ఈనాడు పత్రికలో ఓ వార్తకు ప్రాధాన్యం ఇవ్వడం అంటే… జగన్ ప్రభుత్వానికి నష్టం కలిగించడానికే అని ఎవరైనా అర్థం చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జాప్యానికి కారణాల్ని విశ్లేషిస్తూ ఈనాడు ఓ ఆసక్తికర కథనం రాసింది. హైదరాబాద్ ఐఐటీ నిపుణుల నివేదిక పేరుతో పోలవరం జాప్యానికి జగన్ ప్రభుత్వం ఏ విధంగా కారణమైందో రాసుకొచ్చింది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇంత ఆలస్యానికి ప్రధాన కారణం కాంట్రాక్టర్లను మార్చడమే అని నిపుణులు తేల్చి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఎందుకు ఆలస్యమవుతోంది? పరిష్కార మార్గాలేంటి? ఎలా ముందుకెళ్లాలనే అంశంపై థర్డ్ పార్టీతో కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టుపై అధ్యయనం చేయించింది. హైదరాబాద్ ఐఐటీ నిపుణులు తమకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించారు. చివరికి ఆ నిపుణులు తేల్చింది ఏంటయ్యా అంటే… ప్రధాన డ్యాంతో పాటు కాలువల పనుల్లోనూ కాంట్రాక్టర్‌ను మార్చడం వల్లే సమస్యలు తలెత్తాయి. ఎడమ కాలువలో కాంట్రాక్టర్లను మార్చడం వల్ల కాంట్రాక్ట్ వివాదాలు ఏర్పడ్డాయని నిపుణులు నిగ్గు తేల్చారు.
భూసేకరణ, పునరావాస కార్యక్రమాల్లో ఆలస్యం కావడం కూడా పోలవరం జాతీయ ప్రాజెక్ట్ నిర్మాణం జాప్యం కావడానికి కారణమని నిపుణులు పేర్కొన్నారు. పోలవరాన్ని నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి వ్యూహాత్మక ప్రణాళిక లేదని హైదరాబాద్ ఐఐటీ నిపుణులు నివేదిక ఇచ్చారట! అలాగే ప్రభుత్వం నుంచి సరైన సమయంలో ఆకృతుల ఆమోదం, మార్గదర్శనం లేకపోవడం కూడా ప్రాజెక్ట్ నిర్మాణంలో ఆలస్యం కావడానికి కారణంగా చెప్పుకొచ్చారు.
ఏ ప్రాజెక్ట్‌కైనా భూసేకరణ, పునరావాసం ప్రధాన అంశాలు. అలాగే ప్రాజెక్ట్ డిజైన్. అదేంటోగానీ, కేంద్ర ప్రభుత్వానికి, హైదరాబాద్ ఐఐటీ నిపుణులకు, ఈనాడు ప్రతినిధులకు అవి అప్రధానమైనవిగా కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వీటి కంటే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లను మార్చడమే తీవ్రమైన నేరంగా కనిపించడం గమనార్హం.
కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాజెక్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం మొదటి తప్పని నిపుణులకు అనిపించలేదు. చంద్రబాబు హయాంలో తీసుకున్న ప్రాజెక్ట్… కనీసం ఆకృతులు కూడా ఆమోదం పొందలేదంటే ఇక ఏం చేసినట్టు? ప్రాజెక్ట్ నిర్మాణానికి మొదటి నుంచి మార్గదర్శనం లేకపోవడం ఏంటి? అసలు భూసేకరణ, పునరావాస సమస్యలు పరిష్కరించకుండానే భారీ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఎలా మొదలు పెట్టారనే ప్రశ్నలకు సమాధానం ఏంటి? ఇలాంటి వాటికి నిపుణులు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు సమాధానాలు ఇవ్వరు. ఎందుకంటే వీరి దృష్టంతా కాంట్రాక్టు పనులపైనే.
ఈనాడు పత్రిక ఇవాళ ఈ స్థాయిలో కథనం రాయడం వెనుక ప్రధాన కారణం…. రాష్ట్రాన్ని తనకు ఇష్టం లేని వ్యక్తి పాలిస్తుండడం. ఈ కథనంలో నిజానిజాల సంగేతేమో గానీ, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ జాప్యానికి కాంట్రాక్టర్ల మార్పు కాదు… ఏపీలో అధికార మార్పు ప్రధాన కారణం అనేది ఈనాడు రాయని నిజం. ఈ కథనం ద్వారా పాఠకులు గ్రహించిన వాస్తవం ఇదే. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జాప్యానికి తిలా పాపం తలా పిడికెడు అనే చందంగా తయారైంది. అంతిమంగా రాష్ట్ర ప్రజానీక ప్రయోజనాలు బలి అవుతున్నాయి.