భారతీయ వైద్యం పరిష్కారం  చూపిస్తుందా ? 

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్- 19 లేదా కరోనాను తరిమికొట్టే మందు ఏమిటి ? వైద్య శాస్త్రంలో తలలు పండిన నిపుణులకు, దిగ్గజ డాక్టర్లకు అంతుచిక్కని ప్రశ్న ఇది. వైద్య శాస్త్రం బాగా అభివృద్ధి చెందిన…

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్- 19 లేదా కరోనాను తరిమికొట్టే మందు ఏమిటి ? వైద్య శాస్త్రంలో తలలు పండిన నిపుణులకు, దిగ్గజ డాక్టర్లకు అంతుచిక్కని ప్రశ్న ఇది. వైద్య శాస్త్రం బాగా అభివృద్ధి చెందిన అమెరికా, బ్రిటన్, ఇతర విదేశాల్లోని వైద్య శాస్త్ర నిపుణులు సైతం తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. పరిష్కార మార్గం వెతుకుతున్నారు.

జోరుగా పరిశోధనలు సాగిస్తున్నారు. వ్యాక్సిన్లు తయారు చేస్తున్నారని, వాటిని పరీక్షిస్తున్నారని, ప్రయోగాలు చేస్తున్నారని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఏదీ ఫలితం ఇచ్చినట్లు కనబడలేదు.

ప్రపంచానికే పెద్దన్నగా వ్యవహరించే అమెరికా అన్ని దేశాలకంటే ఎక్కువగా కుదేలైపోయి బావురుమంటున్నది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అత్యంత దీన స్థితిలో ఉన్నాడని చెప్పక తప్పదు. చివరకు భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి హైడ్రాక్సీ క్లోరోక్వీన్ వెంటనే పంపాలని  కోరాడు.

కానీ దాన్ని ఎగుమతి చేయడంపై మోడీ ఆంక్షలు విధించడంతో ట్రంపుకు కోపం వచ్చి ఆ మందు పంపకపోయావో ప్రతీకారం తీర్చుకుంటాం అని బెదిరించాడు. సరే… చివరకు మోడీ ఎలాగోలా ఒప్పుకున్నాడనుకోండి. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలియాలి కదా.

హైడ్రాక్సీ క్లోరో క్విన్ కోసం ఒక్క అమెరికానే కాదు, ఇంకా అనేక దేశాలు భారత్ ను వేడుకుంటున్నాయి.  మరి అన్ని దేశాలు కష్టాల్లోనే ఉన్నాయి కదా. ఈ మందు కరోనాకు విరుగుడు కాకపోయినా దానికి చికిత్సలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

కరోనాకు ఇంకా మందు కనుక్కోలేదు కాబట్టి అందుబాటులో ఉన్న మందులు, వ్యాక్సిన్లు వాడవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. పూర్తిగా గుడ్డిగా ఉండటం కంటే మెల్ల బెటర్ కదా ధోరణిలో ఉంది ప్రపంచం. కరోనాకు సరైన మందు కనుక్కునేవరకు లాక్ డౌన్, మనుషులు దూరంగా (ఫిజికల్ డిస్టెన్స్) ఉండటం తప్ప మరో మార్గం లేదు.

ఈ వైరస్ తనంతతాను కదలదు కదా. మనిషి కదిలితేనే కదులుతుంది. ఈ నేపథ్యంలో కొందరు కరోనాకు భారత దేశమే మందు కనుక్కుంటుందని అంటున్నారు. వైద్యం కోసం విపరీతంగా ఖర్చు చేస్తున్న, అత్యాధునిక వైద్య వ్యవస్థ ఉన్న దేశాలే ఏం చేయాలిరా భగవంతుడా అనుకుంటూ లబోదిబోమంటుండగా భారత దేశం ఎలా మందు కనిపెడుతుంది ?

ఆయుర్వేదం ఉందిగా మన చెంత … కరోనా రోగులకు ఎందుకు చింత అంటున్నారు కొందరు దేశభక్తులు, మోడీ అభిమానులు. ఆయుర్వేద వైద్యంలో కరోనాకు కచ్చితంగా త్వరలోనే చికిత్స లభిస్తుంది. ప్రస్తుత పరిస్థితిలో ఆయుర్వేదం ఒక్కటే పరిష్కారమార్గం. బ్రిటన్ యువరాజు చార్లెస్ కు ఆయుర్వేధంతోనే నయమైంది. ఆ వైద్యానికి పశ్చిమ దేశాల్లో ఆమోదం లేదు. అందుకే ప్రిన్స్ చార్లెస్ ఆ విషయాన్ని బయట పెట్టడంలేదు … అన్నాడు కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద నాయక్.

ప్రపంచంలో అనేక వైద్య విధానాలున్నాయి. కానీ ఎక్కువగా అల్లోపతి ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతమాత్రం చేత మిగతా వైద్య విధానాలు పనికిమాలినవి కాదు. అల్లోపతిలో తగ్గని రోగాలు ఆయుర్వేదంలో, హోమియోలో తగ్గిన దాఖలాలు ఉన్నాయి.

ప్రస్తుత విపత్కర పరిస్థితిలో ప్రతి వైద్య విధానంలోనూ పరిశోధనలు జరగాల్సిందే. కరోనాకు మందు కనుక్కోవడమే ప్రధానం. అది ఏ వైద్య విధానమైనా పర్వాలేదు. తెలంగాణా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరో అడుగు ముందుకు వేసి మూలికా వైద్యం పై, గిరిజన వైద్యం పై పరిశోధనలు జరగాలన్నారు.

గిరిజనుల వైద్య పద్ధతులపై అధ్యయనం చేయాలన్నారు. గిరిజన వైద్యానికి కొన్ని వ్యాధులు నయమవుతాయని కొందరు చెబుతుంటారు. అందులో నిజానిజాలేమిటో తెలుసుకోవలసిన అవసరం ఉంది. దేన్నీ కాదనకూడదు. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరు చెప్పగలరు ? 

బన్నీ బర్త్ డే గిఫ్ట్ అదిరిందిగా