సీతారామం లార్జన్ దేన్ లైఫ్

హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడి గా హను రాఘవపూడి దర్శకత్వంలో 'యుద్ధంతో రాసిన ప్రేమకథ'గా ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం 'సీతా రామం'. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక కీలక పాత్రలో…

హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడి గా హను రాఘవపూడి దర్శకత్వంలో 'యుద్ధంతో రాసిన ప్రేమకథ'గా ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం 'సీతా రామం'. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో దర్శకుడు లో హను రాఘవపూడి మీడియాతో ముచ్చటించారు. ఆయన పంచుకున్న 'సీతా రామం' చిత్ర విశేషాలివి.

మొదటి సినిమా అందాల రాక్షసి చేసినప్పుడు ఇప్పుడున్నంత వనరులు లేవు. ఆ సినిమాకి మొదట్లో అంత సక్సెస్ రాలేదు. తర్వాత రోజుల్లో కల్ట్ స్టేటస్ వచ్చింది. తర్వాత కృష్ణగాడి వీర ప్రేమ గాధ చేశాను. లై, పడి పడి లేచే మనసు ఏడాది గ్యాప్ లోనే వచ్చాయి. తర్వాత అందరిలానే కరోనా గ్యాప్ వచ్చింది. ఐతే నా జర్నీలో సక్సెస్ గురించి ఎప్పుడూ దిగులు లేదు. ఈ ప్రయాణంలో నిరాశ చెందలేదు. క్రాఫ్ట్ తెలిసుంటే ఏ పరిశ్రమలోనైనా పని వుంటుందని నమ్ముతాను.

అంచనాలని క్రియేట్ చేయడం నా ఉద్దేశం కాదు. ఒక మనిషికి ఒకసారి గౌరవించామంటే ఆ గౌరవం ఎప్పుడూ వుంటుంది. తప్పు చేస్తే తప్ప అది బ్రేక్ అవ్వదు. ఒక సినిమా బాలేదని అనుకుంటే ఆ సినిమా వరకే అనుకుంటారు కానీ తర్వాత వచ్చిన సినిమాకు అది వర్తించదు.

ఖచ్చితంగా సీతారామం సినిమా అంచనాలను అధిగమిస్తుంది. సీతారామం చాలా ప్రత్యేకమైన చిత్రం. సినిమా చూడటానికి మొదట కావలసింది క్యురీయాసిటీ. సీతారామం థియేటర్ లోనే చూడాలనే ఎక్సయిట్ మెంట్ , క్యురియాసిటీ ప్రతి ప్రమోషనల్ ఎలిమెంట్ లో కనిపిస్తుంది. థియేటర్ లోకి వచ్చిన తర్వాత సీతారామం అద్భుతమని ప్రేక్షకులు ఖచ్చితంగా అంటారు.

నాకు కోఠీ వెళ్లి పాత పుస్తకాలు కొనుక్కునే అలవాటు వుంది. అలా కొనుక్కున్న పుస్తకంలో ఒక లెటర్ కనిపించింది. ఓపెన్ చేయని లెటర్ అది. అది ఓపెన్ చేస్తే పెద్ద మేటర్ ఏమీ లేదు. ఒక అబ్బాయి కి వాళ్ళ అమ్మ రాసిన ఉత్తరం అది. అతను కనీసం దాన్ని ఓపెన్ కూడా చేయలేదు. ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఒకవేళ అందులో చాలా ముఖ్యమైన విషయం వుండి ఓపెన్ చేయకపోతే జర్నీ ఎలా వుండేది? మనిషి జీవితాన్ని నిర్దేశించే విషయం కదా అనిపించింది. ఆ అలోచని కథగా రాశా. సీతారామం పూర్తిగా ఫిక్షన్.

కథ రాసినప్పుడు మైండ్ లో నటులు ఎవరూ లేరు. ఒక డిమాండింగ్ ఫేస్ కావాలి. తెలుగులో వున్నవాళ్ళంతా ఆ సమయంలో బిజీగా వున్నారు. నేను, స్వప్న కలసి దుల్కర్ ని అనుకున్నాం. మార్కెట్ ని విస్తరించాలనే ఆలోచన మాత్రం లేదు. సీతారామం లార్జన్ దెన్ లైఫ్ స్టొరీ.

విశాల్ చంద్రశేఖర్ నాకు మంచి స్నేహితుడు. ఆతనితో పని చేయడం చాలా సౌకర్యంగా వుంటుంది. మా ఇద్దరికి మ్యూజిక్ పట్ల ఒకే అభిరుచి వుంది, ప్రతిది స్పూన్ ఫీడింగ్ చేయాల్సిన అవసరం వుండదు. ఇందులో మ్యూజిక్ అద్భుతంగా వుంటుంది. సీతారామం పాటలకు వృధ్యాప్యం రానేరాదు.

ఇందులో రెండు టైం పీరియడ్స్ వున్నాయి. 1964 కథ టేకాఫ్ పిరియడ్. స్క్రీన్ ప్లే వర్తమానానికి గతానికి మధ్య నడుస్తూ వుంటుంది.

రష్మికది చాలా కీలకమైన పాత్ర. కథని మలుపు తిప్పే పాత్ర. ఆ పాత్ర జర్నీలో ఏం జరుగుతుందో అనేది ఒకరకంగా ఈ కథ. అదే కాదు.. ఇందులో పాత్రలన్నీ కథని ఎదో ఒక మలపుతిప్పుతాయి. సుమంత్, భూమిక, ప్రియదర్శి.. అన్నీ ముఖ్యమైన పాత్రలే.

బేసిగ్గా యుద్ధ నేపధ్యంలో జరిగే కథ అంటే యుద్ధం మనకి కనిపిస్తుంది. 'యుద్ధంతో రాసిన ప్రేమ' ఎందుకంటే ఇది ఫిజికల్ వార్ కాదు. ఈ యుద్ధం ఇన్ విజిబుల్. కథలోని ప్రతి పాత్రకు ఒక యుద్ధం వుంటుంది. ఒక ఉదారణగా చెప్పాలంటే.. రాముడు.. రావణుడిని చంపడం అసలు యుద్ధమే కాదు. ఎందుకంటే రాముడి వీరత్వం ముందు ఎవరూ సరిపోరు. అయితే రావణసంహారం చేయడానికి రాముడు చేసిన ప్రయాణంలో గొప్ప యుద్ధం.,సంఘర్షణ వుంది. అలాంటి సంఘర్షణ, యుద్ధం సీతారామంలో వుంటుంది.

టీజర్ లో చెప్పినట్లు రామ్ ఒక అనాధ. కాశ్మీర్ కొండల్లో పహారా కాస్తున్న ఒక సైనికుడు. రేడియోలో తన గురించి ఒక కార్యక్రమం ప్రసారం అవుంతుంది. తను అనాధ అని తెలిసిన తర్వాత చాలా మంది అతనికి ఉత్తరాలు రాశారు. అలా వచ్చిన ఒక సర్ప్రైజ్ లెటర్ తన జీవితాన్ని మరో మలుపు తిప్పుతుంది. ఆ లెటర్ లో ఏముందో ఇప్పటికి సస్పెన్స్. ఆ లెటర్ ఓపెన్ అయిన తర్వాత ఎలాంటి మ్యాజిక్ జరుగబోతుందో అదే సీతారామం కథ.

ఉత్తరం అనేది చాలా ప్రత్యేకమైన ఎమోషన్. ప్రేమ కథకి కమ్యునికేషన్ ప్రధాన సమస్య. ఒకప్పుడు ప్రేమ కథలు చాలా హృద్యంగా ఉండటానికి కారణం.. ఇప్పుడంత కమ్యునికేషన్ లేకపోవడమేనని భావిస్తా. ఉత్తరంలో ఎమోషన్ వేరు. ఆ మ్యాజిక్ మిస్ అయిపోయాం. ఆ మ్యాజిక్ ని బాగానే డీల్ చేశానని అనుకుంటున్నా.