగోలా కరోనాను అక్కడి నుంచి తరిమికొట్టగలిగారు. రెండున్నర నెలల పాటు ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసిన వూహాన్ ప్రజలు…స్వేచ్ఛా వాయువులను పీల్చుకున్నారు. కరోనా కబంధ హస్తాల నుంచి విముక్తులైన ఆనందంలో వీధుల్లోకి వచ్చి కేరింతలు కొట్టారు.
ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి యధావిధిగా తమ పనులు ప్రారంభించారు. రైళ్లు పట్టాలెక్కాయి. విమానాలు గాలిలో ఆకాశమే హద్దుగా రయ్య్‌మంటూ దూసుకుపోతున్నాయి. బస్సులు, ఇతర వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. పరిశ్రమల్లో యంత్రాల రొద, కార్మికుల హడావుడి చెప్పనలివి కాలేదు.
సుమారు రెండున్నర నెలల పాటు రోడ్లపై కనుచూపు మేరలో మనిషి అలికిడే లేని వూహాన్ నగరం…ఇప్పుడు జనసందడితో కళకళలాడుతోంది. ఇంతకాలం జరిగిందంతా పీడకలలా భావిస్తున్నారు. స్నేహితులు, బంధువులు, తోటి ఉద్యోగులు కలుసుకుని భావోద్వేగానికి గురై పరస్పరం ఆలింగనం చేసుకున్నారు.
వూహాన్ విమానాశ్రయంలో బుధవారం దిగిన తొలి విమానానికి జల ఫిరంగులతో స్వాగతం పలికారు. అయితే ప్రతి కార్యాలయంలోనూ కరోనా నుంచి రక్షణ కోసం అన్ని రకాల జాగ్రత్తలను తీసుకున్నారు. వూహాన్ నగర వాసులు ఒక్కసారిగా ‘కరోనా వైర్‌సను జయించాం’ అని కేకలు పెట్టారు.
ప్రస్తుతం లాక్డౌన్లో ఉంటున్న మనం వూహాన్ సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రజాసంకల్పం ముందు ఏ వైరస్ కూడా గొప్పది కాదు. లాక్‌డౌన్‌ను వజ్రసంకల్పంతో పాటిస్తే…మనం కూడా అతి త్వరలో వూహాన్లో మాదిరిగా స్వేచ్ఛా వాయువులను పీల్చుకోవచ్చు. కను చూపు మేరలో కనిపిస్తున్న విజయాన్ని ముద్దాడేందుకు… ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ తాత్కాలికమే అని గ్రహించాలి.