జ‌గ‌న్‌కు నిజాలు తెలియాలంటే…ఎవ‌రిని క‌ల‌వాలంటే?

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల‌తో వ‌రుస స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. రానున్న ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని జ‌గ‌న్ దిశానిర్దేశం చేస్తున్నారు. క్షేత్ర‌స్థాయిలో ఏం జ‌రుగుతున్న‌దో, మూడేళ్ల ప‌రిపాల‌న‌పై ప్ర‌జ‌ల అభిప్రాయాలు ఎలా వున్నాయో ఆయ‌న…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల‌తో వ‌రుస స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. రానున్న ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని జ‌గ‌న్ దిశానిర్దేశం చేస్తున్నారు. క్షేత్ర‌స్థాయిలో ఏం జ‌రుగుతున్న‌దో, మూడేళ్ల ప‌రిపాల‌న‌పై ప్ర‌జ‌ల అభిప్రాయాలు ఎలా వున్నాయో ఆయ‌న తెలుసుకుంటున్నారు. 

గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంపై ఎప్ప‌టిక‌ప్పుడు ఆయ‌న స‌మీక్షిస్తూ, లోపాల్ని స‌వ‌రించాల‌ని ఆదేశిస్తున్నారు. ఇదే కోవ‌లో వ‌చ్చే నెల నుంచి వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం కావాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇది మంచి ప‌రిణామం.

నియోజ‌క‌వ‌ర్గానికి 50 మంది చొప్పున పిలిపించుకుని క్షేత్ర‌స్థాయిలో వాస్త‌వ ప‌రిస్థితుల్ని అడిగి తెలుసుకోవాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకోవ‌డం వైసీపీకి శుభ‌వార్తే. అయితే క్షేత్ర‌స్థాయిలో వాస్త‌వాల్ని చెప్ప‌డం అంటే, ఎమ్మెల్యే లేదా ఎంపీల‌తో కోరి గొడ‌వ పెట్టుకోవ‌డ‌మే అవుతుంది. స్థానిక నాయ‌కుల్ని కాద‌ని ఏ ఒక్క కార్య‌క‌ర్త నిజాల్ని నిర్భ‌యంగా సీఎం ఎదుట చెప్పే ప‌రిస్థితి వుండ‌దు. ఒక‌వేళ చెప్పినా… ఇక‌పై వారిని పార్టీకి దూరంగా పెట్ట‌డం ఖాయం.

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ నిజంగా క్షేత్ర‌స్థాయిలో త‌న పాల‌న‌పై వాస్త‌వాలు తెలుసుకోవాలంటే క‌ల‌వాల్సిన వ్య‌క్తులు కొంద‌రున్నారు. త‌ట‌స్థులు, మేధావులు, విద్యావంతులు, నిరుద్యోగులు, న్యాయ నిపుణులు, స్వ‌చ్ఛంద సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో భేటీ అయితే ప‌రిపాల‌న‌పై నిజాలు తెలుస్తాయి.

గ‌తంలో 2019 ఎన్నిక‌ల ముందు త‌ట‌స్థులు, మేధావుల‌తో జ‌గ‌న్ రెండుమూడు స‌మావేశాలు నిర్వ‌హించారు. అప్పుడు ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా వారిని క‌ల‌వ‌డం వేరు. ఇప్పుడు పాల‌కుడిగా వారిని క‌లిస్తే కొంత ప్ర‌యోజ‌నం వుంటుంది. నిజాలు తెలుసుకోవాల‌నే ధైర్యం వుంటే పార్టీల‌కు అతీత‌మైన వ్య‌క్తులను క‌లిస్తే బాగుంటుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.