మామూలుగా అయితే ఈ పాటికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ మంచి రంజు మీద ఉండేది. సమ్మర్ వినోదం క్రికెట్ ప్రియులకు ఫుల్ గా అందుతుండేది. అయితే ఈ సారి కథ పూర్తిగా మారిపోయింది. ఊహించని రీతిలో ఐపీఎల్ మ్యాచ్ లు వాయిదా పడ్డాయి. ప్రస్తుతానికి వాయిదానే, అయితే రద్దు అవుతుందా? అనేది ఇంకా తేలని అంశం.
లాక్ డౌన్ పీరియడ్ ముగిసి, ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరగక, ఆ పై విదేశాలతో రాకపోకలు మామూలుగా మొదలైతే తప్ప ఐపీఎల్ జరిగే అవకాశం లేదు. దానికి కొంత సమయం అయితే పట్టేలా ఉంది. విదేశాలతో రాకపోకలు ఊపందుకునే వరకూ ఐపీఎల్ నిర్వహణ అసాధ్యం. అన్నీ కుదరితే ఈ ఏడాది నవంబర్ సమయంలో ఐపీఎల్ నిర్వహిస్తారు అనేది ఒక అభిప్రాయం.
ఆ సంగతలా ఉంటే.. అసలే కాసుల లెక్కల్లో బిజీగా ఉండే బీసీసీఐ ఇప్పుడు తమకు జరుగుతున్న నష్టం గురించి అంచనాలు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక లెక్క ప్రకారం.. ఐపీఎల్ నిర్వహరణ ప్రస్తుతానికి వాయిదా పడిన నేపథ్యంలో బ్రాడ్ కాస్టింగ్ సంస్థలే ఏకంగా మూడు వేల కోట్ల రూపాయలకు పైగా నష్టపోతున్నాయట. ఐపీఎల్ ను వివిధ మాధ్యమాల్లో టెలికాస్ట్ చేసే మీడియా సంస్థలు ఇప్పుడు ఈ మేరకు ఆదాయాన్ని పోగొట్టుకుంటున్నాయని అంచనా.
ఇక ప్రాంచైజ్ ల నష్టం వేరే. మ్యాచ్ లు జరిగితేనే వాటికి స్పాన్సర్స్ నుంచి ఆదాయం వస్తుంది. మ్యాచ్ లు లేకపోవడంతో ప్రాంచైజ్ లకు రూపాయి వచ్చే పరిస్థితి లేదు. ఎనిమిది ప్రాంచైజ్ లు ఏ మేరకు నష్టపోతున్నాయనేది వాటి అంతర్గత లెక్క. అలాగే బీసీసీఐ అటు ప్రసార సంస్థల నుంచి రావాల్సిన డబ్బు నష్టం, ఇంకా అనేక రకాలుగా నష్టాలున్నాయి. ఇక ఐపీఎల్ పై ఇతర మీడియా రంగాలు కూడా తీవ్రంగా ఆధారపడుతుంటాయి.
ఐపీఎల్ వాటికి కూడా ఎంతో కొంత కల్పతరువే. ఐపీఎల్ పై బెట్టింగు తరహా ఆటను నిర్వహించే డ్రీమ్ 11 లు, ఇక బెట్టింగులనే ఆదాయవనరులుగా మార్చుకున్న జూదరులకూ ఇప్పుడు చేతి నిండా పని ఉండేది. వీరందరితో పాటు.. ఆటగాళ్లు! వాళ్లకూ భారీ నష్టాలే. సీజన్ నెలన్నరలోనే ఏకంగా లక్షల నుంచి కోట్ల రూపాయలను ఇంటికి తీసుకెళ్లే వారి సంఖ్య వందల్లో ఉంటుంది. వారందరికీ ఈ ఏడాది ఐపీఎల్ ఆదాయం ప్రశ్నార్థకమే. ఒకవేళ నవంబర్ లో అయినా అన్ని షెడ్యూల్ ను మేనేజ్ చేసి బీసీసీఐ ఐపీఎల్ ను నిర్వహించగలిగితే మాత్రం వీళ్లంతా హ్యాపీనే!