మనలో దాదాపు అందరికీ అవతలివాళ్లు ఎలాటి వాళ్లో తెలుసుకోవాలనే కుతూహలం ఉండడం సహజం. కుతూహలమే కాదు, అవసరం కూడా పడుతుంది. ఒక ఉద్యోగిగా చేర్చుకోవాలన్నా, వ్యాపారభాగస్వామిగా చేసుకోవాలన్నా, స్నేహం చేయాలన్నా, జీవితంలో చోటు యివ్వాలన్నా, కలిసి పని చేయాలన్నా- యిలా అనేకరకాలుగా మనకు అవతలి వాళ్ల గురించి ఒక అవగాహన ఉండడం అవసరం. మంచివాళ్లా, చెడ్డవాళ్లా, మాట వినేవారా? వినని వారా? నిజాలు చెప్తారా? నిజాయితీగా వుంటారా? శాంతంగా ఉంటారా? బాధ్యతగా వుంటారా? యిలాటివన్నీ కొంతకాలం పోయాక మనకే తెలుస్తాయి. వాటిని బట్టి చేరువవడమో, దూరం చేసుకోవడమో చేస్తాం. దీనికి పెద్ద తెలివితేటలు అక్కరలేదు.
అయితే ఒక మనిషి అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అనేది అర్థం చేసుకోవాలంటే మాత్రం బుర్ర ఉపయోగించాల్సిందే. అది ఒక మెంటల్ గేమ్. ఎవడికి తోచిన కారణాలు వాడు చెప్తాడు. దీన్నే మనుషులను చదవడం అంటారు. అతని స్వభావాన్ని విశ్లేషించి, దానికి కారణాలను కనుగొని, భవిష్యత్తులో రాబోయే సందర్భాల్లో అతనెలా ప్రవర్తిస్తాడో ఊహించి చెప్పడం, అది నిజమైతే భుజాలు చరుచుకోవడం.. ఒక్కోప్పుడు మనం అనుకున్నదాని కంటె భిన్నంగా ప్రవర్తిస్తే దానికి మళ్లీ యింకో కారణం వెతకడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ ఒకేలా వుండరు. అనుకోని విధంగా ప్రవర్తించి, మనను ఆశ్చర్యపరుస్తారు. అప్పుడు ‘వాడి అసులు బుద్ధి అదేరా, యిన్నాళ్లూ నటించాడు’ అని సర్ది చెప్పుకుంటాం. కానీ అలా ఒక్కోప్పుడు భిన్నంగా ప్రవర్తించడం కూడా సహజమే అని తెలుసుకోం.
నలుగురు కలిసి ఐదో మిత్రుడి కోపస్వభావం గురించి ఏకాభిప్రాయానికి వచ్చారనుకోండి. ఇక దానికి కారణాల గురించి ఎవరి విశ్లేషణ వారిదే. అసలా ప్రాంతం వాళ్లందరూ అంతేరా అంటాడొకడు. కొన్ని కోట్ల మంది అలాగే ఉంటారా? మరి అదే ప్రాంతం వాడైన ఫలానావాడు శాంతంగానే ఉంటాడుగా, ప్రాంతం కాదు, కులం బట్టి అహంకారం వచ్చింది. అదే కోపంగా ప్రదర్శిస్తాడు, అందరి మీదా చిర్రుబుర్రులాడతాడు అంటాడు మరోడు. ఆ కులంలో మర్యాదగా వున్నవాళ్లు లేరా, కోపతాపాలు జీన్స్ బట్టి వస్తాయి. నిజానికి వాడి కోపం వాళ్ల నాన్న నుంచి వచ్చిందిరా, ఆయనా అంతే దూర్వాసుడుట అంటాడు ఒకడు. మరి వాళ్ల తమ్ముడికి రాలేదేం అంటే సమాధానం రాదు. ఇలా తెలిసున్నవాళ్లందరి గురించి చర్చలు జరుగుతూనే ఉంటాయి.
కాలేజీ రోజుల్లో అయితే ఫలానావాడికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనో, మరోడికి సుపీరియారిటీ కాంప్లెక్స్ అనో, ఇంకోడు తన ఇన్ఫీరియారిటీని కప్పిపుచ్చుకోవడానికి సుపీరియారిటీ చూపిస్తాడనో, ఫలానావాడికి తను చాలా సుపీరియర్ అనే అభిప్రాయం మనసులో ఉన్నా పైకి హంబుల్‌గా ఉన్నట్లు నటిస్తాడనీ.. యిలా తెగ విశ్లేషణలు జరిగిపోతూ ఉంటాయి. ఇక అక్కణ్నుంచి వాడు అధికుణ్నని ఫీలవడానికి లేదా న్యూనతగా ఫీలవడానికి కారణాలేమిటి అని వెతుకుతారు. డబ్బు వుండడం లేకపోవడం, వాళ్ల నాన్నకు హోదా ఉండడం లేకపోవడం, అందం ఉండడం లేకపోవడం, ఉందని అనుకోవడం, లేదని అనుకోవడం, తమ కులం గొప్పదని అనుకోవడం, అనుకోకపోవడం, చదువు రావడం రాకపోవడం.. యిలా వీటిపై ఎవరికి తెలిసిన వివరాలు వాళ్లు చెప్తారు. అమ్మాయిలు అబ్బాయిల గురించి, అబ్బాయిలు అమ్మాయిల గురించి యిలాటి విశ్లేషణలు మరింత జోరుగా చేస్తారు.
ఇది కాలేజీతో ఆగిపోదు, ఆఫీసుల్లో కూడా సాగుతుంది. ‘‘నాకు తెలుసు గురూ, నేను ఫలానా బ్రాంచ్‌లో పని చేసినపుడు చూశా. వీడిలాటి వాడే ఒకడుండేవాడు. సేమ్ యిలాగే గిరజాల జుట్టూ కళ్లజోడూ అదీ, నైస్‌గా మాట్లాడేవాడు. స్టయిల్‌గా కనబడేవాడు. చిట్టీలు పాడతానని చెప్పి అందరి దగ్గరా డబ్బు వసూలు చేసి, ఓ రోజు రాజీనామా చేసి పారిపోయాడు. వీడూ అలాగే చేస్తాడు చూస్తూ ఉండు.’’ అనే మాటలు వినబడతాయి. ఆ పోలికలేమిటో, అవెంత వరకు నమ్మాలో అర్థం కాదు.
తెలియనిదాని గురించి తెలుసుకోవడానికి ఇండక్షన్ మెథడ్, డిడక్షన్ మెథడ్ అనే రెండు మెథడ్స్ కలిపి ఉపయోగించాలని తర్కం చెపుతుంది. కాకి ఎగురుతోంది, చిలుక ఎగురుతోంది, పిచిక ఎగురుతోంది. ఇలా ఎగిరేవాటినన్నిటిని ఒక గ్రూపులో వేసి, వాటిలో ఉన్న సామాన్యగుణం కనుక్కోవడం ఇండక్షన్. సామాన్యగుణం ఏమిటి? రంగా? కాదు ఎందుకంటే కాకి నలుపు, చిలుక ఆకుపచ్చ. సైజా? కాదు పిచిక చిన్నది, గ్రద్ద పెద్దది. ఇలా జాగ్రత్తగా పరిశీలిస్తూ పోతే మనకు తెలుస్తుంది -` అవన్నీ పక్షి జాతికి చెందినవి అని. పక్షులన్నీ ఎగురుతాయి అనే సూత్రాన్ని కనిపెడతాం.
ఇప్పుడు నేను ఆఫ్రికాలో జుంజుం అనే జీవి వుంది. అదేమిటో తెలుసా? అని అడిగితే మీరు అది పాకుతుందా? ఎగురుతుందా? అని అడుగుతారు. ఎగురుతుంది అంటే అయితే పక్షి అని చెప్తారు. ఎందువలన అంటే పక్షులు ఎగురుతాయనే మీకున్న పూర్వజ్ఞానాన్ని దీనికి అప్లయి చేసి కొత్తదాని గురించి తెలుసుకున్నారు. ఇది డిడక్షన్. సింపుల్‌గా చెప్పాంటే స్పెసిఫిక్ అబ్జర్వేషన్ నుంచి జనరలైజేషన్‌కు వెళ్లేది ఇండక్షన్ అయితే, దానికి రివర్స్‌లో వెళ్లేది డిడక్షన్. షెర్లాక్ హోమ్స్ యిలాటి తర్కాన్ని ఉపయోగించే అనేక కేసులు సాల్వ్ చేస్తాడు.
అయితే దీనికి విపర్యాలు కూడా ఉంటాయి. గాలిపటం ఎగురుతుంది, విమానం ఎగురుతుంది. ఎగురుతోంది కదాని మీరు వాటిని పక్షి అన్నారంటే లెక్క తప్పుతుంది. పక్షులన్నీ ఎగరాలని కూడా లేదు. పెంగ్విన్ జంప్ చేస్తుంది తప్ప ఎగరలేదు. మలేసియాలోని డోడో ఎగిరేది కాదు. అందువలన మన జ్ఞానానికి పరిమితులు ఉంటాయి. పైగా మనం సమాచారం ఎక్కణ్నుంచి సేకరించామనేదాన్ని బట్టి కూడా ఆధారపడి వుంటుంది. తెలుగు సినిమాలు చూసి రాయలసీమ వాళ్లందరూ నెత్తుటితోనే స్నానాలు చేస్తారని, హీరోలు తొడగొడితే రైలు ఆగిపోతుందని నమ్మి దాని ఆధారంగా తీర్మానాలు చేస్తే మనది జ్ఞానం అవదు.
సర్వేలు నిజం కావడానికి, కాకపోవడానికి కారణం తీసుకున్న శాంపిల్స్ ఎంపికలో నాణ్యత. ఎంతమందిని చూశాడో తెలియదు కానీ ఒకాయన నాకు చెప్పాడు - ‘కుడి చేతి అలవాటున్నా కుడి మణికట్టుకి వాచీ పెట్టుకునే వాళ్లలో తమ మాటే నెగ్గాలన్న పట్టుదల వుంటుంది చూడండి’ అని. వేరేలా కాలక్షేపం కాకపోతే మీరివాళ్టి నుంచి అలాటి వాళ్లను గమనించే పనిలో వుండవచ్చు.
పక్షుల గురించి అయితే భౌతిక లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మానసిక లక్షణాలకు వస్తే ఒక జాతివన్నీ ఒకేలా ప్రవర్తిస్తాయి. కానీ మనుష్యులకు వచ్చేసరికి స్వభావాల విషయంలో ఒక కేటగిరీలో వేయడం చాలా కష్టం. అయినా వేయడంపై చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. ఫలానా విధంగా మాట్లాడితే ఫలానా తరహా మనిషి అంటున్నారు. ఏమీ మాట్లాడకున్నా శరీరాంగాల కదలిక బట్టి విశ్లేషిస్తున్నారు. దాన్ని బాడీ లాంగ్వేజ్ అంటున్నారు. ఇంటర్వ్యూకి వచ్చినవాడు కాళ్లు దగ్గరగా పెట్టుకుంటే ఒకలా అని, దూరంగా పెడితే మరోలా అని, ఒకదానిపై మరొకటి వేసుకుంటే యింకోలా అని ప్రతిపాదిస్తున్నారు. కాఫీ కప్పు పట్టుకునే విధానం దగ్గర్నుంచి, తల వంచిన పద్ధతి దాకా అన్నీ చదివేస్తున్నారు, తమకు తోచిన అభిప్రాయానికి వచ్చేస్తున్నారు.
ఈ చర్యలబట్టి స్వభావాలు నిర్ధారించడం కష్టమనుకుంటే ఆ స్వభావాలకు కారణాలు కనుగొనడం మరీ మరీ కష్టం. కష్టమైన కొద్దీ మానవుడికి ఉత్సుకత మరింత పెరుగుతుంది. ఏవేవో కారణాలు వెతుకుతాడు, ప్రతిపాదనలు చేస్తాడు. గ్రహాల కారణంగా స్వభావం ఉంటుందని చెప్తూ ఉంటారు. ఉదాహరణకి జూన్ నెలలో పుట్టినవారు ఉదార స్వభావులని, జులైలో పుట్టినవారు పిసినారులనీ.. యిలా. మన భారతీయ పద్ధతిలో కూడా మేషరాశిలో పుడితే ధైర్యవంతులు అవుతారని, వృషభరాశిలో పుడితే బద్ధకస్తులవుతారనీ.. యిలాటివి చెప్తూంటారు. ఉన్నవే 12 రాశులు, 12 నెలలు. అంటే జనాభాలో 8.3% మంది ఒకేలా ఉంటారా?
అసలు కారణాలు కనుక్కోవలసిన అవసరమేముంది అనే ప్రశ్న రావచ్చు. తక్కినవారిని చదవడం హాబీ అనుకుని ఊరుకోవచ్చు. కానీ మన విషయంలోనే మన మనోవేదనకు కారణాలు తెలుసుకోవలసిన అవసరం పడుతుంది, మనకు అనారోగ్యం కలిగినపుడు! శారీరక రుగ్మతలు వైరస్సు, బాక్టీరియా, తినే ఆహారం, చేసే (లేదా చేయని) కసరత్తు వలన మాత్రమే కాదు, మనసు కారణంగా కూడా వస్తాయి. వాటిని సైకో సొమాటిక్ డిజార్డర్స్ అంటారు. సైకీ అంటే మనసు, సోమా అంటే శరీరం.
ఈ కాన్సెప్టు మన ఆయుర్వేదంలో కూడా ఉంది. మనసు, శరీరం ఒకదానిపై మరొకటి ఆధారపడతాయని, ఒకటి జబ్బు పడితే మరొకటీ పడుతుందని చెప్పారు. దానికి ఉదాహరణగా గిన్నెలో నెయ్యిని వేడిచేయడం చూపారు. గిన్నె వేడి వలన నెయ్యి కరుగుతుంది, కరిగే నెయ్యి రగిలించే వేడి వలన గిన్నె వేడెక్కుతుంది. అందువలన నెయ్యి సగం కరుగుతూండగానే పొయ్యి ఆర్పేయవచ్చు. హోమియోపతిలో కూడా మానసిక లక్షణాలకు చాలా ప్రాధాన్యత యిచ్చారు. శారీరక ఉష్ణోగ్రత అలాగే ఉన్నా మనసుకి ఊరట కలిగితే జ్వరానికి యిచ్చిన మందు పనిచేసినట్లే అంటారు.
దీని గురించి మరీ విస్తారంగా చెప్పనవసరం లేదు. ఆందోళన పెరిగితే, టెన్షన్ పెరిగితే బిపి, సుగర్, కడుపులో అల్సర్, సోరియాసిస్, ఎగ్జిమా వంటి చర్మవ్యాధులు పెరుగుతాయని మనందరికీ తెలుసు. కోపం కలిగితే శరీరంలో జరిగే పరిణామాలు అందరికీ అనుభవమే. డాక్టరు దగ్గరకి వెళ్లినా టెన్షన్ తగ్గించుకోండి, డిప్రెషన్ ఫీలవకండి, యోగా చేయండి, మెడిటేషన్ చేయండి అంటారు. మందు వాడితే సరిపోదు, మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి అంటున్నారు.
శారీరక రుగ్మతల విషయంలో అది ఎందుకు వచ్చిందో లాబ్‌కి వెళ్లి రక్తపరీక్షలు వగైరాలు చేయించుకుని మూలమేమిటో తెలుసుకుంటున్నాం కాబట్టి ఆ దిశగా మందు వేసుకుంటున్నాం, ఆ రోగాన్ని పెంచే ఆహారాన్ని వర్జిస్తున్నాం. మరి మానసిక రుగ్మతల విషయంలో అదే రకమైన రుగ్మతో, దానికి మూలకారణమేమిటో తెలుసుకోకుండా చికిత్స ఎలా చేయించుకుంటాం? చికిత్స అంటే మందులనే కాదు, మానసికంగా మన దృక్పథం మార్చుకోవడం.
లాక్‌డౌన్ కారణంగా మనం పనిచేసే కంపెనీకి వ్యాపారం జరగక ఉద్యోగం తీసేస్తాడనే భయంతో మనకు బిపి, సుగర్, అల్సర్, హార్ట్‌బీట్ పెరిగాయనుకోండి. సుగర్ ఎక్కువైంది కదాని మందు డోసు పెంచుకుంటూ పోతే లాభం లేదు. ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే, ఎవరితోనైనా చర్చిస్తే అప్పుడు తడుతుంది - పైకి బింకంగా కనిపిస్తున్నా, మనం హిట్‌లిస్ట్‌లో ఉన్నాం, ఉద్యోగం పోతోందని భయపడుతున్నాం అని. మన జబ్బుకి కారణం ఉద్యోగభయం అని నిర్ధారిస్తే అప్పుడు దాన్ని ఎలా ఎదుర్కొనాలో ప్లాన్ చేస్తాం. కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి ఎంతకాలం పడుతుంది, మధ్యలో ఏ ఖఱ్చు తగ్గించుకోగలం? ఏదైనా స్థలం అమ్మితే ఫర్వాలేదా? యిలాటి ప్లాన్లు వేసుకుంటే కాస్త నిశ్చింత వస్తుంది. కానీ ఉద్యోగభయం కారణంగా బిపి పెరిగింది, హార్ట్‌బీట్ పెరిగింది అని చెప్పేవారెవరు?
మనలో చాలామందికి ఓ పట్టాన నిద్ర పట్టదు. నిద్రమాత్రలు వేసుకోవడం సరైన పద్ధతి కాదు. ఎందుకు నిద్ర పట్టలేదో విశ్లేషించుకుని, ఆ దిశగా పరిష్కారమార్గం ఆలోచించాలి. ఆ విశ్లేషణ మనకు మనమే చేసుకోలేక పోతాం. అందుకే సైకియాట్రిస్టు వద్దకు వెళతాం. అతను వృత్తిరీత్యా వైద్యుడు కావచ్చు, మన మావయ్య కావచ్చు, బాబయ్య కావచ్చు, బాబా కావచ్చు, గురూజీ కావచ్చు, సీనియర్ కొలీగ్ కావచ్చు, స్నేహితుడూ కావచ్చు. మన దేశంలో కుటుంబవ్యవస్థ యింకా సజీవంగానే ఉంది కాబట్టి పెద్దల దగ్గర చెప్పుకుని ఊరట పొందుతాం.
పాశ్చాత్య దేశాల్లో ఎవరికి వారే కాబట్టి వాళ్లు సైకియాట్రిస్టుల వద్దకే వెళతారు. అతను ఓ కౌచ్ మీద పడుక్కోబెట్టి, నీ బాధలు చెప్పుకో అంటాడు. అలా చెప్తూంటే మధ్యమధ్యలో ఆ వాక్ప్రవాహం దారి తప్పకుండా చూస్తూంటాడు. రోగి మనసులో ఉన్నదంతా కక్కేసిన తర్వాత అతనితో కూర్చుని చర్చిస్తాడు. సైకో ఎనాలిసిస్ చేసి ఇలా ఆలోచిస్తున్నావా, యిది సరైనదే కాదో నువ్వే చూసుకో అంటూ సజెషన్స్ యిస్తాడు. ఇలా కొన్ని సెషన్స్ జరిగేసరికి అనేక సందర్భాల్లో పరిష్కారం రోగి మెదడులోంచే బయటకు వస్తుంది.
ఈ విధానం వలన ఎందరో రోగులకు మేలు కలిగింది కాబట్టి గత శతాబ్దంగా సైకియాట్రిస్టులు యిబ్బడిముబ్బడిగా పెరుగుతూ వచ్చారు. మన పట్టణాల్లో కూడా సైకియాట్రిస్టులకు మంచి ప్రాక్టీసు ఉంటోంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అవగాహన లోపించి, కొట్లాటలు తీవ్రమైనపుడు సైకియాట్రిస్టును చూడలేక పోయారా? అంటున్నారు. ఈ సైకో థెరపీకి ఫ్రాయిడ్ వేసిన పునాది ఎంతో బలమైనది. అప్పటివరకు దృష్టి సారించని అనేక విషయాలపై అతను పరిశోధనలు చేసి కొన్ని ప్రతిపాదనలు చేశాడు.
మానవస్వభావాల వెనుక మర్మాన్ని కనుగొనడానికి విశేషకృషి చేసిన వారిలో సిగ్మండ్ ఫ్రాయిడ్ పేరు ప్రముఖంగా వినబడుతుంది. సైకోఎనాలిసిస్ (మానసిక విశ్లేషణ)ను ఒక ప్రత్యేకవిభాగంగా చూడడం ఆయనతోనే ప్రారంభమైందంటారు. ఆయన గురించి, ఆయన సిద్ధాంతాల గురించి తెలుసుకుంటే మనుషులను చదవడం సులభమౌతుందని అనుకోవచ్చు. కాలం గడుస్తున్నకొద్దీ ఆయన సిద్ధాంతాలకు సవరణలు ప్రతిపాదిస్తూ వచ్చారు యితర మనోశాస్త్రవేత్తలు. కానీ మౌలిక ప్రతిపాదనలు చేసిన ఘనత ఆయనదే. వాటిని తెలుసుకోనిదే, అదంతా ట్రాష్ అని కొట్టిపారేయలేము. వచ్చే వ్యాసంలో ఆయన గురించి పరిచయం చేస్తాను.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2020)
[email protected]