ఇప్పటివరకూ ఏపీలో కరోనా కేసులు పెరగడమే తప్ప నిలకడగా ఉంది లేదు. తబ్లిగి జమాత్ వేళ కేసుల సంఖ్య శరవేగంగా పెరగడం మరింత ఆందోళన కలిగించిన విషయం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఓ చిన్న గుడ్ న్యూస్. బుధవారం రాత్రి 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు మొత్తం 12 గంటల్లో అసలు కరోనా పాజిటివ్ కేసులేవీ ఏపీలో నమోదు కాకపోవడం కాస్త ఊరటనిచ్చే విషయం.
కొత్త కేసులు నమోదు కాకపోవడం అంటే పరీక్షించిన 217 శాంపిల్స్ నెగెటివ్ వచ్చాయని అర్థం. కరోనా సోకిన ప్రతి ఒక్కరినీ ఐసోలేషన్ కి పరిమితం చేయడం, అనుమానాలున్న వారందర్నీ క్వారంటైన్ కి షిఫ్ట్ చేయడంతోటే పరిస్థితి దాదాపు అదుపులోకి వచ్చింది.
అత్యథికంగా కర్నూలులో 75, ఆ తర్వాత గుంటూరులో 49, నెల్లూరులో 48 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం 348 కేసుల్లో దాదాపు సగం కేసులు (172) ఈ మూడు జిల్లాల్లోనే నమోదయ్యాయి. మిగతా సగం కేసుల్ని 8 జిల్లాలు పంచుకున్నాయి. కర్నూలు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో కూడా ఇప్పుడు కొత్తగా పంపించిన శాంపిల్స్ లో ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు. దీంతో రాష్ట్ర అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.
ఇప్పటివరకూ ఏ రాష్ట్రం కూడా ఇలాంటి స్థితికి రాలేదు. కేసుల నమోదు తక్కువగా ఉంది అంటే.. అక్కడ పరీక్షించాల్సిన శాంపిల్స్ పెండింగ్ లో ఉన్నాయని లెక్క. అయితే ఏపీలో 217శాంపిల్స్ లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం సంతోషించదగ్గ విషయం. దీంతో ఏపీలో కరోనా కట్టడికి తొలి అడుగు పడినట్టేనని అంటున్నారు వైద్యశాఖ అధికారులు.
అయితే ఈ పాజిటివ్ సైన్ తో ఎవరైనా అత్యుత్సాహం ప్రదర్శించి లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రమాదమే. అధికారులు కూడా మరింత కట్టడితో వ్యవహరించి.. రెడ్ జోన్ ల విషయంలో మరింత కఠినంగా ఉండగలిగితే మాత్రం ఏపీ నుంచి కరోనాని తరిమికొట్టే రోజు తొందరలోనే వస్తుంది.