టీఎంసీని వీడి బీజేపీ వైపు వెళ్లినప్పుడు మరీ పెద్ద ప్రభావం చూపలేకపోయిన ముకుల్ రాయ్, బీజేపీని వీడి టీఎంసీ వైపు ఘర్ వాప్సీ చేస్తున్న తరుణంలో మాత్రం గట్టిగా దెబ్బ వేస్తున్నట్టుగా ఉన్నాడు. ఇప్పటికే తన తనయుడితో కలిసి తిరిగి టీఎంసీలో చేరిన ముకుల్ రాయ్ పాతిక మంది ఎమ్మెల్యేలను తిరిగి టీఎంసీలోకి చేర్చే పనిలో ఉన్నారట.
ఇలా బీజేపీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకు వచ్చి తిరిగి మమత మెప్పు పొందే ప్రయత్నాన్ని గట్టిగా చేస్తున్నారట రాయ్. ఈ విషయాన్ని ఆయన తనయుడే చెబుతున్నాడు. తన తండ్రితో పాతిక మంది వరకూ బీజేపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ ముకుల్ రాయ్ తనయుడు ప్రకటించుకున్నాడు.
ఇది ఉత్తుత్తి ప్రకటనే అనుకోవచ్చు. అయితే ఇటీవలే గవర్నర్ ను కలవడానికి వెళ్లిన బీజేపీ శాసనసభా పక్ష నేత సువేందు అధికారి వెంట యాభై మందికి మించి ఎమ్మెల్యే లేరట. గెలిచింది డెబ్బై మందికి పైనే అయినా, ఎన్నికలానంతర హింస గురించి గవర్నర్ కు చెప్పడానికి వెళితే ఆయన వెంట వెళ్లింది యాభై మంది ఎమ్మెల్యేలు మాత్రమేనట.
ఎన్నికల్లో నెగ్గిన టీఎంసీ బీజేపీ కార్యర్తలను వేధిస్తోందని ఫిర్యాదు చేయడానికి వెళితే ఏకంగా ఇరవై మందికిపైగా ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో రాయ్ టీఎంసీలోకి చేరిపోవడం, ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ లీకులు ఇవ్వడం బీజేపీని కలవర పెడుతూ ఉంది.
కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే కాదని, ఇద్దరు బీజేపీ ఎంపీలు కూడా టీఎంసీలోకి చేరే అవకాశాలున్నాయని కూడా రాయ్ తనయుడు శుభ్రాంగ్సు ప్రకటించాడు. మరి ఇన్నాళ్లూ వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను అటు ఇటూ మార్చడం, క్యాంపులు, ప్రభుత్వాలను కూలగొట్టడం వంటి విషయాల్లో పండిపోయిన బీజేపీకి ప్రతిపక్షంలో ఉన్న చోట ఎమ్మెల్యేలను కాపాడుకోవడం ఇప్పుడు పెద్ద పరీక్షగా మారుతున్నట్టుగా ఉంది.
ఒకవేళ ఇంతమంది ఎమ్మెల్యేలు నిజంగానే టీఎంసీ వైపు ఫిరాయిస్తే.. వారిపై బీజేపీ ఏదోలాగా అనర్హత వేటు వేయించగలదు. స్పీకర్ అందుకు సానుకూలంగా లేకపోయినా, కోర్టుల ద్వారా అయినా అనర్హతకు అవకాశాలున్నాయి. ఈ విషయాలు బెంగాలీ నేతలకు తెలియనివి ఏమీ కావు. ఉప ఎన్నికలను ఎదుర్కొనడానికి రెడీ అయ్యే వారు తిరిగి టీఎంసీకి మారే అవకాశాలు లేకపోలేదు.