యావత్ ప్రపంచాన్ని విధ్వంసం చేసేందుకు కంకణం కట్టుకున్న కరోనా వైరస్‌తో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు పోటీ పడుతున్నారు. ఇందుకు ఆయన వ్యవహార శైలే నిదర్శనం. అధికారంలో ఉంటే ఒకలా, ప్రతిపక్షంలో మరోలా వ్యవహరించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఎక్కడికక్కడ విధ్వంసం చేసిన బాబుకు….ప్రస్తుతం కరోనా విపత్కర కాలంలో ఎందుకో ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చింది.
కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో వరి, ఆక్వా రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయారని, ఆదుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు చంద్రబాబు లేఖ రాశారు. ఈ లేఖలో జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు. అలాగే రైతుల్ని పట్టించుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని గవర్నర్‌ను బాబు కోరారు.
బాబు రాసిన ఈ లేఖ విషయం తెలిసి కరోనా వైరస్ కూడా నవ్వుకుంటోందట. తనకు కూడా ప్రపంచంలో పోటీ వచ్చే ఒకే ఒక్క మనిషి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాడని తెలుసుకుని…తన మనుగడకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందోననే ఆందోళనకు గురి అవుతోందని సమాచారం.
2014 రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పాలన పగ్గాలు చంద్రబాబు చేతిలోకి వచ్చాయి. బాబు తన ఐదేళ్ల పాలనలో రూ.2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి…తనతో పాటు తన పార్టీలోని పారిశ్రామికవేత్తలు, పార్టీ నాయకుల సొంత ఆస్తులు పెంచాడే తప్ప…రాష్ట్ర ప్రగతికి తోడ్పడింది శూన్యమే.
ఇప్పుడు రైతుల గురించి రంకెలేస్తున్న బాబు…2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో రైతాంగం మొత్తం రుణాలు మాఫీ చేస్తానని ఇచ్చిన హామీ నెరవేర్చారా? ఎన్నికలకు ముందు రైతుల రుణాలు రూ.1.25 లక్షల కోట్లు ఉంటే…ఆ రుణాన్ని అనేక షరతులు పెట్టి రూ.24 వేల కోట్లకు కుదించిన మాట వాస్తవం కాదా? ఈ రుణాన్ని అయినా పూర్తిగా మాఫీ చేశారా అంటే…అదీ చేయలేదు. ఇందులో రూ.13 వేలు కోట్లు చెల్లించి, మిగిలిన రూ.11 వేల కోట్లకు ఎగనామం పెట్టిన విషయాన్ని బాబు మరిచారా?
అలాగే డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ, నిరుద్యోగ భృతి ఇస్తానని ఇచ్చిన హామీలు ఎంత మాత్రం నెరవేర్చారో డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులను అడిగితే బాగా చెబుతారు. అలాగే కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రతి కుటుంబానికి రూ.5 వేలు, రూ.10 వేలు చొప్పుల చెల్లించాలని డిమాండ్ చేస్తూ, తానో పేదల పక్షపాతి అని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న బాబు అమానవీయ పాలన గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు.
కిలో రూ.2 బియ్యాన్ని బాబు పాలనలో రూ.5.50కి పెంచడంతో పాటు, అప్పటి వరకు ప్రతి కుటుంబానికి 25 కిలోలు ఇస్తుండేదాన్ని 20 కిలోలకు తగ్గించడం వాస్తవం కాదా? ఇవన్నీ పేదల సంక్షేమాన్ని కాంక్షించి చేసినవేనా? ఇదే దివంగత వైఎస్సార్ తన పాలనలో రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా, రుణమాఫీ చేయడం వాస్తవం కాదా?
బాబు తన 14 ఏళ్ల పాలనలో ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకం లేదా సొంత ముద్ర కలిగిన పని చేశారేమో చెప్పాలి. ఇదే వైఎస్సార్ పాలన తీసుకుంటే పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు.
ఇప్పుడు తగదునమ్మానంటూ గవర్నర్‌కు రాసిన లేఖలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరిన చంద్రబాబు….తన ఐదేళ్ల పాలనలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవడంతో పాటు నలుగురికి మంత్రి పదవులను కూడా కట్టబెట్టిన విషయాన్ని ప్రజలు మరిచిపోలేదు. ఏపీకీ కరోనా వైరస్‌లా తయారై బాబును గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు ఎంతో చైతన్యంతో తరిమికొట్టారు.
చావు దెబ్బ తీసినా…ఇప్పటికీ చేసిన తప్పు సరిదిద్దుకోకపోగా, అవే తప్పులను ప్రతిపక్షంలో కూడా చేయడం బాబుకే చెల్లు. తాజాగా కరోనా వైరస్‌ను తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్ పాటిస్తున్నారు. మరి ఈ రాజకీయ వైరస్‌ను సాగనంపేందుకు ఏం చేయాలో ప్రజలు మరోసారి విజ్ఞత ప్రదర్శించాల్సి ఉంది.