కేసీఆర్ కు కొత్త సవాల్?

ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇప్పుడు కొత్త సవాల్ ఎదురవుతోందనే టాక్  తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తోంది. అదే మునుగోడు ఉప ఎన్నిక. అది జరుగుతుందో జరగదు ఇప్పుడిప్పుడే చెప్పలేంగానీ రాష్ట్రంలో మాత్రం దాని మీద చర్చ…

ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇప్పుడు కొత్త సవాల్ ఎదురవుతోందనే టాక్  తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తోంది. అదే మునుగోడు ఉప ఎన్నిక. అది జరుగుతుందో జరగదు ఇప్పుడిప్పుడే చెప్పలేంగానీ రాష్ట్రంలో మాత్రం దాని మీద చర్చ జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ నాయకులు కోమటి రెడ్డి బ్రదర్స్ ఎంత కీలకమైన నాయకుల్లో తెలిసిందే కదా. వీరిలో ఒకరైన మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ నుంచి బయటకు వ‌స్తాడని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. 

ఆయన కూడా పార్టీ నుంచి వెళ్ళిపోతాననే అర్ధం వచ్చేలా పరోక్షంగా అనేకసార్లు మాట్లాడాడు. తొందరలో అది నిజమయ్యేలా కనబడుతోంది. ఆయన కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరతాడని ఆనుతున్నారు. ఒకవేళ అదే జరిగితే మునుగోడుకు ఉపఎన్నిక వస్తుంది. గతంలో దుబ్బాకను, జహీరాబాద్ ను చేజిక్కించుకున్న బీజేపీ మునుగోడును కూడా కైవసం చేసుకొని కేసీఆర్ కు చుక్కలు చూపించాలనుకుంటోంది. 

ఈ ఉప ఎన్నికలోనూ గెలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో జెండా ఎగరేయొచ్చని భావిస్తోంది. చాలా రోజులుగా కాంగ్రెస్ వీడి బీజేపీ లో చేరుతారంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి పైన ప్రచారం సాగుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ తో కోమటిరెడ్డి సోదరులకు విభేదాలున్నాయి. ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ అధినాయకత్వంతో ఉన్న సంబంధాలతో తనకు తానుగా పార్టీలో బలం పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. 

ఇక, రాజగోపాల్ రెడ్డి చాలా రోజులుగా బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా, ఆయన కాషాయం కండువా కప్పుకొనే ముహూర్తం దాదాపుగా ఖరారైంది. ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో రాజగోపాల్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ విషయాన్ని ఆయన నిర్ధారించారు. ఆ సమయంలోనే అమిత్ షా వచ్చే నెల మొదటి వారంలో వరంగల్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

రాజగోపాల్ రెడ్డి తన పార్టీ మార్పు పైన కేసీఆర్ ను ఓడించే పార్టీలోకే వెళ్తామని చెబుతూ వచ్చారు. అందులో భాగంగానే త్వరలోనే రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. దీని ద్వారా త్వరలోనే మునుగోడు అసెంబ్లీకి ఉప ఎన్నిక తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని.. మునుగోడుకు ఉప ఎన్నిక రాబోతుందనే ప్రచారం సాగుతోంది. 

బీజేపీ కూడా తెలంగాణలో మరో ఉపఎన్నికకు ప్లాన్ చేస్తోందని, అందుకే కోమటిరెడ్డిని పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయించబోతున్నారని తెలుస్తోంది. కోమటిరెడ్డి జంపింగ్ వార్తతో నల్గొండ జిల్లా రాజకీయాల్లో వేడి పెరిగింది. అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. అధికార టీఆర్ఎస్ వేగంగా పావులు కదుపుతోంది. సీఎం కేసీఆర్ మునుగోడు లీడర్లను ప్రగతి భవన్ కు పిలిపించుకుని సమావేశమయ్యారు.

హుజురాబాద్ ఉప ఎన్నికలో ఓటమి అధికార పార్టీకి తీరని నష్టం కలిగించింది. ఆ ఫలితం తర్వాత చాలా మంది నేతలు పార్టీని వీడారు. మునుగోడు ఉపఎన్నికలో అలాంటి సీన్ రిపీటైతే మరో ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం పడుతుందనే యోచనలో ఉన్న కేసీఆర్… అప్పుడే రంగంలోకి దిగారని చెబుతున్నారు. జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు జిల్లాకు చెందిన సీనియర్ నేతలతో కలిసి మునుగోడు నియోజకవర్గ నేతలతో కేసీఆర్ చర్చలు జరిపారని తెలుస్తోంది. 

మునుగోడు విషయంలో కేసీఆర్ దూకుడుతో రకరకాల చర్చలు సాగుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే జరగబోయే ఉప ఎన్నికకు తాము సిద్ధంగా ఉన్నామనే సంకేతం జనాలకు గులాబీ పార్టీ ఇస్తుందనే చర్చ సాగుతోంది. ఈవిధంగా ప్రతిపక్షాల కంటే తాము ముందున్నామనే మెసేజ్ జనంలోకి పంపిస్తోంది.  

అదే సమయంలో మరో చర్చ కూడా వస్తోంది. ఆరు నెలల క్రితం జరిగిన పార్టీ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో తాను గజ్వేల్ నుంచి పోటీ చేయడం లేదనే సంకేతం ఇచ్చిన కేసీఆర్.. నల్గొండ జిల్లా నుంచే పోటీ చేస్తానని మాట్లాడారు. అది కూడా మునుగోడు నుంచి తాను పోటీ చేస్తానని కేసీఆర్ చెప్పారని నల్గొండ జిల్లా నేతలు తెలిపారు. కేసీఆర్ పోటీ చేయాలని మునుగోడు నియోజకవర్గ నేతలు తీర్మానాలు కూడా చేశారు. 

కేసీఆర్ పోటీ చేస్తే మునుగోడుతో పాటు నల్గొండ జిల్లా దశ మారుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో మునుగోడు నేతలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం కావడంతో.. ఆయన అక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారా అన్న చర్చ సాగుతోంది. సీఎం కేసీఆర్ మునుగోడు నుంచి పోటీ చేయాలని భావించినా.. అది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనే.

కాని కోమటిరెడ్డి రాజీనామా చేస్తే వచ్చేది ఉప ఎన్నిక. దీంతో త్వరలోనే జరగబోయే ఉప ఎన్నికలో ఎవరిని పోటీ చేయించాలని కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని అంటున్నారు. ఇక్కడ మరో అంశం ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే ఆరు నెలల లోపు ఉప ఎన్నిక జరపాల్సి ఉంటుంది. అంటే ఈ ఏడాది చివరలో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జరుగుతుంది. 

కొన్ని రోజులుగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం ఉంది. 2018 తరహాలోనే కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు వెళతారని విపక్ష నేతలు చెబుతున్నారు. దీంతో కోమటిరెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా… కేసీఆర్ ముందస్తుకు వెళితే ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉండదు. అంటే మునుగోడులో ఉప ఎన్నిక రాకుండా కేసీఆర్ ప్లాన్ చేస్తారా?