తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు.. ఇప్పుడు రసకందాయంలో పడ్డాయి. అధికారం దక్కినప్పుడు తప్ప.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ గురించి, పోరాటాల గురించి, పార్టీని కాపాడుకోవడం గురించి ఏమాత్రం శ్రద్ధ పెట్టని.. మొక్కుబడి రాజకీయ నాయకులు నిండా ఉండగా.. తాను ఉన్నపళంగా పార్టీని టాప్ గేర్ లోకి తీసుకువచ్చేస్తాననే హామీ ఇచ్చి.. రేవంత్ రెడ్డి.. పీసీసీ అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. ఆయనకు పదవి దక్కడాన్ని ఆ నాటినుంచి ఇతర ముఠాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉన్నారు.
తాజాగా అవి బట్టబయలు అవుతున్నాయి. కాంగ్రెస్ పుట్టి ముంచుతూ.. తెలంగాణలో అధికారం మీదనే కన్నేసిన కమలానికి లాభం చేకూర్చేలా పరిణమిస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన తర్వాత.. బిజెపికి అనుకూలంగా, ఆ పార్టీ తప్ప తెలంగాణకు మరో గతి లేదు అన్నట్లుగా మాట్లాడుతున్న మాటలు.. పీసీసీ సారధి రేవంత్ రెడ్డికి చిక్కులు తెచ్చి పెట్టేవే.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కమలం పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారనే సంగతి ఇవాళ్టిది కాదు. చాలాకాలం నుంచి అలాంటి పుకార్లకు ఆయన స్వయంగా ఆస్కారం కల్పిస్తూ వచ్చారు. పీసీసీ సారథి ఎవ్వరనే విషయం నిర్ణయం కాకముందు కూడా ఇలాంటి లీకులు ఇచ్చారు. వారి కుటుంబానికి సారథ్యం ఇవ్వడం కోసమే.. బిజెపికి కన్నుగీటుతున్నట్టుగా పుకార్లు ఆయనే పుట్టించుకుంటున్నారనే మాట వినిపించింది. అయితే ఇప్పుడు తాజాగా ఆయన కమలదళం చేరడం కన్ఫర్మ్ అయినట్టుగానే కనిపిస్తోంది. ఆ మాటలు.. దాదాపుగా కాంగ్రెస్ కు వీడ్కోలు మాటల్లాగానే కనిపిస్తున్నాయి.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారి కమలతీర్థం పుచ్చుకుంటే.. కాంగ్రెస్ కు కొంత మేర నష్టమనే చెప్పాలి. ఆయన వెంట ఇవాళ కాకపోతే రేపు అయినా.. అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆ పార్టీలోకి వెళ్లకుండా ఉంటారనే గ్యారంటీ లేదు. అదే జరిగితే.. నల్గొండ జిల్లాలో పార్టీకి చాలా బలంగా నిలవగల ఇద్దరు నాయకులు వెళ్లిపోయినట్లే. ఆర్థికంగా కూడా పార్టీ చాలా వరకు అండ కోల్పోయినట్టే అవుతుంది. అదే సమయంలో ధన- మంది బలం పరంగా కమలదళం నల్గొండ జిల్లాలో చాలా పెద్ద ఎడ్వాంటేజీ పొజిషన్ లోకి వెళుతుంది.
కమలదళం.. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో.. చాలా రకాలుగా గేమ్ ప్లాన్ లను అనుసరిస్తోంది. అందులో కాంగ్రెస్ నుంచి చేరికలు కూడా ప్రధానమైనవి. ఇటీవలే.. కాంగ్రెస్ కు కూడా దూరంగా ఉంటున్న ఇంపార్టెంట్ నాయకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేరారు. ఇప్పుడు కోమటిరెడ్డి చేరితే.. అది కూడా కీలకమైనదే. ఈ చేరికలు, రాష్ట్రవ్యాప్తంగా మరింత మంది కాంగ్రెస్ నాయకులను, కమలదళం వైపుగా ప్రభావితం చేయొచ్చు.
చాలా చిన్నస్థాయి నాయకులు కూడా కొందరిని ఢిల్లీదాకా తీసుకువెళ్లి.. వారిని కాంగ్రెస్ లో రాహుల్ సమక్షంలో చేర్చుకోవడం ద్వారా.. పీసీసీ సారధి రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ లోకి కూడా చేరికలు జరుగుతున్నాయనే భ్రమ కల్పించడానికి ప్రయత్నించారు. అయితే రాజగోపాల్ రెడ్డి వెళ్లిపోతే గనుక.. ఆ ఝలక్ ను తట్టుకోవడం అంత ఈజీ కాదు. దానిని అధిష్ఠానం సీరియస్ గా తీసుకుంటుంది. పైగా.. రాష్ట్ర కాంగ్రెస్ లో రేవంత్ పట్ల కినుకతో ఉన్న అనేక మంది నాయకులు.. దీనిని రేవంత్ చేతగానితనంగా ముడిపెట్టి రాద్ధాంతం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ గండంనుంచి రెడ్డి గారు ఎలా బయటపడతారో చూడాలి.