దేశ రాజకీయాల్లో పెద్దపులిగా పేరున్న నాయకుడు బాల్ థాకరే. ఆ పెద్దపులి ఇప్పుడు కిడ్నాప్ కాబోతోంది. బాల్ థాకరే.. మరొకరి పరం కానున్నారు. బలమైన చీలికవర్గాలు ఏర్పడిన చాలా సందర్భాల్లో.. అవశేష ప్రాంతీయ పార్టీలు క్రమంగా అంతరించిపోయిన ఘట్టాలు మన భారత రాజకీయ వ్యవస్థలో చాలానే కనిపిస్తాయి.
ఆ వరుసలో ఇప్పుడు మరొక పెద్ద పార్టీ చేరబోతోంది. శివసేన- హిందూత్వ ఎజెండాతో వ్యవహరించే పార్టీ. కావడానికి మహారాష్ట్ర రాజకీయాలకు పరిమితం అయిన ప్రాంతీయ పార్టీ అయినా.. దేశ రాజకీయాలను సమస్తంగా నిర్దేశించిన పార్టీ.. ఇప్పుడు రకరకాల కుదుపులకు గురవుతోంది. మన దేశంలో ప్రాంతీయ పార్టీలకు రక్తసంబంధమే, వారసత్వపు హక్కుగా పరిగణనలో ఉన్న రాజకీయాల్లో.. ఇప్పుడు కొత్త శకం మొదలు అవుతుంది. వారసత్వపు రాజకీయాధికార వైభోగం త్వరలోనే కనుమరుగు అయినా ఆశ్చర్యం లేదు.
‘శివసేన’ పార్టీపై అసలు పెత్తనం తమకే ఉండాలంటూ.. చీలికవర్గం నేత ఏక్ నాధ్ శిందే, ఉద్ధవ్ థాక్రే వర్గాలు ఈసీని ఆశ్రయించాయి. రెండు వర్గాలూ కూడా తమ మెజారిటీ నిరూపించుకోవాలంటూ.. ఈసీ ఆదేశించింది. బాల్ థాకరే విప్లవాత్మకమైన, దూకుడుగల, ఆవేశపూరితమైన ఆలోచనల్లోంచి పుట్టిన పార్టీ.. ఇప్పుడు కేవలం సంఖ్యాబలం ఆధారంగా ఎవరో ఒకరి ఆధీనం కాబోతోంది.
మహారాష్ట్ర మొత్తంగా బలమైన, క్షేత్రస్థాయి బలాన్ని కలిగిఉన్న ఈ పార్టీ ఇప్పుడు కేవలం.. కొందరు వ్యక్తులు ఎలా వ్యవహరిస్తారు అనేదానిని బట్టి.. ఎవరో ఒకరి పరం కానుంది. శిందే కు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. 12 మంది ఎంపీలు కూడా ఆయన పక్షాన ఉన్నారు. కేవలం ఈ 52 మందిని మానిప్యులేట్ చేయగలిగినా కూడా చాలు. శివసేన అనేది శిందే పరం అవుతుంది. ఇదంతా సహేతుకమైన రాజకీయమేనా అనే చర్చకు ఇప్పుడు తావులేదు. కానీ.. పెద్దపులి కుమారుడు- ఉద్ధవ్ థాకరే అసమర్థత వలన ఈ పరిస్థితి దాపురిస్తున్నదా అనే సందేహం కలుగుతోంది.
కేవలం ఎన్నికైన ప్రజాప్రతినిధుల సంఖ్యాబలమే ప్రాతిపదికగా పార్టీల ఆధిపత్యం, ఆజమాయిషీ, యాజమాన్యం చేతులు మారిపోవడం అనేది కొత్త సంగతి కాదు. మన తెలుగునాట జరిగింది కూడా అదే కదా. అప్పట్లో ఎన్టీ రామారావుకు ఎంత ఘనమైన, అసమానమైన ప్రజాదరణ ఉన్నప్పటికీ.. కేవలం సంఖ్యాపరంగా కొంచెం ఎక్కువ మంది ఎమ్మెల్యేలను మానిప్యులేట్ చేయడం ద్వారా.. చంద్రబాబునాయుడు తెలుగుదేశం తనదిగా చేసుకోగలిగారు. ఆ తర్వాతి పరిణామాల్లో.. ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి.. అన్నతెలుగుదేశం పేరుతో ఒక పార్టీ పెట్టినా సరే.. దానికి పురిట్లోనే సంధి కొట్టింది.
అదే సమీకరణం మళ్లీ ఇప్పుడు మహా రాజకీయాల్లో రిపీట్ అవుతోందా అనిపిస్తోంది.
శివసేన అనేది నేడో రేపో అధికారికంగా శిందే పరం అవుతుంది. ఉద్ధవ్.. తనకు కూడా రాజకీయ అస్తిత్వం ఉందని చెప్పుకోవడానికి.. శివసేన అనే పదానికి ఉద్ధవ్ అని గానీ, థాక్రే అని గానీ ఒక తోకను తగిలించి మరో కొత్త పార్టీని ప్రారంభిస్తారు. తొలిసారిగా ఎన్నికలను ఎదుర్కొన్నప్పుడు.. ఆ పార్టీ కొంత ఉనికి చాటుకుంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా అంతర్ధానం అయిపోతుంది. అందుకే అసలైన పెద్దపులి కిడ్నాప్ అయిపోయి.. శిందే వర్గం శిబిరంలోనే ఉండిపోతుంది!!