లాక్ డౌన్ పై రాష్ట్రాల భిన్నాభిప్రాయాలు!

ఏప్రిల్ 14 త‌ర్వాత లాక్ డౌన్ ను కొన‌సాగించాలా? ఎత్తేయాలా? అనే అంశంపై రాష్ట్రాల వారీగా భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్ప‌టికే ఈ విష‌యంలో వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు స్పందిస్తూ ఉన్నారు. ముందుగా తెలంగాణ…

ఏప్రిల్ 14 త‌ర్వాత లాక్ డౌన్ ను కొన‌సాగించాలా? ఎత్తేయాలా? అనే అంశంపై రాష్ట్రాల వారీగా భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్ప‌టికే ఈ విష‌యంలో వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు స్పందిస్తూ ఉన్నారు. ముందుగా తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. క‌రోనాను ఎదుర్కొన‌డానికి లాక్ డౌన్ త‌ప్ప మ‌రో మార్గం లేద‌ని తేల్చి చెప్పారు. త‌న‌ను అడిగితే లాక్ డౌన్ ఏప్రిల్ 14 త‌ర్వాత కూడా రెండు వారాల పాటు పొడిగించాల‌ని ప్ర‌ధానిని కోర‌తానంటూ ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఒక‌వేళ లాక్ డౌన్ ను కేంద్రం మిన‌హాయించినా, తెలంగాణ ప్ర‌భుత్వం మాత్రం కొన‌సాగిస్తుంద‌న్న‌ట్టుగా ఆయ‌న ఇన్ డైరెక్టుగా స్ప‌ష్టత ఇచ్చారు.

ఇక లాక్ డౌన్ ను కొన‌సాగించ‌డం విష‌యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్, మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రులు కూడా కేసీఆర్ త‌ర‌హా అభిప్రాయాన్నే వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. త‌మ త‌మ రాష్ట్రాల్లో ప‌రిస్థితి ఏమిటో ఎరిగిన వాళ్లు లాక్ డౌన్ ను కొన‌సాగించాల‌నే అభిప్రాయాన్నే వ్య‌క్తం చేస్తున్న‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఏప్రిల్ నెలాఖ‌రు వ‌ర‌కూ లాక్ డౌన్ ను పొడిగించి, క‌రోనాను పూర్తిగా నియంత్రించాలని వారు భావిస్తున్నట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇక క‌రోనా ప్ర‌భావం త‌క్కువ‌గా ఉన్న రాష్ట్రాలు కూడా కొన్ని ఉన్నాయి. ప్ర‌త్యేకించి ఈశాన్య రాష్ట్రాలు.. అక్క‌డ క‌రోనా ప్ర‌భావం పెద్ద‌గా లేదు. ఆ రాష్ట్రాల్లో ఒక‌టీ రెండు కేసులు రిజిస్ట‌ర్ అయిన దాఖ‌లాలు క‌నిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మేఘాల‌య ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ… లాక్ డౌన్ ను స‌డ‌లించాల‌న్న‌ట్టుగా స్పందించార‌ట‌. జ‌నాలు బాగా గుమికూడ‌తార‌నే ప్ర‌దేశాల‌ను నిరోధిస్తూనే.. సామాన్యులు, రోజువారీ కూలీలు ప‌నులు చేసుకోవ‌డానికి త‌గిన‌ట్టుగా లాక్ డౌన్ ను స‌డ‌లించాల‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డార‌ట‌. 

అయితే లాక్ డౌన్ విష‌యంలో పూర్తి అంచ‌నాకు రావ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం కూడా మ‌రి కాస్త స‌మ‌యం తీసుకోవ‌చ్చు. రాబోయే రెండు మూడు రోజుల ప‌రిస్థితిని అంచ‌నా వేసుకుని… లాక్ డౌన్ ను పాక్షికంగా మిన‌హాయించ‌డ‌మా, మ‌రో రెండు వారాల కొన‌సాగింపా? అనే విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఒక అభిప్రాయానికి రావొచ్చునేమో!