చంద్రబాబునాయుడు మరీ లేకి రాజకీయాలు చేస్తున్నారు. ప్రజాప్రయోజనాలు మాత్రమే కాదు.. విస్తృతమైన రాష్ట్రప్రయోజనాలు కూడా పణంగా పెట్టేలా కుట్రపూరిత రాజకీయ డైలాగులు వేస్తున్నారు. రాష్ట్ర సమగ్రతకు చేటు చేసే మాటలు మాట్లాడుతున్నారు. విభజన తర్వాత.. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతంగా తయారవుతున్న నేపథ్యంలో తెలంగాణ నుంచి ఏపీలోకి కలిసిన విభజన చట్టం సాక్షిగా కలిసిన మండలాల విషయంలో చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు అసహ్యం కలిగిస్తున్నాయి.
ఆయన మాటలు అక్కడి ప్రజలను రెచ్చగొట్టడం మాత్రమే కాదు.. తిరిగి ఆ మండలాలు తెలంగాణలో కలిసిపోవాలనే డిమాండ్ కు బలం ఇచ్చేలా ఉన్నాయి. జగన్ మీద ఏదో ఒక రకంగా బురద చల్లాలనే దుగ్ధతో.. రాష్ట్రానికే నష్టం జరిగేలా చంద్రబాబు మాట్లాడడం జుగుప్స కలిగిస్తోంది.
తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ మధ్య నదీ జలాల పంపకాలకు సంబంధించి వివాదాలు తొలినుంచి ఉన్నాయి. నదీ జలాల పంపకం తదితర ఏ చిన్న చర్చ, సమస్య తలెత్తినా సరే.. తెలంగాణ దానికి సంబంధంలేని మరో వాదనను లేవనెత్తి.. ఏపీపై నిందలు వేయడానికి ప్రయత్నిస్తుంటుంది. ఏపీని కార్నర్ చేయడానికి ప్రయత్నిస్తుంటుంది.
తాజా పరిణామాలను గమనిస్తే.. తెలంగాణను వరదలు ముంచెత్తుతుండగా.. అక్కడి రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని దారుణంగా విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ విమర్శలను తట్టుకోలేక అక్కడి నాయకులు.. ఏపీ మీద పడి ఏడుస్తూ.. పోలవరం మీద పడి ఏడుస్తూ.. ఆ విమర్శలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. ముంపు మండలాలను ఏపీకి ఇవ్వడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని, ఇంకా పూర్తికాని పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచడం వల్లనే ఈ దుస్థితి వచ్చిందని.. ఆ మండలాలను తిరిగి తమకు ఇవ్వాలని మాట్లాడడం ప్రారంబించారు. ఇది టాపిక్ ను డైవర్ట్ చేసే చీప్ టెక్నిక్ అని అందరికీ తెలుసు.
తెలంగాణ రాజకీయనాయకులు ఆ పాట అందుకోగానే.. ముంపు మండలాల్లో ప్రజలు కూడా కొందరు ఆ డిమాండ్ కు అనుకూలంగా గళం వినిపించారు. ఇది నూటికి వెయ్యిశాతం.. తెలంగాణ రాష్ట్రసమితి ప్రేరేపిత డిమాండ్ అనే సంగతి అందరికీ తెలుసు. కాకపోతే.. తెలంగాణలో విమర్శల జడి తగ్గడానికి వారు ఆ పని చేశారు. ఏపీకి పట్టిన ఖర్మం ఏంటంటే.. వారి కుట్రను చంద్రబాబు భుజాన మోస్తున్నారు. జగన్ పాలనకు ముడిపెట్టి.. జగన్ వల్లనే.. ముంపు మండలాల ప్రజలు తిరిగి తెలంగాణలో కలవాలని కోరుకుంటున్నారంటూ.. కొత్త పాట ఎత్తుకున్నారు.
రాష్ట్రప్రయోజనాల దృష్ట్యా ఇది చాలా చీప్ ట్రిక్. ముంపు మండలాలను తిరిగి తెలంగాణకు ఇచ్చేయాలని.. ఏపీ నాయకుడు కూడా డిమాండ్ చేస్తున్నారంటే.. తెలంగాణ ఇంకా స్వరం పెంచుతుంది. పోలవరం ప్రాజెక్టు అనుకున్న రీతిగా పూర్తికావడానికి ఇది చాలా పెద్ద అడ్డంకి అవుతుంది.
నలభై నాలుగేళ్ల సుదీర్ఘ అనుభవం అని చెప్పుకునే, తెలంగాణలో తన పార్టీకి ఆల్రెడీ సమాధి కట్టేసిన ఈ చంద్రబాబునాయుడు.. ఇలాంటి మాటలు, పనుల వల్ల.. ఏపీకి చేటు చేయబోతున్నారా అని ప్రజలు చీదరించుకుంటున్నారు.