బాలీవుడ్ అలనాటి స్టార్ హీరో, బెంగాలీ బాబు మిథున్ చక్రవర్తికి ఇప్పుడిప్పుడు చుక్కలు కనిపిస్తున్నట్టుగా ఉన్నాయి. బీజేపీ తరఫున ఎన్నికల ప్రచార సభలో తన సినిమా డైలాగులతో ఉర్రూతలూగించిన మిథున్ పై హింసను ప్రేరేపించారంటూ కేసులను పెట్టినట్టుగా ఉంది మమత ప్రభుత్వం.
ఒకవైపు పోస్ట్ పోల్ వయోలెన్స్ అంటూ బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే, ఎన్నికల ప్రచార సభల్లో ఈ బీజేపీ స్టార్ క్యాంపెయినర్ చేసిన హింసాత్మక ప్రచారాన్ని మమత ప్రభుత్వం తెరపైకి తీసుకు వచ్చింది.
మిథున్ పై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ఆవేశంలో అలా మాట్లాడినట్టుగా, కావాలని అలా మాట్లాడలేదని మిథున్ కోర్టుకు వివరణ ఇచ్చుకున్నాడు. అయితే మిథున్ ను విచారించడానికి కోర్టు పోలీసులకు అనుమతిని ఇచ్చింది. అయితే ఆ స్టార్ కు ఊరట ఏమిటంటే.. వర్చువల్ విధానంలో మాత్రమే విచారించాలని కోర్టు చెప్పడం.
లేకపోతే ఈ పాటికి ఈ బాలీవుడ్ స్టార్ పోలిస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వచ్చేదేమో! వాస్తవానికి మిథున్ కొన్నాళ్ల కిందట వరకూ టీఎంసీలోనే ఉన్నాడు. ఈ స్టార్ హీరోకు మమత పెద్ద పీట వేశారు. రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చారు. ఇక చిట్ ఫండ్ స్కామ్ లో మిథున్ పేరు కూడా వినిపించింది. ఆ పరిణామాలతో విసిగిపోయి మిథున్ రాజ్యసభ పదవికి రాజీనామా చేసి తప్పుకున్నాడు. అలాగే ఈయన సభకు హాజరుకాకపోవడం కూడా అప్పట్లో చర్చగా నిలిచింది.
అలా రాజకీయాలకు దూరంగా జరిగినట్టుగా కనిపించిన మిథున్ కు తర్వాత ఏమైందో కానీ, ఉన్నట్టుండి బీజేపీ వైపు వెళ్లాడు. టీఎంసీలో ఉన్నప్పుడు మిథున్ ను విమర్శించిన బీజేపీ, ఎన్నికల ప్రచార సభల్లో ఈయన స్టార్ డమ్ ను వినియోగించుకుంది. ప్రచారాన్ని హోరెత్తించింది.
ఇక తన సినిమాల్లోని మాస్, విలన్లను హెచ్చరించేందుకు హీరోగా తను పలికిన వయొలెంట్ డైలాగులను ఎన్నికల ప్రచార సభల్లో వినిపించాడు మిథున్. ఆ డైలాగులు చాలా తీవ్రంగానే ఉన్నాయి. పవన్ కల్యాణ్ లా తాట తీస్తా, తోలు తీస్తా.. అనకుండా మిథున్ ఎగిరి తంతే శ్మశానంలో పడతారు, నేను నాగుపామును కాటేస్తే చస్తారు..అన్నట్టుగా ప్రసంగించాడు. ఈ డైలాగులు ఎన్నికల ప్రచార సమయంలోనే చర్చనీయాంశంగా మారాయి.
మిథున్ తన సినిమాల్లో డైలాగులను వాడుతున్నారంటూ మీడియా ప్రస్తావించింది. ఇదంతా బీజేపీకి ఊపునిస్తుందంటూ అప్పట్లో విశ్లేషణలు వినిపించాయి. అయితే ఇప్పుడు మిథున్ పాలిట ఆ డైలాగులే ఇబ్బందికరంగా మారాయి. ఆ డైలాగులతో బీజేపీకి ఊపురావడం ఏమిటో కానీ, ఎక్కువ ఊహించుకున్న కమలం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ అయితే తగిలింది.
ఇక అవకాశం లభించడంతో బాలీవుడ్ స్టార్ కు బెంగాల్ ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. అయితే ఏదో ఉత్తుత్తిగా, ఆవేశంలో తను ఆ డైలాగులు చెప్పినట్టుగా, హింసను రెచ్చగొట్టే ఉద్దేశం తనకు లేనట్టుగా మిథున్ వివరణ ఇచ్చుకుంటున్నాడు. ఈ వయసులో నలుగురి గౌరవాన్ని పొందాల్సిన బాలీవుడ్ స్టార్ హీరో, తన అనుచితమైన ఆవేశంతో ఇలా వివరణలు ఇచ్చుకునే స్థితిని ఎదుర్కొంటున్నాడు.