'మీరు ఇంకా ఎందుకు సినిమాలు తీస్తున్నారు?' అని విఖ్యాత నటుడు, దర్శకుడు క్లింట్ ఈస్ట్ వుడ్ ను అడిగితే.. 'ఇంకా చెప్పడానికి, చూపించడానికి చాలా కథలు మిగిలి ఉండటం వల్ల..' అంటూ ఆయన సమాధానం ఇస్తారు! ఏదో మాట మాత్రంగా తన గొప్ప చెప్పుకోవడానికి ఈస్ట్ వుడ్ ఈ మాట చెప్పలేదు. ఆయన సినిమాలే ఈ విషయాన్ని అనునిత్యం నిరూపిస్తూ ఉంటాయి. 90 యేళ్ల వయసులో కూడా నటిస్తూ, దర్శకత్వం వహిస్తూ కొత్త కొత్త కథాకథనాలను సినిమాలుగా ప్రేక్షకులకు అందిస్తున్న ఈస్ట్ వుడ్ రూపొందించిన గొప్ప సినిమాల్లో ఒకటి 'చేంజ్లింగ్'. ఇంకా చెప్పడానికి కథలు మిగిలే ఉన్నాయన్న ఈస్ట్ వుడ్ స్టేట్ మెంట్ లోని డెప్త్ కు నిదర్శనాల్లో ఒకటి 'చేంజ్లింగ్'.
దాదాపు 90 సంవత్సరాల కిందట అమెరికాలో చోటు చేసుకున్న ఒక సంచలనాత్మక కేసు ఆధారంగా రూపొందించిన సినిమా ఇది. 2008లో విడుదల అయిన ఈ సినిమాకు సంబంధించిన కథను అప్పటి వరకూ మరే హాలీవుడ్ మూవీ మేకర్ కానీ, టీవీ షో ల వాళ్లు కానీ అంతగా పట్టించుకోక పోవడం గమనార్హం! ఎన్నో సీరియల్ కిల్లింగ్ మిస్టరీల గురించి హాలీవుడ్ సినిమాలు వస్తూ ఉంటాయి. అయితే అంత వరకూ ఎవరూ పెద్దగా పట్టించుకోని, సంచలనాత్మక, కాలిఫోర్నియన్ స్టేట్ చట్టాలనే మార్చేసేంత దుమారం రేపిన కేసును ఈస్ట్ వుడ్ సినిమాగా మలిచాడు.
మర్డర్ మిస్టరీలు, సీరియల్ కిల్లర్ మిస్టరీల ఆధారంగా చాలా సినిమాలు వస్తూ ఉంటాయి. అయితే వాటిల్లో చాలా ఫిక్షన్ ఉంటుంది. అలాంటి సినిమాలు చాలా వరకూ కల్పిత కథలే. అయితే.. ఒక వాస్తవ కథను వక్రీకరించకుండా, దాదాపు 90 శాతం వరకూ కేసు ఫైల్స్ నుంచినే వివరాలను తీసుకుని.. ఒక చక్కటి మిస్టరీ సినిమాను మలచడం ఈస్ట్ వుడ్ స్టోరీ టెల్లింగ్ పనితనానికి నిదర్శనం. కథను సింపుల్ గా మొదలుపెట్టి.. చివరి వరకూ ఎక్కడా పట్టు సడలనీయకుండా ఆఖరి సీన్ వరకూ ఇంకా ఏదో దాగే ఉంటుందనేంత స్థాయిలో ఆసక్తిని కలిగిస్తాడు దర్శకుడు.
కాలిఫోర్నియా స్టేట్ హిస్టరీలో ఒక సంచలనాత్మక కేసు 'వైన్ విల్లే చికెన్ కూప్ మర్డర్ కేసు'. చిన్న పిల్లలను పట్టుకెళ్లి వారిని దారుణంగా హతమార్చిన ఒక కెనడియన్ సీరియల్ కిల్లర్ కేసు ఇది. లాస్ ఏంజెలెస్ లో ఒక చిన్నపిల్లాడి మిస్సింగ్ కేసుకూ, ఈ సీరియల్ కిల్లర్ కూ ఉన్న సంబంధం మొదట బయటపడక.. పోలీసులు తమ నిర్లక్ష్యధోరణితో వ్యవహరించిన తీరుపై పదునైన అస్త్రం ఈ సినిమా. వందేళ్ల కిందటి లాస్ ఏంజెలెస్ పోలీసుల తీరును ఎండగట్టడమే కాదు.. నేటికీ మన దగ్గర కూడా పోలీసుల ధోరణిని గుర్తు చేసే గొప్ప సోషియో సెటైరిక్ ఈ సినిమా.
అనునిత్యం పేపర్లలో మిస్సింగ్ కేసులను చూస్తుంటాం. చిన్న పిల్లలు మిస్ అయ్యారని, యువతి కనపడటం లేదని, వృద్ధుడు తప్పిపోయాడని… ఇలాంటి కథనాలు జిల్లా స్పెషలల్లో కనిపిస్తూ ఉంటాయి. పత్రికల్లో ఒక్క రోజు అచ్చయ్యే వార్తలు కావవి, వాటిని ఫాలో అప్ చేస్తే.. ఎంతో షాకింగ్ విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. మన దగ్గర కూడా చాలా కేసుల్లో ఫాలో అప్ ఉండదు. ఆ కేసులన్నీ ఎప్పుడు తేలాతాయో, ఎలా ముగుస్తాయో ఎవరికీ పట్టదు. వాటిని అనుభవించే వాళ్లకు తప్ప. అలాంటి ఒక తల్లి అనుభవం నుంచి ఈ సినిమా ప్రారంభం అవుతుంది. స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా స్టార్ట్ చేశారు కానీ, ఈ సినిమా కథ దాదాపు 90 శాతం నిజం అని ఆ కేసు పేపర్లు చెబుతాయి.
టెలిఫోన్ ఎక్సైంజ్ లో పని చేస్తూ ఉంటుంది క్రిస్టిన్ కాలిన్స్ (ఏంజెలీనా జోలీ). భర్త వదిలేయడంతో సింగిల్ మదర్ గా ఆమె పిల్లాడిని చూసుకుంటూ, ఉద్యోగంతో జీవనం సాగిస్తూ ఉంటుంది. ఒక హాలిడే రోజు అనుకోకుండా ఆమె ఎక్సైంజ్ కు వెళ్లాల్సి వస్తుంది. సినిమాకు తీసుకెళ్తానని అప్పటికే తనయుడికి హామీ ఇచ్చి ఉంటుంది. అయితే అనుకోకుండా పని పడిందని, ఇంట్లో జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్లిపోతుంది.
సాయంత్రం ఇంటికి వచ్చే సరికి పిల్లాడు ఇంట్లో ఉండడు. భయపడిపోయిన కాలిన్స్ ఇరుగూపొరుగు చూసి వస్తుంది. అయితే ఎక్కడా తన పిల్లాడు కనపడడు. పోలీసులకు ఫోన్ చేస్తుంది. చిన్నపిల్లల మిస్సింగ్ కేసులను కనీసం 24 గంటలు గడిస్తే కానీ తీసుకోమంటారు. ఎందుకంటే.. వారు ఎక్కడైనా దాక్కొని ఉండవచ్చని, తెలిసిన వారి ఇంటికి వెళ్లి ఉండవచ్చని పోలీసులంటారు. అంతిమంగా మిస్సింగ్ కేసు నమోదవుతుంది.
మరోవైపు లాస్ ఏంజెలెస్ పోలిస్ వ్యవస్థ పూర్తిగా కరప్ట్ అయ్యిందని, హింసాత్మకంగా మారిందని, ప్రజలకు భద్రత కల్పించడాని కన్నా భయపెడుతోందని కొంతమంది పోరాడుతూ ఉంటారు. ఒక చర్చి ఈ పోరాటంలో ముందుంటుంది. ఈ మిస్సింగ్ కేసును కూడా చర్చ్ ప్రస్తావిస్తుంది. కొడుకు కేసు గురించి తరచూ పోలీసులకు ఫోన్ చేస్తూ, తీవ్రమైన బాధలో అల్లాడుతుంటుంది కాలిన్స్. ఐదు నెలల తర్వాత… ఉన్నట్టుండి పోలీసులు ఆమె పని చేస్తున్న ఎక్సైంజ్ కు వచ్చి.. పిల్లాడు దొరికాడని సమాచారం ఇస్తారు. పిల్లాడు మరో చోట దొరికాడని, రైల్లో వస్తున్నాడని, మీడియా ముఖంగా ఆమెకు పిల్లాడిని అప్పగించి తమపై ఒత్తిడి తొలగించుకోవడానికి రెడీ అవుతారు పోలీసులు.
స్టేషన్ కు వెళ్లిన కాలిన్స్ కు బిగ్ షాక్. పిల్లాడిని అయితే అప్పగిస్తారు కానీ, వాడు ఆమె కొడుకు కాదు! పిల్లాడిని చూడగానే వాడు తన కొడుకు కాదని పోలీసులకు చెబుతుంది కాలిన్స్. అయితే వారు ఆమెను కన్వీన్స్ చేస్తారు. ఐదు నెలల్లో పిల్లాడి రూపు రేఖలు మారి ఉండవచ్చని, కాబట్టి ఇంటికి తీసుకెళ్లాలని అంటారు. పిల్లాడు దొరికిన తీరు, వాడు చెప్పే వివరాలు, అన్నింటికీ మించి పేరు కూడా అదే చెబుతున్నాడని అంటారు. అర్థం కాని పరిస్థితుల్లో కాలిన్స్ ఆ పిల్లాడిని ఇంటికి తీసుకెళ్తుంది. ఆ వార్త పత్రికల్లో కూడా ప్రముఖంగా ప్రచురితం అవుతుంది.
ఇంటికి వెళ్లాకా.. ఆ పిల్లాడు తన కొడుకు కాదని కాలిన్ నిర్ధారించుకుంటుంది. వాడిని అడిగితే.. నువ్వే నా తల్లివి అంటాడు! వచ్చినవాడి గురించి కాలిన్ కుపెద్దగా బెంగలేదు, అయితే వీడు దొరికాడని చూపించిన పోలీసులు ఇక తన అసలుకొడుకు గురించి వెదకరనే బాధ ఆమెకు ఎక్కువవుతుంది. పోలీసులకు ఈ విషయాలను కూలంకషంగా చెబుతుంది. అయితే వారు పూర్తిగా అడ్డం తిరుగుతారు. నీ కొడుకు దొరికాడు, అప్పగించాం.. అంటారు. కాదని వాదిస్తే, నువ్వు పిల్లాడిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నావంటారు. ఈ విషయంలో చర్చి వాళ్లు కాలిన్స్ తరఫున నిలబడారు.
పత్రికలను పిలిచి జరిగిందంతా చెబుతుంది ఆమె. అయితే ఆమెను పోలీసులు తీసుకెళ్లి సైకోపాతిక్ వార్డులో అడ్మిట్ చేస్తారు. తొలి రోజు ఆ పిల్లాడు తన తనయుడే అని ఆమె ఒప్పుకుందని, ఇప్పుడు కాదంటోందని.. ఆమెకు పిచ్చి పట్టిందంటూ అక్కడ ట్రీట్ మెంట్ స్టార్ట్ చేస్తారు. ఆ సైకోపాతిక్ వార్డు పూర్తిగా పోలీసుల కనుసన్నల్లో నడుస్తుంటుంది. అక్కడ కాలిన్స్ వాదనను ఎవ్వరూ లెక్క చేయరు. డాక్టరు కూడా! ఈ సమయంలో మరో కేసుకు సంబంధించి ఒక డొంక కదలడంతో పోలీసులు ఇరకాటంలో పడతారు.
కెనడా నుంచి అక్రమంగా వలస వచ్చిన ఒక పిల్లాడిని పట్టుకోవడానికి ఒక చికెన్ కూప్ కు వెళ్లిన పోలీసులకు అక్కడ చోటుచేసుకున్న దారుణాలు తెలుస్తాయి. ఆ చికెన్ కూప్ లో పిల్లాడిని అతడి బంధువు స్టివర్ట్ నార్త్ కాట్ బంధించి ఉంటాడు. స్టివర్ట్ ఒక సైకో. సుదూర ప్రాంతాలకు వెళ్లి చిన్న పిల్లలను పట్టుకుని వచ్చి, తన చికెన్ కూప్ లోదారుణంగా హతమారుస్తూ ఉంటాడు స్టివర్ట్. అతడు కూడా కెనడా నుంచి అక్రమంగా వలస వచ్చినవాడే. స్టివర్ట్ తో ఉండిన కుర్రాడు చికెన్ కూప్ లో జరిగిన దారుణాల గురించి పోలీసులకు సమాచారం ఇస్తాడు. మొదట అదంతా అబద్ధమని పోలీసులు భావిస్తారు. తీరా ఆ స్పాట్ కు తీసుకెళ్లి శరీర అవయవాలు పూడ్చిన చోట ఆ కుర్రాడు తవ్వి చూపడంతో సంచలన కేసు భయపడుతుంది.
లాస్ ఏంజెలెస్ పరిసర ప్రాంతాల నుంచి స్టివర్ట్ దాదాపు 20 మంది చిన్నారులను కిడ్నాప్ చేసి , తన చికెన్ కూప్ లో క్రూరంగా హతమార్చాడని, వారిని నరికి చంపి తన శాడిజాన్ని చల్లార్చుకున్నాడని పత్రికల్లో వార్తలు వస్తాయి. అంతే కాదు.. ఆ 20 మంది చిన్నారుల్లో కాలిన్స్ కొడుకు కూడా ఉన్నాడని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితం అవుతుంది. ఆ కేసు పెను సంచలనం అవుతుంది. తమ వెనుక అంత జరుగుతుంటే గ్రహించలేని పోలీసులు, తన పిల్లాడిని అప్పగించమన్న ఒక తల్లిని సైకోపాతిక్ వార్డులో పెట్టి హింసిస్తున్నారంటూ చర్చి ధ్వజమెత్తుతుంది. ఆమెను విడుదల చేయిస్తుంది. కెనడా పారిపోయిన స్టివర్ట్ ను పోలీసులు పట్టుకొస్తారు. అక్కడ నుంచి కేసు విచారణ మొదలవుతుంది.
ఒకవైపు స్టివర్ట్ దారుణాలపై విచారణ, మరోవైపు కాలిన్స్ పై పోలీసులు అనుచిత ప్రవర్తన, సైకోపాతిక్ వార్డులో జరిగే దారుణాలు, వేరే పిల్లాడని తెచ్చి ఆమెకు అప్పగించడం, ఆ పిల్లాడే తన కొడుకంటూ ఆమె ఒప్పుకోవాలని ఆమెను టార్చర్ చేయడం.. ఈ అంశాలన్నీ కోర్టులో పరిగణనలోకి వస్తాయి. కోర్టు రూమ్ డ్రామాను అద్భుతంగా చిత్రీకరించారు. కాలిన్స్ ను సైకోపాతిక్ వార్డులో పెట్టి హింసించే సీన్లు భయానకంగా ఉంటాయి. అన్నింటికీ మించి ఎమోషన్స్ హృదయాన్ని ద్రవింపజేస్తాయి.
పిల్లాడు మిస్ అయ్యాకా కాలిన్స్ పడే బాధ, తపన, ఈ సమయానికి తన తనయుడు ఏం చేస్తుంటాడో, వాడెక్కడుంటాడో అంటూ ఆమె సతమతమయ్యే సీన్లు హృదయాన్ని తాకుతాయి. తన పిల్లాడు బతికే ఉంటాడంటూ ఆమె ఆఖరి వరకూ నమ్మడం.. పిల్లాడి కోసం ఎదురుచూస్తూనే ఉండటంతో సినిమా ముగుస్తుంది. సైకో కిల్లర్ కు రెండేళ్ల జైలు శిక్ష, ఆపై ఉరిశిక్షను విధిస్తుంది న్యాయస్థానం. కాలిన్స్ తో అత్యంత దారుణంగా ప్రవర్తించిన పోలీసాఫీసర్ జేజే జోన్స్ ను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగిస్తారు.
లాస్ ఏంజెలెస్ పోలీస్ చీఫ్ ను డిమోట్ చేస్తారు. అంతే కాదు.. చట్ట సవరణలను సూచిస్తుంది కోర్టు. పోలీసు ఆఫీసర్లు తమ ఇష్టప్రకారం నిందితులను సైకో ట్రీట్ మెంట్ అంటూ మెంటల్ హాస్పిటల్స్ కు పంపించే చట్టాన్ని రద్దు చేయాలని న్యాయస్థానం ప్రభుత్వానికి సూచిస్తుంది. ఈ కేసు తర్వాతే కాలిఫోర్నియా రాష్ట్రంలో ఆ చట్ట సవరణ చేశారని వాస్తవ వివరాలు తెలుపుతున్నాయి. మరోవైపు కాలిన్స్ కొడుకునంటూ వచ్చిన పిల్లాడి గురించి కూడా విచారణ జరుగుతుంది. లాస్ ఏంజెలెస్ లో సినిమా స్టార్లను చూడవచ్చని తనే ఆమె కొడుకునంటూ వాడు అబద్ధం చెప్పి అక్కడకు వచ్చినట్టుగా తేలుతుంది. వాడిని తన అసలు తల్లికి అప్పగిస్తారు.
ఆద్యంతం మిస్టీరియన్ సాగే సినిమా ఎన్నో ఎమోషన్స్ ను క్యారీ చేస్తుంది. అనేక సీన్లు హృదయాన్ని ద్రవింపజేస్తాయి. అలా వ్యవస్థల డొల్ల తనాన్ని, పోలీసుల అమానవీయతను చర్చిస్తుంది. దండించే అధికారం తమ చేతిలో ఉందంటూ పోలీసులు బాధితులను మరింతగా బాధితులుగా మార్చే వైనాన్ని వాస్తవికంగా చూపుతుంది ఈ సినిమా. అసలు విషయాలను కనీసం పట్టించుకోకుండా మసిపూసి మారేడు కాయ చేయబోయిన వ్యవస్థపై తన తుదికంట ఆమె పోరాడింది.
అబద్ధాన్ని నిజమని నమ్మించాలన్న పోలీసుల ప్రయత్నాలకు చెక్ పెట్టింది. పోలీసుల మీద అయితే కాలిన్స్ గెలిచింది కానీ, విధి చేతిలో ఆమె ఓడిపోయింది. ఆమె తనయుడు ఆమె దగ్గరకు ఎప్పటికీ రాని వాస్త విషాదకథ ఇది. వందేళ్ల కిందటి వాస్తవం అయినా, ఇప్పటికీ పోలీస్ వ్యవస్థలో ఎలాంటి మార్పు వచ్చి ఉండదు. అమెరికాలో ఏమో కానీ, ఈ సినిమాలో పోలీసుల తీరును గమనిస్తే.. భారతీయ పోలిస్ వ్యవస్థ అడుగడుగునా గుర్తుకు వస్తుంది.
క్లింట్ ఈస్ట్ వుడ్ తను నటించకుండా కేవలం దర్శకత్వం వహించిన గొప్ప సినిమాల్లో ఇదొకటి. మిస్టిక్ రివర్, ఇన్ విక్టస్, సల్లీ, రిచర్డ్ జెవెల్.. వంటి మరిన్ని మంచి మంచి సినిమాలున్నాయి ఈస్ట్ వుడ్ ఖాతాలో. ఇవన్నీ తను నటించకుండా కేవలం దర్శకత్వం వహించిన గత దశాబ్దాల్లోని సినిమాలు.
-జీవన్ రెడ్డి.బి