రూపాయి తూలిపోవటమూ కొత్త కాదు, పడిపోవటమూ కాత్త కాదు. చూసి రాజకీయ పక్షాలు తుళ్ళిపడటమే కొత్త. నిజమే. ఒక డాలర్ పొందాలంటే 80 రూపాయిలివ్వాలి. కానీ గతంలో పడ్డట్టు ఒక్కసారిగా ధబీల్మని పడలేదు. మరీ ముఖ్యంగా ఓ పదేళ్ళ క్రితం కూడా ఇలాగా పడిరది. అప్పుడెంత? 55 నుంచి 60 రూపాయిలకు ఒక సారి పడిరది. మళ్ళీ వెంటనే 60 నుంచి 65 రూపాయిలకు పడిరది. అయిదేసి రూపాయిల పతనమే. కానీ 60 నుంచి 65 రూపాయిలకు కేవలం 65 రోజులు పట్టింది. మరి ఇప్పుడో? ఇప్పుడూ అయిదు రూపాయిల పతనమే. ఇందుకు ఏకంగా 851 రోజులు పట్టింది. అంటే కొంచెం తక్కువలో రెండున్నర యేళ్ళు పట్టింది. అంటే చాలా నెమ్మదిగా జారింది. అది కూడా శాతంలో చూసుకుంటే దాదాపు ఏడు శాతం. కానీ జపనీయుల యెన్ 19 శాతానికీ, బ్రిటన్ పౌండు 13 శాతానికి, యూరో 11 శాతానికీ పడిపోయాయి.
కానీ ఇండియా ఒక్కటే దెబ్బతిన్నట్లు, ఇంత ఉలికిపాటు ఏమిటి? ఇది కేవలం దేశానికి సంబంధించి కాదు. దేశానికి చెందినది. కారణాలు తెలుస్తూనే వున్నాయి. అమెరికా కేంద్రబ్యాంకు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచింది. దాంతో పెట్టుబడులు అమెరికా వైపు తిరిగాయి. వీటన్నిటినీ మించి, ఉక్రెయిన్ పై రష్యా యుధ్ధం కారణంగా విశ్వవ్యాపితంగా వస్తువుల ధరలు పెరిగాయి. ఇక ముడి చమురు ధర సరేసరి. అది ఆకాశాన్నంటింది. దాంతో ఇండియా సహా అన్ని దేశాలూ, ఈ చమురు పొందటానికి ఎక్కువ సొమ్ము వెచ్చించాలి. ఫలితంగా ‘వర్తవ వ్యత్యాసం’ (ఎగుమతులను మించి దిగుమతుల స్థాయి) పెరిగి పోతుంది. అయితే భారత ఆర్థిక వ్యవస్థ ఒక్కటే ఇప్పటికిప్పుడు పాతాళానికి వెళ్ళిపోదు. ఇండియాలోని ‘విదేశీ మారక ద్రవ్యపు ( ఎగుమతులద్వారా, ప్రవాస భారతీయుల సేవల దారా, ఇతేరత మార్గాల ద్వారా కూడబెట్టిన) నిల్వలు ఎక్కువే వుంటాయి. ప్రపంచంలోనే ఇలాంటి నిల్వలు ఎక్కువగా వున్న దేశాల్లో ఇండియాది అయిదవ స్థానం. కాబట్టి ఇప్పుడున్న రీతిలోనే ముడిచమరు వంటి వాటిని విదేశాలనుంచి మరో రెండేళ్ళ పాటు దివ్యంగా దిగుమితి చేసుకోవచ్చు.
రూపాయికి పతనానికి ముందునుంచే, దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. నిత్యావసర వస్తువులు ధరలయితే పరుగులు తీస్తూనే వున్నాయి. ఇంక పెట్రోలు ధర అయితే ‘సెంచరీ’ని కొట్టటం కాదు, దాటేసింది. దీనికి తోడు కేంద్రం ఇటీవల వస్తుసేవల సుంకాన్ని (జీఎస్టీని) పెంచేసింది. మరీ ముఖ్యంగా మధ్యతరగతి వారు ఉపయోగించే ఆహార పదార్దాలమీద వేసేసి వుంది. ప్యాక్ చేసి అమ్మే ప్రతీ దినుసు మీదా అయిదు నుంచి ఎనిమిది శాతం వరకూ జీఎస్టీ పడిపోయింది. పెరుగు, మజ్జిగ, పన్నీర్ వంటే పాక్ చేసిన వస్తువుల అయితే సరేసరి. అంతే కాదు, పాక్ చేసిన ఇతర పానీయాల మీద కూడా ఇదే బాదుడు.
పతనమయిన రూపాయితో, ధరలు పెరిగిన ఈ వస్తువులను సామాన్యులు ఎలా కొనగలరో, ఇట్టే ఊహించుకోవచ్చు. ఇక పరిశ్రమల వారీ చూస్తే, ఐటీ పరిశ్రమ నెత్తిన పాలు పోసినట్లే. ఎందుకంటే ఈ పరిశ్రమ బిల్లింగ్ అంతా డాలర్లలోనే జరుగుతుంది. ఆ తర్వాత లబ్ధి పొందే రంగం ఫార్మా. ఇందుకు సంబంధించిన ముడి పదార్ధాలు ఇండియానుంచే వెళ్తాయి. మరీ ముఖ్యంగా వీటి ఎగుమతుల్లో 30 శాతం అమెరికాకు వెళ్తాయి. అంటే ఇండియాకు విదేశ మారకద్రవ్యం ఈ కారణంగా పెరుగుతుంది. ఇలా ఒక చోట పోతుంటే, ఒక చోట వచ్చే స్థితి వున్నది. ఎంత కూడ దీసినా, ఒక్క ముడిచమురు దిగుమతి చాలు, దేశాన్ని కృంగ దీయటానికి.
అసలే దేశంలో నిరుద్యోగం ప్రమాద కర స్థాయిలో వుంది. వ్యవసాయ రంగం కుదేలవటం వల్ల, రైతుల పరిస్థితి ఆందోళన కరంగా వుంది. అందుకు మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు చేసిన ఆందోళనలే చిహ్నం. రెండేళ్ళ కోవిద్ కాలంలో, కొత్తగా ఏర్పడ్డ నిరుద్యోగానికి అద్దం పట్టింది. మరీ ముఖ్యంగా రోడ్లమీదనే మరణించిన వలసకూలీలే అందుకు ఉదాహరణ. ఈ నిరుద్యోగం కోవిద్ వల్ల ఏర్పడిరది కాదు, కోవిద్ వల్ల బయిటపడిరది. అంతే.
గత రెండు దశాబ్దాలుగా, రాజకీయ పక్షాలు రెండు ‘ఉ’ల మీద ఆధారపడి పోయాయి.
ఒకటి: ఉద్వేగాలు
రెండు: ఉచితాలు
ఈ ఉద్వేగాలకు మతం, ప్రాంతం ప్రధాన కారకాలు అయ్యాయి. మైనారిటీల మీద వ్యతిరేకత, మెజారిటీ మతస్తుల అనుకూలతగా మార్చుకోవటం బీజేపీ, శివసేన వంటి పార్టీలకు కలిసొచ్చిన ఉద్వేగం. బీజేపీ అయితే ఇప్పటికీ ఇలాంటి ఉద్వేగం మీదనే ప్రధానంగా ఆధారపడుతోంది. ఇక ఉచితాలంటే, ఈ విషయంలో ఏ రాజకీయ పార్టీకీ ఈ విషయంలో చేతికి ఎముక వుండటంలేదు. బియ్యం, చక్కెర, వంటనూనె లాంటి వి సబ్సిడీలకు అందించటానికి కాలం చెల్లింది. ఇప్పుడు ఏకంగా నగుదును నేరు గా వివిధ పథకాలకింద ప్రజల ఖాతాల్లోకి జమ చెయ్యటం. ఇలా ఇచ్చిన పైసలు వారానికి మించి సరిపోకవచ్చు. అయినా ‘ఉచితం’ ఉచితమే కదా! ఈ విషయంలో కేంద్రంలో వున్న బీజేపీ ఎలా వున్నా, రాష్ట్రంలో వున్న, రాష్ట్రాల్లో అధికారంలో వున్న (బీజేపీ సహా) అన్ని పార్టీలు ఒకదానిని మించి, మరొకటి ‘ఉచితాల’ను పంచుతూనే వున్నాయి.
ఉచితాలతో అన్ని రోజులూ పొట్టగడవవనే రహస్యం బోధపడితే, అసలు కే మోసం వస్తుంది. ఈ రూపాయి పతనం అంతిమంగా, ఆ స్థితికే తీసుకు వెళ్తుంది. ఈ స్థితి సార్వత్రిక ఎన్నికల (2024) నాటికే రావాలా? ఏమో పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తుంది. అందుకే ‘ ఈ నేరం నాది కాదు, రాష్ట్రాలదే’ అని, కేంద్రం రాష్ట్రాల మీద వేస్తోంది. ‘ఉచితాల’ను రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు ప్రోత్సహిస్తున్నాయన్నట్టుగా సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీయే మాట్లాడారు. అలాగే ఈ ఉచితాలతో ఖజానాలను డొల్ల చేసుకుంటున్న పది రాష్ట్రాలను గుర్తించినట్టుగా కేంద్రం ప్రకటించిది. అందులో రెండు తెలుగు రాష్ట్రాలూ వుండటం విశేషం. రాష్ట్రాల్లో అధికారంలో వున్న ప్రభుత్వాలు మాత్రం తక్కువ తిన్నాయా? ఈ స్థితి రావటానికి కేంద్రమే కారణమనీ, కేంద్రంనుంచి రావాల్సిన నిధులను విడుదల చెయ్యటం లేదనీ చెబుతున్నాయి.
కాబట్టి పడిపోయే రూపాయి, తానొక్కటే పడకుండా, ప్రభుత్వాలను పడవేసుకుంటూ పోదు కదా..! ఈ భయంతోనే పరస్పరణ ఆరోపణలు చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది