అచ్చెన్న ఫోకస్ అయితే….?

తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ కాదు అని ఈ మధ్యనే కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పేసింది. అది తెలుగు రాష్ట్రాలలో ఉన్న టీఆర్ఎస్, వైసీపీ, మజ్లీస్ వంటి ప్రాంతీయ పార్టీ మాత్రమే అని…

తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ కాదు అని ఈ మధ్యనే కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పేసింది. అది తెలుగు రాష్ట్రాలలో ఉన్న టీఆర్ఎస్, వైసీపీ, మజ్లీస్ వంటి ప్రాంతీయ పార్టీ మాత్రమే అని సుస్పష్టం చేసింది.

దాంతో చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు ఎలా అవుతాడు అన్న సందేహం వెంటనే వస్తుంది. ఇక ఆయన కూడా ఉన్న తెలంగాణాను వదిలేసి ఏపీలోనే తెగ తిరుగుతున్నారు. వాస్తవం చెప్పాలీ అంటే ఏపీలోనే టీడీపీకి ఉనికి ఉంది. ఈ నేపధ్యంలో ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కింజరాపు అచ్చెన్నాయుడా లేక చంద్రబాబు నాయుడా అన్న డౌట్ కచ్చితంగా అందరికీ వస్తోంది.

ఇక అచ్చెన్నాయుడు అయితే ప్రెసిడెంట్ గా ఉన్నా కూడా బాబు ఏపీలో వరస టూర్లు వేస్తూండడంతో తన సొంత జిల్లా దాటి బయటకు రాలేని పరిస్థితి ఉందని అంటున్నారు. అలాంటి అచ్చెన్నాయుడు ఏపీలో బీసీల బస్సు యాత్రను చేపడతారు అని ప్రచారం అయితే సాగుతోంది.

అచ్చెన్నాయుడు బీసీ నేత కాబట్టే ఆ కార్డుని వాడుకోవాలని ఆయనకు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. అయితే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల వేళ పార్టీ లేదు బొక్కా లేదు అని అచ్చెన్న అన్నట్లుగా ప్రచారంలోకి  వచ్చిన వీడియో ప్రభావమో మరేమో తెలియదు కానీ అచ్చెన్నను నాటి నుంచే సైడ్ చేశారు అన్న విమర్శలూ వచ్చాయి.

ఇలాంటి నేపధ్యంలో అచ్చెన్నాయుడు చేత బీసీల యాత్ర పేరిట చేయించడానికి టీడీపీ సిద్ధపడుతోంది అన్న వార్తలు ఇపుడు వస్తున్నాయి. అదే నిజమైతే మాత్రం అచ్చెన్న టీడీపీలో లోకేష్ కంటే కూడా బాగా ఫోకస్ అవుతారు. బాబుతో సరిసమానంగా ఆయన కూడా కలియతిరుగుతారు.

మరి టీడీపీ అంటే పెదబాబు చినబాబు అన్నట్లుగా ఉన్న పరిస్థితి నుంచి బీసీ నేత  అచ్చెన్నను ఫోకస్ చేసి మరో సూపర్ పవర్ లీడర్ షిప్ కి తామే తెర తీస్తారా అన్నదే చూడాలి. అచ్చెన్నాయుడుని కనుక జనంలోకి పంపితే తన పెద్ద నోరుతో తనదైన దూకుడుతో కచ్చితంగా ఏపీ పాలిటికల్ తెర మీద ఎంతో కొంత ఫోకస్ అయితే తన మీద ఉండేలా చూసుకుంటారు.

వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అచ్చెన్నను వదిలితే ఆ బీసీ కార్డుతో రేపటి రోజున ఆయన కూడా సీఎం పదవికి పోటీ పడే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పకతప్పదు. అచ్చెన్న బస్సు యాత్ర ప్రచారంలో ఉన్నా కూడా అది కనుక నిజమైతే మాత్రం టీడీపీలో బీసీ నేతల‌కు మంచి రోజులు వచ్చినట్లే లెక్క.