Advertisement

Advertisement


Home > Politics - Opinion

ఏపీ విపక్షాలు + పచ్చ మీడియా = ఆవు వ్యాసం

ఏపీ విపక్షాలు + పచ్చ మీడియా = ఆవు వ్యాసం

అనగనగా 'ఆవు వ్యాసం' అనే ఒక కథ ఉంటుంది! స్కూల్లో పరీక్షకు ఆవు వ్యాసం మాత్రమే చదువుకుని ప్రిపేర్ అయిన ఒక కుర్రాడు.. పరీక్షలో ఏ సబ్జెక్టు గురించి వ్యాసం రాయమని అడిగినా సరే, దాన్ని రకరకాలుగా మలుపులు తిప్పి, అందులోకి 'ఆవు'ను చొప్పించి... తాను చదువుకున్న ఆవు వ్యాసాన్ని యధాతధంగా రాసేసి.. మమ అనిపించే అతి తెలివితేటలకు సంబంధించిన కథ అది! 

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాల తీరు కూడా.. అలాంటి అతి తెలివి కుర్రాళ్ళ కంటే భిన్నంగా ఏమీ లేదు! ప్రకృతి విపత్తులు, సహజమైన పరిణామాలు, వనరుల లేమి వలన కలిగే ఆర్థిక ఇబ్బందులు, ఇలాంటి అంశాలు ఏవైనా సరే.. వాటి గురించి మాట్లాడేటప్పుడు రకరకాలుగా మెలికలు తిప్పి చివరికి జగన్ ప్రభుత్వ వైఫల్యంగా బురద చల్లడానికే వారు ప్రాధాన్యం ఇస్తున్నారు! వారు నేర్చుకున్న పాఠం ఒక్కటే.. జగన్ ను విమర్శించడం! అనుసరిస్తున్న మార్గం ఒక్కటే... ఏమి జరిగినా సరే, విమర్శలకు తగినట్లుగా ఆ సమస్యను అష్ట వంకర్లు తిప్పడం.

ముందుగా ఒక కథ చెప్పుకుందాం.. ఓ కుర్రవాడు పరీక్షలకోసం ఆవు వ్యాసం మాత్రమే బాగా చదువుకున్నాడు. ‘‘ఆవుకు నాలుగు కాళ్లు ఉండును.. ఆవు గడ్డి తినును, ఆవు పాలు ఇచ్చును..’’ వాడికి తెలిసినదెల్లా ఈ సంగతులే. తీరా ఒక పరీక్షలో విమానం గురించి వ్యాసం రాయమని ప్రశ్న వచ్చింది. సదరు కుర్రాడేమీ బెదిరిపోలేదు. ఇలా రాశాడు ‘‘విమానంలో మనం గాలిలోకి ఎగరవచ్చును.. కిటికీలోంచి చూస్తే కింద ఆవు కనిపించును.. ఆవుకు నాలుగు కాళ్లు ఉండును.. ఆవు గడ్డి తినును, ఆవు పాలు ఇచ్చును..’’ ఇలా ముగించాడు! టీచరు వాడిని మందలించి.. ఇంకో పరీక్షలో అమెరికా గురించి రాయమన్నాడు. దానికి వాడిలా రాశాడు.. ‘‘అమెరికాలో ఇంగ్లిషు మాట్లాడతారు. అక్కడ కూడా ఇండియాలో వలె ఆవులు ఉండును. వాటిని కౌ అని పిలిచెదరు. ఆ కౌ అనగా ఆవు. ఆ  ఆవుకు నాలుగు కాళ్లు ఉండును.. ఆవు గడ్డి తినును, ఆవు పాలు ఇచ్చును..’’ ఇదీ వాడు వ్యాసం రాసే పద్ధతి! నివ్వెర పోవడం ముక్కున వేలేసుకోవడం టీచరు వంతు అయిపోయింది! అలాంటి తుంటరి పిల్లవాడి అజ్ఞానం మరియు అతితెలివి వలన ఇబ్బంది పడింది.. చివరకు అయ్యవారే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం అదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇక్కడ సదరు అజ్ఞానము మరియు అతి తెలివి దండిగా కలిగి ఉన్న తుంటరి పిల్లవాడి పాత్రను ప్రతిపక్షాలైన తెలుగుదేశం మరియు జనసేన పోషిస్తుండగా.. వారి నిర్వాకాలు అర్థంలేని వ్యాఖ్యల వలన వెర్రివాళ్లు అవుతున్నది మాత్రం ప్రజలే. ఇక పోతే ‘ఆవు వ్యాసం’ అంటే ఏమిటి? అదే మనం అర్థం చేసుకోవాలి!

వేతనాలు ఆలస్యం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టోటల్ గా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవం. ఈ సంగతి చెప్పడానికి నిరూపణలేమీ అక్కర్లేదు. విభజన తర్వాత ఏర్పడిన తొలి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎంతటి అయోమయ స్థితిలోకి నెట్టేసి వెళ్లిందో అందరికీ తెలుసు. ఆర్థికంగా కేంద్రం నుంచి దక్కవలసినవి ఏవీ సాధించకుండా.. తమ సొంత పనులు చక్కబెట్టేకునేంత వరకు కేంద్రంలో బిజెపితో కలిసి అధికారాన్ని పంచుకుని, తమ పబ్బం గడిచిన తర్వాత.. వారిని విడిచిపెట్టి.. తెలుగుదేశం ఎన్ని కుట్ర రాజకీయాలకు పాల్పడిందో అందరికీ తెలుసు. ఈ కుట్రల్లో భాగంగానే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేకహోదాను మంటగలిపేశారు. విభజన చట్టం ద్వారా ఏపీకి హక్కుగా దక్కవలసినవి ఏవీ పట్టించుకోకుండా.. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టారు. ఆ కుట్ర రాజకీయాల దుష్ఫలితాలను.. ఏపీ ఇప్పటికీ అనుభవిస్తోంది. ఆర్థిక వనరులు లేవు. ఎప్పటికప్పుడు విపరీతమైన లోటు బడ్జెట్ లోనే రాష్ట్రం నడుస్తోంది. 

ఇన్ని కష్టాల మధ్యలో.. పేద ప్రజల మొహాల్లో చిరునవ్వులు మాత్రమే చూడాలనుకున్న జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. తాను ఎన్నికల సందర్భంగా వారికి హామీ ఇచ్చిన అన్ని పనులనూ ఇప్పటికే అమల్లోకి తెచ్చేశారు. ఆ రకంగా ప్రజా సంక్షేమానికి ప్రతి నెలా కొన్ని వేల కోట్ల రూపాయల అదనపు వ్యయం అవుతోంది. పరిపాలన పేరుతో తమ సొంత ఖజానాలను నింపుకోవడం మినహా.. ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోని పాలకులకు ఇదంతా కొత్తే. కానీ.. జగన్ వాటన్నింటినీ అమలు చేస్తున్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నా.. వాటిని అధిగమించి ముందుకు సాగుతున్నారు. 

ఇబ్బందులతో కూడిన ఈ ప్రస్థానంలో కొన్ని ఒడిదొడుకులు చాలా చాలా సహజం. అలాంటివే ఉద్యోగులకు జీతాలు ఆలస్యం కావడం. కొన్ని శాఖలకు కొన్ని రోజులు జీతాలు ఆలస్యం అవుతున్నాయి. కానీ.. ప్రతిపక్షాలు గానీ.. పచ్చ మీడియా గానీ.. రెండో తేదీనుంచే కూతలు, రాతలు మొదలెడతారు. రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దివాలా తీసినట్లుగా ప్రజల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. వరుసగా కొన్ని నెలల పాటూ అసలు జీతాలే ఇవ్వని పరిస్థితి ఉంటే ఎంత రచ్చ చేయాలో.. అంత రచ్చను కొన్ని రోజులు ఆలస్యం అయినందుకే చేస్తుంటారు. ఒక వారం రోజులు ముందూ వెనుక కావొచ్చుగాక.. ప్రతినెలా ఉద్యోగులకు జీతాలు వస్తూనే ఉన్నాయికదా అనే సహేతుకతను అర్థం చేసుకోరు. 

వారికి తెలిసిన ఆవు వ్యాసం ఒక్కటే. జగన్ ప్రభుత్వం మీద బురద చల్లడం. జీతాలు ఆలస్యం అయితే.. జగన్ సర్కారు చేతగానితనం వల్లనే అలా అయిందని ప్రచారం చేయడం. జీతాలు ఆలస్యం కావడానికి ఉండగల.. కారణాలను వారు విశ్లేషించరు. కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. వారు చదువుకున్న ఆవు వ్యాసం - ప్రభుత్వానికి చేతకాదని చెప్పడం మాత్రమే. అందుకే.. జీతాలు ఆలస్యం కావడాన్ని అటు తిప్పి ఇటుతిప్పి.. వందమలుపులతో.. చివరికి జగన్ ప్రభుత్వ వైఫల్యం కింద ప్రొజెక్టు చేస్తారు. 

దెబ్బతిన్న రోడ్లు..

దెబ్బతిన్న రోడ్ల గురించి పరీక్షలో వ్యాసం రాయమని అడిగారనుకోండి. ఎవరైనా ఏం రాస్తారు? రోడ్లు ఎందుకు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న రోడ్ల వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. ఆ రోడ్లు వేసి ఎంతకాలం అయింది? ఎంతకాలంగా వాటి మరమ్మతులు పట్టించుకోకపోవడం వలన అవి దెబ్బతిన్నాయి? వాటిని బాగు చేయాలంటే.. తిరిగి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలంటే.. ఏం చేయాలి? … ఇవీ ఎవరైనా సరే ప్లాన్ చేసి రాయగలిగిన వ్యాసంలోని అంశాలు. 

కానీ మన ఏపీలో ప్రతిపక్షాలకు గానీ, పచ్చ మీడియాకు గానీ.. ఇవేమీ తెలియవు. ఎందుకంటే ఈ వ్యాసాన్ని వారు చదువుకోలేదు. వారు చదువుకున్న ‘ఆవు వ్యాసం’.. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చేతకావడం లేదు అనేది మాత్రమే. అందుకే దెబ్బతిన్న రోడ్ల గురించిన సంగతి రెండు లైన్లు రాసి.. తిరిగి దానిని జగన్ కు ముడిపెట్టడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని బురద చల్లేస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతిన్న మాట వాస్తవం. ఇందుకు ఇంకా అనేక కారణాలూ ఉన్నాయి. ఈ రోడ్లు ఏమైనా వైసీపీ వచ్చిన తర్వాత నిర్మించిన రోడ్లు అయితే.. అవి దెబ్బతినగానే జగన్ ను నిందించడంలో అర్థముంది. తెలుగుదేశం హయాంలో వేసిన రోడ్లు కూడా చాలా పరిమితం. తెలుగుదేశం అయిదేళ్ల పదవీకాలంలో ఎన్ని వేల కోట్లు వెచ్చించి.. రోడ్లకు మరమ్మతులు చేయించింది.. ఈ గణాంకాలు ఎవరివద్దనైనా ఉన్నాయా? తెలుగుదేశం చెప్పగలుగుతుందా? తమ పాలన సాగినంత కాలం అసలేమీ పట్టించుకోకుండా వదిలేశారు. ఇవాళ మనకళ్ల ముందు దెబ్బతిన్న రోడ్లు కనిపిస్తున్నాయంటే వాటి అర్థం.. మూడేళ్లలో నాశనమైపోయినట్టు కాదు కదా.. ఎనిమిదేళ్లలో దెబ్బతినిపోయినట్టుగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వైసీపీకి ఎంత బాధ్యత ఉందో.. అంతకుముందు కూడా మరమ్మతుల గురించి పట్టించుకోని తెలుగుదేశానికి కూడా అంతకంెట ఎక్కువ బాధ్యత ఉందని తెలుసుకోవాలి. 

రోడ్లు పాడైపోవడానికి ఇదొక్కటే కారణమా? భారీవర్షాల సంగతి ఎవ్వరూ ఆలోచించరా? అదికూడా విడవని వర్షాల వలన.. ఏ సీజనులోనైనా రోడ్లు దెబ్బతింటాయి. అయితే ప్రాక్టికల్ గా ఆలోచించి.. ఇలాంటి విషయాలను పట్టించుకోకుండా.. తర్కించకుండా.. ప్రతిపక్షాలు గానీ.. పచ్చమీడియా గానీ చేస్తున్న పని ఒక్కటే.. ‘ఆవు వ్యాసం’ రాసేయడం! జగన్ ప్రభుత్వానికి చేతకావడం లేదని నిందలు వేసేయడం. ఇదంతా ఒక సామూహిక కుట్ర కాక మరేమిటి?

ఇవి మాత్రమే కాదు.. ప్రతిపక్షాలు ఇలా అర్థం పర్థం లేకుండా మాట్లాడే వ్యవహారాలు ఇంకా అనేకం ఉంటున్నాయి. తలాతోకా లేకపోయినా సరే.. ప్రతి విషయాన్నీ ఎన్నెన్నో మలుపులు తిప్పి.. జగన్ ప్రభుత్వపు చేతకానితనంగా ముడిపెట్టేస్తుంటారు. 

పోలవరం డ్యామ్ విషయంలో తెలుగుదేశం చేతకానితనం వల్ల కాఫర్ డ్యాం కొట్టుకుపోతే..  కొట్టుకుపోయిన నాటికి వైసీపీ అధికారంలో ఉన్నది గనుక.. నిందలన్నీ వారికే. వర్షాల వల్ల పోలవరం పనులు ఆలస్యం అయితే.. అందుకు నిందలన్నీ జగన్ మీదనే. 

ఎందుకింత కుట్రపూరిత కుత్సిత ప్రచారాలు?

పచ్చమీడియా కావొచ్చు, ప్రతిపక్షాలు కావొచ్చు.. ఇంతటి నీచానికి ఎందుకు దిగజారుతున్నట్టు? గోబెల్స్ మార్గంలో నడుస్తూ.. ఒకే అసత్యాన్ని పదేపదే చెప్పడం ద్వారా.. అదే సత్యం అని ప్రజలతో నమ్మేలా చేయవచ్చుననే కూహకానికి ఎందుకు తెరతీస్తున్నట్టు? ‘ఆవు వ్యాసం’ తరహా.. రాష్ట్రంలో  ప్రతి చిన్న పెద్ద విషయాన్నీ జగన్ కు ముడిపెడుతూ.. విషప్రచారాలతో ఎందుకు చెలరేగుతున్నట్టు?

దీనికి ఒక కారణం ఉంది. జగన్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నాయి. గడపగడపకు వైసీపీ కార్యక్రమం.. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ద్వారా అందిన లబ్ధి గురించి వారికి విపులంగా తెలియజెబుతోంది. ప్రజల్లో పార్టీకి, ప్రభుత్వానికి ఆదరణ పెరుగుతోంది. ఎన్ని ఇబ్బందులు ఎంతగా ప్రభుత్వాన్ని సతమతం చేస్తున్నా సరే.. కించిత్ లోటు లేకుండా,  ఇచ్చిన మాట తప్పకుండా,  మడమ తిప్పకుండా జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ పోతుండడం.. ప్రజలు ఆ ప్రయత్నాలను హర్షిస్తుండడం, ఆశీర్వదిస్తుండడం చూసి ప్రతిపక్షాలు పచ్చ మీడియా ఓర్వలేకపోతున్నారు. అందుకే ప్రజల దృష్టిని ప్రభుత్వానికి ఆదరణ పెంచుతున్న సంక్షేమ పథకాల మీదికే వెళ్లనివ్వకుండా.. ఇలాంటి నీచ ప్రచారాలతో తెగబడుతున్నారు.

ఎన్ని కుట్రలైనా జరగవచ్చు గాక.. కానీ, అంతిమంగా.. మంచి జయిస్తుంది. కుట్ర నిష్ఫలమవుతుంది. ప్రకృతి ఎన్నటికీ కూడా మంచికే సహకరిస్తుంది. ఇ లాంటి కుట్రలతో వారు తాత్కాలికంగా విజయాలు సాధించవచ్చు. ప్రభుత్వానికి ప్రజల్లో చెడ్డపేరు వ్యాప్తి చేస్తున్నామని సంబరపడవచ్చు. కానీ అంతిమ విజయం మాత్రం ఎప్పటికీ మంచికే దక్కుతుంది. 

.. ఎల్. విజయలక్ష్మి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?