డబ్బులు ఏవో చెట్టుకు కాసినట్లు, ఆ చెట్లను ఏకంగా బీజేపీ ప్రభుత్వమే పెంచి పోషిస్తున్నట్లుగా కమలనాధులు గొప్ప కలరింగ్ ఇస్తున్నారు. నిజానికి అపుడెపుడో అన్న ఎన్టీయార్ గారు కేంద్రం మిధ్య అన్నారు. రాష్ట్రాలు వాస్తవం. అన్ని రాష్ట్రాలు కలిస్తేనే కేంద్రం అన్నది సమాఖ్య స్పూర్తి భావన.
మరి ఇవేమీ ఇపుడు కమలనాధులకు అసలు గుర్తుండడంలేదు. ఎందుకంటే వారు ఆరేళ్ళుగా కేంద్రంలో జెండా పాతేశారు కాబట్టి. ఇదిలా ఉంటే తమ డబ్బులతో వైసీపీ సర్కార్ సోకు చేస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ తన రాజకీయ పాండిత్యాన్ని చూపిస్తున్నారు. తాము అక్కరకు డబ్బులు ఇస్తూంటే దాంతో వైసీపీ పాలకులు రాజకీయం చేస్తున్నారంటూ ఆడిపోసుకుంటున్నారు.
విషయమేంటంటే కేంద్రం ఇచ్చిన డబ్బులు అంటూ వేరేగా ఉండవు. అవి ఇవ్వాల్సిన చోట రాష్ట్రాలకు హక్కులుగా వచ్చి దఖలు పడేవే. పైగా ముందే చెప్పుకున్నట్లుగా కేంద్రమేమీ డబ్బుల పంట పండించడంలేదు. ప్రతీ పైసా దేశంలోని పౌరులు కడుతున్న పన్నుల నుంచే కేంద్రం ఖజానా నింపుకుంటోంది. అలాటపుడు రాష్ట్రాలకు కేంద్రం డబ్బులు ఇవ్వడం అంటే అదేదో తాము దాచుకున్న సొంత సొమ్ము దానం చేస్తున్నట్లుగా కాషాయం పార్టీ వారు తెగ ఫీల్ అవడమే పెద్ద వింత.
వీటినే చిల్లర రాజకీయాలు అల్లరి రాజకీయాలు అని కూడా అంటారు. ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ఇక ఏపీ విషయం తీసుకుంటే అనుకోని విభజనతో అరేళ్ళుగా అష్ట కష్టాలు పడుతోంది. ఇంత జరిగినా న్యాయంగా ఇవ్వాల్సిన నిధులు ఇప్పటికీ పెండింగులోనే పెట్టారు ఢిల్లీ ప్రభువులు. మరి అర కొర నిధులు ఇస్తే అవేవో తమ సొంత నిధులని, తామే వాటికి పెత్తందార్లు అని కమలం పార్టీ పెద్దలు చెప్పుకోవడమే వింతలోకెల్లా అసలైన వింత.