cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Analysis

అనగనగా ఓ మంత్రిగారి అమ్మాయి..

అనగనగా ఓ మంత్రిగారి అమ్మాయి..

కేంద్రంలోని బిజెపి మంత్రుల్లో స్మృతి ఇరానీని తెలియని వారు ఉండరు. ఆమె పేరు ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. నిజానికి ఈ వివాదం చాలా చాలా చిన్నది.. కానీ స్మృతి ఇరానీ అనవసరంగా దాన్ని మరింతగా కెలుక్కుంటూ.. మరింత పెద్దది చేసుకుంటున్నారు. స్వయంగా ఇంటిగుట్టును రచ్చకెక్కించుకుంటున్నారు.. అనే అభిప్రాయాలు ప్రజల్లో వినిపిస్తున్నాయి.

కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి అమేథీలో రాహుల్ ను మట్టి కరపించిన ఘనమైన చరిత్ర ఉంది. జెయింట్ కిల్లర్ గా ఆమె మోదీ మంత్రివర్గంలో చాలా గొప్ప పదవులనే పొందుతోంది. పైగా మోడీకి విధేయురాలు కావడం.. మరింత లాభం.. కలిసి వస్తోంది కూడా. 

అలాంటి స్మృతి ఇరానీ చెబుతున్న ప్రకారం.. 18 ఏళ్ల వయస్సున్న ఆమె కూతురు జోయిష్ ఇరానీ.. ఇంకా డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. 

కాంగ్రెస్ పార్టీ చెబుతున్న ప్రకారం.. జోయిష్ ఇరానీ, గోవాలో ఒక బార్ నిర్వహణలో భాగస్వామిగా ఉంది. 

తాజాగా వివాదం మొత్తం ఈ రెండు వాదనల చుట్టూ నడుస్తోంది. గోవాలో సిల్లీ సోల్స్ అనే బార్ స్మృతి ఇరానీ కూతురు జోయిష్ కు చెందినదని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు.. చనిపోయిన వ్యక్తి పేరుతో అదనంగా ఒక బార్ లైసెన్సు తీసుకున్నారని, అది కేవలం స్మృతి ఇరానీ జోక్యం చేసుకోవడం వల్లనే సాధ్యమైందని ఆరోపిస్తున్నారు. 

కాంగ్రెస్ పార్టీలో రాహుల్ భజనపరులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ వాదనను అందిపుచ్చుకున్నారు. రాహుల్ ను ఓడించిన స్మృతి ఇరానీ మీద బురద చల్లితే.. తమ అధినాయకుడు ప్రసన్నతను పొందగలమనే నమ్మకం వారితో ఈ పని చేయించి ఉండొచ్చు. మంత్రి కూతురా కాదా అనే విషయాలన్నింటినీ పక్కన పెడితే.. జోయిష్ ఇరానికి నిజంగా సిల్లీ సోల్స్ అనే బార్ లో వాటా ఉన్నదా లేదా? అనే విషయాలు అన్నింటినీ కూడా పక్కన పెడితే.. అక్కడ జరుగుతున్న అక్రమ వ్యవహారం (ఏదైతే కాంగ్రెస్ చెబుతున్నదో) అది చాలా చిన్నది. సమాజాన్ని సర్వనాశనం చేసేస్తున్నదీ.. కోట్లకు కోట్ల రూపాయల ప్రజాధనం కాజేస్తున్నదీ కూడా కాదు. 

కాకపోతే.. విలువలను సిద్ధాంతాలను వల్లించే భారతీయ జనతా పార్టీకి చెందిన కేంద్రమంత్రి కూతురు విచ్చలవిడితనానికి ఆటపట్టు అయిన గోవాలో బార్ నిర్వహిస్తోందనే విషయం ప్రజలకు తెలియడం వలన పోయే పరువే.. ఆ అక్రమ వ్యవహారం కంటె ఎక్కువ. అందుకే.. తన కుమార్తెను అనవసరంగా ఈ వివాదంలోకి లాగారని ఆమెకు అసలు ఎలాంటి సంబంధమూ లేనేలేదని స్మృతి ఇరానీ అంటోంది. 

కాంగ్రెస్ వారికి లీగల్ నోటీసులు కూడా పంపింది. రాహుల్, సోనియాలను విమర్శిస్తున్నందుకే తన కూతురును ఈ వివాదంలోకి లాగారని అంటోంది. కాంగ్రెసు వారి ఆరోపణ తప్పు కావొచ్చు గానీ.. నిత్యం రాహుల్, సోనియాలను కొన్ని వేల మంది నిందిస్తూ ఉంటారు.. వారెవ్వరినీ ఈ స్థాయిలో పట్టించుకోని కాంగ్రెస్ నేతలు.. జోయిష్ ఇరానీ మీదనే ఈ ఆరోపణలు ఎందుకు చేశారనేది ఎవరికీ అర్థంకాని సంగతే.

నిజానికి స్మృతి ఇరానీ తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. పెద్ద పెద్ద రాజకీయ ఆరోపణలను కూడా ప్రజలు రెండు రోజుల్లో మరచిపోతారు. అవి నిజమే అయినా కూడా వారు పెద్దగా పట్టించుకోరు. అలాంటిది.. అంత సీరియస్ కాని, ఈ ఆరోపణ గురించి మాటిమాటికీ స్పందించడం ద్వారా.. లీగల్ నోటీసులు పంపడం ద్వారా.. ‘‘స్మృతి ఇరానీ కూతురు బార్ నడుపుతోంది’’ అనే టాపిక్ మరి కొన్ని నెలలు లేదా సంవత్సరాల పాటూ, వీలైతే వచ్చే ఎన్నికల కాలం వరకు ప్రజల మధ్య చర్చనీయాంశంగానే ఉండడానికి ఆమె అవకాశం ఇచ్చారు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో స్మృతి ఇరానీ పడ్డారా అనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది.

జగన్ ముందు కుప్పిగంతులు పనికిరావు

బ్లాక్ లో టికెట్ లు అమ్మిన సప్తగిరి