తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఉన్నారు. అసలు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా కూడా పనికిరారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు విరుచుకుపడుతున్నారు.
మంత్రులు చంద్రబాబు నాయుడును ప్రతిపక్ష నేతగా పనికిరారు అని అనడానికి ప్రత్యేకమైన రీజన్ ఒకటి ఉందిక్కడ. అదే ప్రజలు కఠిన పరీక్షను ఎదుర్కొంటున్న వేళ చంద్రబాబు నాయుడు ఏపీలో లేకపోవడం!
దేశంలో లాక్ డౌన్ ప్రారంభానికి ముందు నుంచినే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ చేరుకున్నారు. ఆ తర్వాత కొంత అవకాశం ఉన్నా చంద్రబాబు నాయుడు ఏపీకి రాలేదు. చంద్రబాబు నాయుడు కుటుంబం హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే.
ఏపీ సీఎంగా ఉన్నప్పుడు ఎక్కడెక్కడికో తిరిగి, అక్కడి జనాలంతా అమరావతి రావాలంటూ చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చేవారు. అమరావతిలో ఆక్సిజన్ ఎక్కువగా ఉందంటూ అప్పట్లో చంద్రబాబు నాయుడు చెప్పేవారు. అయితే అలాంటి చోటకు తన కుటుంబాన్ని మాత్రం తరలించలేకపోయారాయన.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడూ ఆయన భార్య, కోడలు, మనవడు కేరాఫ్ హైదరాబాద్ గా ఉండేవారు. వారి అద్దెలూ గట్రా ఏపీ ప్రభుత్వ ఖాతా నుంచే చెల్లించేవారు. అది కూడా ఫైవ్ స్టార్ హోటళ్లలో మకాం. ఆ రెంట్లంతా ఏపీ ప్రజల డబ్బు త చెల్లించిన ఘనత చంద్రబాబుది. ఇక చంద్రబాబు సీఎం సీటు నుంచి దిగిపోయాకా ఆయన కుటుంబానికి ఏపీతో మరే అవసరం లేకపోయింది. దీంతో ఎంచక్కా హైదరాబాద్ లోనే ఉంటున్నారు.
చంద్రబాబు నాయుడు, లోకేష్ లు వారాంతాల్లో హైదరాబాద్ చేరుతున్నారు. అలా ఒక వారాంతాన హైదరాబాద్ చేరిన చంద్రబాబు నాయుడు మళ్లీ ఏపీకి రాలేదు. జనతా కర్ఫ్యూ ప్రకటించే సమయానికే చంద్రబాబు నాయుడు రావాలని అనుకుంటే ఏపీకి వెళ్లిపోయేవారు. కానీ వెళ్లలేదు. 21 రోజుల లాక్ డౌన్ నేపథ్యంలో కుటుంబం ఎలాగూ హైదరాబాద్ లో ఉండటంతో అక్కడే ఉంటున్నారు.
అక్కడ నుంచినే సమీక్షలు, లేఖలు అంటూ హడావుడి చేస్తున్నారు. ఈ విషయంపై వైసీపీ వాళ్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ఎక్కడో పక్క రాష్ట్రంలో దాక్కొని.. మాట్లాడుతున్నారు, ప్రజల కష్టాలను పట్టించుకోకుండా హైదరాబాద్ లో తలదాచుకున్న వ్యక్తి డ్రామాలు ఆడుతున్నారు, ఆయన రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా పనికి రారని ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పుకోలేకపోతోంది కూడా.