కరోనా ‘లాక్‌ డౌన్‌’.. పొడిగించాల్సిందేగానీ.!

కరోనా వైరస్‌ (కోవిడ్‌-19)కి వ్యాక్సిన్‌ లేదు. కరోనా వైరస్‌ సోకిన వ్యక్తులకు వైద్యం చేసే క్రమంలో రకరకాల మందుల్ని వినియోగిస్తున్నా, ఈ వైరస్‌కి ఇదీ ఖచ్చితమైన మందు.. అని చెప్పే పరిస్థితి లేదు. మరోపక్క,…

కరోనా వైరస్‌ (కోవిడ్‌-19)కి వ్యాక్సిన్‌ లేదు. కరోనా వైరస్‌ సోకిన వ్యక్తులకు వైద్యం చేసే క్రమంలో రకరకాల మందుల్ని వినియోగిస్తున్నా, ఈ వైరస్‌కి ఇదీ ఖచ్చితమైన మందు.. అని చెప్పే పరిస్థితి లేదు. మరోపక్క, ప్రపంచమంతా దాదాపుగా కరోనా వైరస్‌ బారిన పడింది. వైరస్‌ పుట్టిన చైనాలో మాత్రం వ్యాధి తీవ్రత గణనీయంగా తగ్గిపోయింది. ఇప్పుడు అక్కడ కరోనా మరణాల సంఖ్య జీరో. కరోనా పాజిటివ్‌ కేసులు కూడా చాలా వేగంగా తగ్గిపోతున్నాయి. కొత్త కేసులూ చాలా తక్కువగా నమోదవుతున్నాయి.

అగ్రరాజ్యం అమెరికా కూడా కరోనా వైరస్‌ దెబ్బకి విలవిల్లాడుతోంది. అలాంటిది, 130 కోట్ల మంది ప్రజలున్న భారతదేశంలో కరోనా వైరస్‌ని కట్టడి చేయడం సాధ్యమా.? అయినాగానీ, ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్‌ అదుపులోనే వుంది. దానిక్కారణం ‘లాక్‌ డౌన్‌’. ‘నిజాముద్దీన్‌ మర్కజ్‌’ ఎఫెక్ట్‌ లేకపోయి వుంటే, కరోనా వైరస్‌ కేసులు ఇప్పుడున్న కేసులతో పోల్చితే సగం కంటే తక్కువ వుండేవేమో.!

కారణమేదైతేనేం, భారతదేశంలోనూ అనూహ్యంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరిగాయి.. పెరుగుతూనే వున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ‘లాక్‌ డౌన్‌’ ఎత్తివేయాలన్న ఆలోచన కేంద్రం చేస్తుందా.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. నిజానికి, ‘లాక్‌ డౌన్‌’ పొడిగించే ఆలోచన ఏమీ లేదని కొద్ది రోజుల క్రితమే కేంద్రం ప్రకటించింది. అయితే, రాష్ట్రాలు మాత్రం, లాక్‌డౌన్‌ని పొడిగించాలని కోరుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి ఈ మేరకు ఇప్పటికే ఓ ప్రకటన చేశారు కూడా. మిగతా రాష్ట్రాలదీ దాదాపు అదే పరిస్థితి.

ప్రభుత్వాలకు ఆదాయం పడిపోతున్నా, ఇంకో దారి లేదు. ఎందుకంటే, కరోనా వైరస్‌కి మందు లేదు గనుక. పదుల సంఖ్యలో వందల సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులుంటేనే పరిస్థితి ఇంత దారుణంగా వుంది. వందలు దాటి వేలకు వెళ్ళిందిప్పుడు లిస్ట్‌. ఇది లక్షలకు చేరితే.. భారతదేశం తట్టుకునే పరిస్థితే లేదు. అందుకే, లాక్‌డౌన్‌ని కొనసాగించాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. అయితే, లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజల మాటేమిటి.?

ఇబ్బందులంటే ‘ఎంటర్‌టైన్‌మెంట్‌’ లేకపోవడం కాదు.. నిరుద్యోగం పెరిగిపోతే.. ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతే.. ఆ తర్వాత ఆకలి చావులు ఎక్కువైపోతాయ్‌. సో, ఆ దిశగా కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు ఓ ఖచ్చితమైన ప్రణాళికతో ముందడుగు వేయాల్సి వుంది.

ఈ లాక్ డౌన్ పెంచమని మోదీగారిని కోరతాను