ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. సోమవారం సాయంత్రం ఆరు గంటల నుంచి మంగళవారం ఉదయం తొమ్మిది మధ్యన జరిపిన పరీక్షల్లో కేవలం ఒక్క కేసు మాత్రమే పాజిటివ్ గా తేలింది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటన చేసింది. సోమవారం సాయంత్రానికి ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 303 కాగా, కొత్తగా తేలిన ఒక కేసుతో కలిపి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 304కు చేరింది.
ఇప్పటి వరకూ ఏపీలో తేలిన కరోనా పాజిటివ్ కేసుల్లో 90 శాతానికి పైగా ఢిల్లీ తబ్లిగీ మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారిలోనూ, వారి కుటుంబ సభ్యుల్లో గుర్తించినవే. మిగిలిన కేసులు విదేశాలకు వెళ్లి వచ్చిన వారివి. వీరి శాతం ఏడెనిమిది వరకూ ఉంది. విదేశాలకు వెళ్లి వచ్చిన వారి నుంచి వారి సన్నిహితులకు-కుటుంబ సభ్యులకు అంటిన కేసులు స్వల్పంగా ఉన్నాయి. అలా మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారి కుటుంబ సభ్యుల్లోనూ కొందరికి పాజిటివ్ కేసులు తేలాయి.
మర్కజ్ వెళ్లి వచ్చిన వారిలో దాదాపు 1000 మందికి ఏపీ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించింది. వారిలో దాదాపు 197 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. అలా పాజిటివ్ గా తేలిన వారి కుటుంబ సభ్యులకూ మరో వైపు పరీక్షలు జరిగాయి. అలాంటి వారిలో దాదాపు 300 మందికి పరీక్షలు చేయగా.. ఏకంగా 80 మందికి కరోనా పాజిటివ్ తేలింది. ఇలా మర్కజ్ రిలేటెడ్ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 280 వరకూ ఉంది. మిగతా కేసులు విదేశాల నుంచి వచ్చి, కరోనా పాజిటివ్ గా తేలిన వారు, వారి కుటుంబ సభ్యుల్లో పాజిటివ్ గా తేలిన వారు.
ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారికి- వారి కుటుంబ సభ్యులకూ దాదాపుగా పరీక్షలు పూర్తి అవుతున్నట్టే. ఇలాంటి నేపథ్యంలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగా గత కొన్ని గంటల రిజల్ట్స్ లో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది. ఇకపై కూడా అనుమానిత కేసుల్లో పాజిటివ్ సంఖ్య క్రమంగా తగ్గితే.. కరోనా వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఏపీలో లేనట్టే అవుతుంది. ప్రజలకు కాస్త భయాందోళనలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.