ఒకవైపు ఎల్జేపీ పార్లమెంటరీ విభాగం అధ్యక్ష పదవి నుంచి చిరాగ్ పాశ్వాన్ ను తొలగించారు లోక్ సభ స్పీకర్. మొత్తం ఆరు మంది ఎంపీల పార్టీలో ఐదు మంది వేరు కుంపటి పెట్టి, తమ కొత్త నాయకుడిగా పశుపతి పరాస్ ను ఎన్నుకున్నట్టుగా లోక్ సభ స్పీకర్ కు లేఖ ఇవ్వడం, స్పీకర్ ఆ మేరకు స్పందించడం చకచకా జరిగిపోయింది!
బీజేపీకి ఎల్జేపీ మిత్రపక్ష పార్టీనే. తమ మిత్రపక్ష పార్టీలో చెలరేగిన ఈ సంక్షోభం పట్ల అధికార పక్షం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిదాయకంగా మారిన నేపథ్యంలో, లోక్ సభ స్పీకర్ నిర్ణయం చిరాగ్ కు శరాఘాతమనే చెప్పాలి.
ఇక తిరుగుబాటు ఎంపీలు తమ తదుపరి అడుగులో.. పార్టీని, గుర్తును కైవసం చేసుకునేలా ఉన్నారు. ఐదు మంది ఎంపీలు ఏకమై.. తమదే అసలైన ఎల్జేపీ అని సీఈసీకి కూడా లేఖ ఇచ్చారట. బిహార్ అసెంబ్లీలో ఎల్జేపీకి ఒక్కగానొక్క ఎమ్మెల్యే ఉండటం, ఆ ఎమ్మెల్యే కూడా జేడీయూ వైపు వెళ్లిపోవడం, ఉండిన ఒకే ఒక ఎమ్మెల్సీ కమలం తీర్థం పుచ్చుకోవడంతో.. ఎంపీలు ఆడింది ఆట, పాడింది పాటగా మారింది వ్యవహారం.
తిరుగుబాటు చేసిన ఆ ఐదు మంది ఎంపీలనూ తను సస్పెండ్ చేసినట్టుగా చిరాగ్ పాశ్వాన్ ప్రకటిస్తే, అతడినే తాము నాయకత్వ స్థానం నుంచి ఎప్పుడో తొలగించినట్టుగా ఆ ఎంపీలు తేల్చేశారు. తెలివిగా వారు మోడీపై విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. చిరాగ్ ను అధికార స్థానం నుంచి తొలగించినా, ఎల్జేపీ ఎన్డీయేలోనే ఉంటుందని అంటున్నారు. బీజేపీ నాయకత్వానికి వారు ఎదురుతిరగడం లేదు.
ఈ పరిణామాల్లో మోడీ ఎటు వైపు ? అనేది ఆసక్తిదాయకంగా మారింది. అధికారికంగా చిరాగ్ పాశ్వాన్ నుంచి పార్టీ జారి పోయింది. ఆయన ఎల్జేపీకి కాస్త పేరు మార్చి, మరో గుర్తును తెచ్చుకోవడం మినహా మరో గత్యంతరం లేకపోవచ్చు. మరి ఇలాంటి కష్టకాలంలో.. చిరాగ్ కు మోడీ నుంచి ఏ మేరకు సాయం అందుతుందనేది ఆసక్తిదాయకంగా మారింది.
అసలుకు ఈ రచ్చ రేగడానికి కారణమే.. కేంద్ర మంత్రి విస్తరణ అని తెలుస్తోంది. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో చిరాగ్ కు కేంద్రంలో సహాయ మంత్రిగా పదవి దక్కడం ఖాయమనే ప్రచారం జరిగింది. ఇన్నేళ్లూ రామ్ విలాస్ పాశ్వాన్ ఎల్జేపీ అధినేతగా కేంద్రంలో ఏ కూటమిలో ఉన్నా మంత్రి పదవిని పొందుతూ వచ్చారు.
ఇప్పుడు ఆయన తనయుడి వంతు వచ్చిందనే ప్రచారంలో.. పాశ్వాన్ లకు స్వయానా బంధువు తిరుగుబాటు చేశాడు. పశుపతి, ఆయన తనయుడు కూడా ఎంపీలేనట. ఇలాగే వదిలితే ఇక చిరాగ్ తమపై నాయకుడు అయిపోతాడని వారు తిరుగుబాటు చేసినట్టుగా ఉన్నారు.
మరి ఇప్పుడు ఎల్జేపీ పరిణామాలను పట్టించుకోకుండా చిరాగ్ కు కేంద్రమంత్రివర్గంలో చోటిస్తే.. మోడీ ఆయనకు పూర్తి ఆదరణ చూపించినట్టుగా అవుతుంది. అలా కాకుండా ఐదు మంది ఎంపీలు అటు వైపు ఉన్నారనే లెక్కలతో పశుపతికో, ఆయన తనయుడికో బీజేపీ వాళ్లు కేంద్రంలో మంత్రి పదవిని ఇస్తే.. అది చిరాగ్ రాజకీయానికి పెద్ద ఎదురుదెబ్బ అయ్యే అవకాశం ఉంది.
తన వెంట ఆరు శాతం ఓటు బ్యాంకు ఉందని చిరాగ్ చెబుతున్నారు. అది నిజమే కావొచ్చు.. అయితే ఆ మాత్రం ఓటు బ్యాంకు సంపాదించినా, బీజేపీ వ్యూహానికి చిరాగ్ తన పార్టీని బలిపెట్టినట్టు అవుతోందిప్పుడు! మరి ఇప్పుడు బీజేపీ నాయకత్వం చిరాగ్ ను ఎలా ట్రీట్ చేస్తుందనేదే బిహార్ రాజకీయంలో కూడా ఒక ఆసక్తిదాయకమైన పరిణామం అవుతుంది.